సీట్లు అమ్ముకున్నారు! | Seats are solded | Sakshi
Sakshi News home page

సీట్లు అమ్ముకున్నారు!

Published Mon, Sep 5 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

సీట్లు అమ్ముకున్నారు!

సీట్లు అమ్ముకున్నారు!

ప్రైవేట్ వైద్య కాలేజీలపై తల్లిదండ్రుల ఆరోపణ
- ‘బి-కేటగిరీ’లో రెండో రోజూ గందరగోళమే
- 371-డి ప్రకారం సీట్లు భర్తీ చేయాలని ఆందోళన
- నీట్ ఆధారంగానే భర్తీ చేస్తున్నామన్న అధికారులు
- తొలిరోజే ఎంబీబీఎస్ సీట్లన్నీ భర్తీ.. ముగిసిన తొలి విడత కౌన్సెలింగ్
 
 ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ:
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో జరుగుతున్న బి-కేటగిరీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ రెండో రోజు గందరగోళం మధ్య ఆలస్యంగా ప్రారంభమైంది. ఆదివారం కౌన్సెలింగ్ ప్రారంభం కావడంతోనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అండతో ప్రైవేటు కళాశాలలు ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు సీట్లు అమ్ముకున్నాయంటూ నినాదాలు చేస్తూ వారు కౌన్సెలింగ్ కేంద్రంలోకి దూసుకొచ్చారు. ఇప్పటివరకు జరిగిన కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 371డీ ప్రకారం ఏపీ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్ అభ్యర్థులకే కౌన్సెలింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. ఒక దశలో కౌన్సెలింగ్ కన్వీనర్, వర్సిటీ అధికారులను నెట్టివేశారు. దీంతో ఏయే జీవోల ఆధారంగా కౌన్సెలింగ్ సాగుతుందో తెలిపేందుకు కౌన్సెలింగ్ కన్వీనర్ డాక్టర్ జయరమేశ్, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అప్పలనాయుడు ప్రయత్నించగా, అభ్యర్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. గంట అనంతరం సుప్రీంకోర్టు తీర్పులనుసరించి బి-కేటగిరీ సీట్లకు స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు వర్తించవని అధికారులు మైక్ ద్వారా వివరించారు.

నీట్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి రోజు జరిగిన కౌన్సెలింగ్‌లోనే ఎంబీబీఎస్ సీట్లన్నీ భర్తీ అయ్యాయని, బీడీఎస్ సీట్లు మాత్రమే మిగిలాయని ప్రకటించారు. అభ్యర్థులెవరైనా బీ నుంచి ఏ కేటగిరీకి మారితే ఖాళీ అయిన సీట్లకు, కొత్త కళాశాలలు ఏమైనా ఉంటే వాటికి కలిపి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంబీబీఎస్ సీట్ల భ ర్తీ వివరాలను వెబ్‌సైట్‌తో పాటు వర్సిటీ నోటీసు బోర్డులో పెట్టినట్లు చెప్పారు. నీట్‌లో 91,087 ర్యాంకర్(స్థానికంగా 2,123) ఈ కౌన్సెలింగ్‌లో చివరి ఎంబీబీఎస్ సీటు పొందినట్లు తెలిపారు. అలాగే నీట్‌లో 91,989 ర్యాంకర్(స్థానికంగా 2,143) తొలి బీడీఎస్ సీటును తీసుకున్నట్లు వివరించారు. దీంతో ఎంబీబీఎస్ సీట్లన్నీ తొలి రోజే భర్తీ అయినట్లు తెలుసుకున్న అభ్యర్థుల తల్లిదండ్రులు కౌన్సెలింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. పోలీసు బందోబస్తు నడుమ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ఏడున్నర గంటలకు ముగిసింది. రెండో రోజు అందుబాటులో ఉన్న 367 బీడీఎస్ సీట్లలో 245 సీట్లు భర్తీ అయ్యాయి.
 
 పీఆర్‌వో ఓవరాక్షన్
 కౌన్సెలింగ్ జీవోలపై అధికారులు అవగాహన కల్పిస్తున్న సమయంలో అవసరం లేకపోయినా వర్సిటీ పీఆర్‌వో జోక్యం చేసుకుంటూ.. అభ్యర్థుల తల్లిదండ్రులను తిట్టడంతో మరింత గందరగోళం తలెత్తింది. పీఆర్‌వోపైకి అభ్యర్థుల తల్లిదండ్రులు దూసుకువచ్చారు. దీంతో అధి కారులు జీవో సంబంధిత వివరాలను చెప్పకుండానే పోలీసుల బందోబస్తు మధ్య కౌన్సెలింగ్ హాల్‌కు చేరుకోవాల్సి వచ్చింది. అనంతరం అధికారులు మైక్ ద్వారా వివరణ ఇచ్చారు.
 
