
చెత్తకుండీలో ఖాళీ మార్కుల జాబితా
ఎన్‌టీఆర్ హెల్త్ వర్సిటీలో మరో నిర్వాకం
సాక్షి, విజయవాడ: డాక్టర్ ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యానికి మరో నిదర్శనం ఈ సంఘటన. వర్సిటీ పరీక్షల అధికారుల వద్ద ఉండాల్సిన ఖాళీ మార్కుల షీట్ శనివారం ఉదయం చెత్త కుండీలో దర్శనమిచ్చింది. వర్సిటీ వెనుక వైపు క్యాంటీన్ సమీపంలోని చెత్తకుండీలో విద్యార్థులు గతంలో చేసుకున్న దరఖాస్తులతో పాటు ఈ ఖాళీ మార్కుల జాబితాను పడేశారు. ఈ విధంగా బయటకు వచ్చే ఖాళీ మార్కుల షీట్లు విద్యార్థుల చేతికి చిక్కితే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని వర్సిటీ సిబ్బందే చెప్తున్నారు. పీజీ మెడికల్ కోర్సులో ప్రశ్నపత్రాల లీకేజీపై ఇప్పటికే సీఐడీ దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు పారామెడికల్ కోర్సులలో మరో స్కామ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇంత జరుగుతున్నా వర్సిటీ అధికారులు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవటం లేదనడానికి శనివారం చెత్తకుండీలో దర్శనమిచ్చిన ఖాళీ మార్కుల జాబితాయే నిదర్శనమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా, వర్సిటీ ఆవరణలో చెత్తకుండీలో మార్కుల జాబితా పడి ఉన్న విషయాన్ని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బాబూలాల్ దృష్టికి ‘సాక్షి’ తీసుకువెళ్లగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదని, ఈ ఖాళీ మార్కుల షీట్‌ను చూస్తే కానీ ఎవరి నిర్లక్ష్యం వల్ల అది బయటకు వచ్చిందో చెప్పలేమని ఆయన స్పందించారు.