ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు రంగం సిద్ధం | Ready to MBBS, BDS admissions | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు రంగం సిద్ధం

Published Tue, Sep 13 2016 4:01 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు రంగం సిద్ధం

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు రంగం సిద్ధం

- సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నోటిఫికేషన్ జారీ

- ఈ నెల 15న ర్యాంకుల వెల్లడి

- 17 నుంచి 20 వరకు వెరిఫికేషన్

- ఆ వెంటనే వెబ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్

- అడ్మిషన్లకు నెలరోజుల గడువు కోరుతూ సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్

 

 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 15న ఎంసెట్-3 ర్యాంకులు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలుకానుంది. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అనంతరం విద్యార్థుల మొబైల్ ఫోన్లకు సమాచారం పంపుతారు. ఆ తర్వాత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. విద్యార్థులు ఈ నెల 21, 22 తేదీల్లో తమ ఆప్షన్లను తెలియజేయాల్సి ఉంటుంది.

ఈ నెలాఖరులోగా వైద్య సీట్ల భర్తీ పూర్తి కావాల్సి ఉన్నందున.. వెరిఫికేషన్‌కు తక్కువ సమయం ఇచ్చి ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు వచ్చే నెలాఖరుకు సమయం ఇస్తే ఆ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు గడువుపై తీర్పు ఇచ్చే వరకు వేచి చూడకుండా వేగంగానే సీట్ల భర్తీ చేపట్టాలని నిర్ణయించారు. అడ్మిషన్లకు నెల రోజులు గడువు కోరుతూ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కాగా, ప్రైవేటు కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ సీట్లకు కూడా నేడో రేపో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నోటిఫికేషన్ జారీకానుంది.


వెరిఫికేషన్ కేంద్రాలు ఇవీ..

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 4, వరంగల్, విజయవాడల్లో ఒక్కో కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీ పీజీఆర్‌ఆర్‌సీడీఈ కేంద్రం, మారేడుపల్లిలోని ప్రభుత్వ ప్రింటింగ్ టెక్నాలజీ సంస్థ, గగన్‌మహల్‌లోని ఎ.వి.ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కాలేజీ, కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో, వరంగల్‌లోని కాకతీయ వర్సిటీ, విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో నిర్వహిస్తారు. వెరిఫికేషన్  ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ వారికి జేఎన్‌టీయూలో, నాన్ లోకల్ వారికి విజయవాడ ఎన్టీఆర్ వర్సిటీలో వెరిఫికేషన్ నిర్వహిస్తారు. విద్యార్థులు వెరిఫికేషన్ సందర్భంగా ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.2 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు రూ.వెయ్యి చెల్లించాలి. ఈ ఆరు కేంద్రాల్లో ఏ రోజు ఎన్ని ర్యాంకుల వారు హాజరుకావాలో నోటిఫికేషన్‌లో ప్రస్తావించారు. 17న  1 నుంచి 2 వేల వరకు ర్యాంకులు పొందిన అభ్యర్థులు హాజరుకావాలి. 18న 2,001 నుంచి 4,500 ర్యాంకుల వరకు, 19న 4,501 ర్యాంకు నుంచి 9 వేల ర్యాంకు వరకు హాజరుకావాలి. చివరిరోజు 20న 9 వేల ర్యాంకులకు పైబడిన వారు హాజరుకావాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement