విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీఎంఈటీ-2014 పరీక్షల స్కామ్‌లో ప్రశ్నపత్రాలు ముద్రించిన ప్రెస్ వివరాలు లీకు వీరులకు ఎలా తెలిశాయన్న విషయంపై సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు
పీజీఎంఈటీ-2014 స్కామ్‌లో సీఐడీ ఆరా
సాక్షి, హైదరాబాద్: విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీఎంఈటీ-2014 పరీక్షల స్కామ్‌లో ప్రశ్నపత్రాలు ముద్రించిన ప్రెస్ వివరాలు లీకు వీరులకు ఎలా తెలిశాయన్న విషయంపై సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అలాగే, పరారీలో ఉన్న దళారులు, మాల్ ప్రాక్టీస్ ద్వారా పరీక్ష రాసిన విద్యార్థుల కోసమూ దేశవ్యాప్తంగా గాలిస్తున్నారు.
ప్రశ్నపత్రం ముద్రితమై వర్శిటీకి చేరకముందే అది ఈ స్కామ్‌కు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కె.మునీశ్వర్‌రెడ్డికి చేరిందని ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. పరీక్ష పత్రాలను రాష్ట్రం బయట ఉండే ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రణకు ఇచ్చే ఆరోగ్య విశ్వవిద్యాలయం దాని వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతుంది. అయితే, పీజీఎంఈటీ-2014 కర్ణాటక మణిపాల్‌లోని ప్రింటింగ్ ప్రెస్ వివరాలు మునీశ్వర్‌రెడ్డి
ముఠాకు ఎలా చేరాయన్న దానిపై సీఐడీ లోతుగా ఆరా తీస్తోంది.
సీఐడీ అదుపులో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు: మరోపక్క మునీశ్వర్‌రెడ్డికి చెందిన వర్టెక్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థకు కర్ణాటక రాజధాని బె ంగళూరులోని జయనగర్‌లోనూ శాఖ ఉంది. రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్, మెడిసిన్ కాలేజీల్లో ఇతడు అనేక మందికి మేనేజ్‌మెంట్ కోటా సీట్లు ఇప్పించాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీఐడీ అధికారులు ఆయా కాలేజీల్లో ఏదైనా ఒకటి ఇదే ప్రింటింగ్ ప్రెస్‌లో తమ ప్రశ్నపత్రాల్ని ముద్రణకు ఇవ్వడం, అలా మునీశ్వర్‌రెడ్డి లేదా అతడు ఏర్పాటు చేసిన దళారికి ఈ విషయం తెలిసిందా అన్న కోణాన్నీ పరిశీలిస్తోంది. ఇప్పటికే ప్రింటింగ్ ప్రెస్‌కు సంబంధించిన కొందరిని సీఐడీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది.
నిందితులు విజయవాడకు తరలింపు: పీజీఎంఈటీ-2014 మాల్‌ప్రాక్టీస్ స్కామ్‌కు సంబంధించి సీఐడీ శనివారం అరెస్టు చేసిన నిందితులు మునీశ్వర్‌రెడ్డి, సాయినాథ్, బి.శ్రీనివాస్, సి.గురివిరెడ్డి, ఎన్.జగదీప్, ఏవీ ఆనంద్, సి.భీమేశ్వరరావు, శ్రావణి, బి.వెంకటేశ్వరావులను ఆదివారం విజయవాడకు తరలించారు. ఈ కేసును విజయవాడ కోర్టులోనే విచారించనున్నారు.