 ‘371డీ’ రగడ
 అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 371డీ ఏయూ, తెలంగాణ, రాయలసీమ అనే మూడు పరిధులుగా ఉంటుంది. ఈ మూడు ఏరియాల్లో ఎక్కడ వైద్య కళాశాల ఉంటే అక్కడి స్థానికులకు 85 శాతం సీట్లు, మిగిలిన రెండు ఏరియాల్లోని అభ్యర్థులు అన్ రిజర్వుడ్ మెరిట్ కింద 15 శాతం సీట్లు కోసం పోటీపడవచ్చు. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లతోపాటు ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా అయిన ఎ-కేటగిరీ సీట్లకు 371డీ వర్తిస్తోంది. ఇందులో స్థానిక, స్థానికేతర, కుల రిజర్వేషన్లు వర్తిస్తాయి. అయితే , బి-కేటగిరీ(యాజమాన్య కోటా) సీట్లకు ఈ విధమైన స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు వర్తించవు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో తీర్పులు కూడా ఉన్నాయని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. బి-కేటగిరీ సీట్లకు ఏరియా, లోకల్, నాన్‌లోకల్, కుల రిజర్వేషన్లు వర్తించవు.
 
 ‘నీట్’ ఆధారంగా బి-కేటగిరీ సీట్ల భర్తీ
 గతంలో ప్రైవేట్ కళాశాలల్లో 50 శాతం ఎ-కేటగిరీ, మరో 10 శాతం బి-కేటగిరీ సీట్లను కూడా యూనివర్సిటీ భర్తీ చేసేది. మిగిలిన సీట్లను మేనేజ్‌మెంట్ కోటా కింద ఆయా కళాశాలలే ఇతర రాష్ట్రాల వారికి కేటాయించేవి. గతేడాది ప్రైవేట్ కళాశాలల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాకు, మిగిలిన 50 శాతంలో 35 శాతం బి-కేటగిరీ, మరో 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. బి-కేటగిరీలోని 35 శాతం సీట్ల భర్తీకి ప్రైవేట్ మెడికల్ కళాశాలల అసోసియేషన్ పేరుతో గతేడాది దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అప్పుడు కూడా ఆ పరీక్షలో అర్హత సాధించిన అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఈ ఏడాది ప్రత్యేక ప్రవేశ పరీక్ష కాకుండా ‘నీట్’ ఆధారంగా బి-కేటగిరీ సీట్లను భర్తీ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే, కొంతమంది అభ్యర్థులు 371డీకి విరుద్ధంగా ఏపీ, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. 371డీని అమలు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందంటూ యూనివర్సిటీ దృష్టికి తీసుకొచ్చినా తమకేమి ఆదేశాలు అందలేదని వర్సిటీ అధికారులు కౌన్సెలింగ్ కొనసాగించారు. ఒకవేళ 371డీ ప్రకారం సీట్లు కేటాయించాల్సి వస్తే కుల రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

 ఎన్‌ఆర్‌ఐ కోటా 15 శాతం
 గతేడాదికి ముందు సంవత్సరాల్లో బి-కేటగిరీలో 10 శాతం సీట్లు ఉండేవి. వాటిని 371డీ ప్రకారమే యూనివర్సిటీ భర్తీ చేసేది. మిగిలిన 40 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింది ఇష్టమొచ్చిన వారికి, ఇతర రాష్ల్రాల వారికి కూడా ఇచ్చేవారు. అయితే, గతేడాది నుంచి బి-కేటగిరీలో 35 శాతం సీట్లు, సి-కేటగిరీలో 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా పేరుతో యాజమాన్యాలు సీట్లు కేటాయిస్తున్నాయి. బి-కేటగిరీ సీట్లను యూనివర్సిటీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తుండగా, సి-కేటగిరీ ఎన్‌ఆర్‌ఐ సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయి. గతంలో మాదిరిగా 371డీ ప్రకారమే 35 శాతం సీట్లను స్థానికులు, స్థానికేతరులకు.. అంటే ఏపీ, తెలంగాణ అభ్యర్థులకే కేటాయించాలని కోరుతున్నారు. ఇలా స్థానిక, స్థానికేతరులకు సీట్లు కేటాయించాలన్నప్పుడు కుల రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 1,000 సీట్లు ఉంటే అందులో 677 సీట్లు బి-కేటగిరీ, అలాగే డెంటల్‌లో 367 బి-కేటగిరీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
 
 గందరగోళానికి కారణం?
 ఎన్నడూ లేని విధంగా కన్వీనర్ కోటా సీట్లు భర్తీ కాకుండా ప్రభుత్వం ఈ ఏడాది ప్రైవేట్ కళాశాలల్లోని బి-కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించింది. మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం రెండో విడత కౌన్సెలింగ్ సమయానికి సుమారు 400 సీట్ల వరకు అదనంగా వస్తున్నాయని తెలిసినా ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లోని బి-కేటగిరీ సీట్లకు ప్రభుత్వం తొందరపడి కౌన్సెలింగ్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా బి-కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్‌ల కంటే ముందుగానే ఏపీలో నిర్వహించారు. మరోపక్క తెలంగాణలో అసలు ఎంసెట్ పరీక్షే నిర్వహించలేదు. దీంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. ఇప్పుటికిప్పుడు బి-కేటగిరీ సీట్లలోనైనా చేరాలనే ఆలోచనలోకి అభ్యర్థులను ప్రభుత్వం నెట్టింది. దీంతో ఇతర రాష్ట్రాల వారికి సీట్లు కేటాయిస్తున్నారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement