17 నుంచి ఎంసెట్-3 కౌన్సెలింగ్
- 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. 20, 21 తేదీల్లో ఆన్లైన్లో ఆప్షన్లు
- 22, 23 తేదీల్లో సీట్ల కేటాయింపు.. 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 17న ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంసెట్-3 ఫలితాలు, ర్యాంకులు విడుదల చేశాక.. 17 నుంచి 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతారు. వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా వారి మొబై ల్ నంబర్‌కు పాస్‌వర్డ్ పంపిస్తా రు. విద్యార్థులు 20, 21 తేదీల్లో ఆన్లైన్లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 22, 23 తేదీల్లో సీట్ల కేటాయింపును ప్రకటిస్తారు. నిర్ధారించిన రోజున విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
23, 24 తేదీల్లో బీ కేటగిరీకి ఆప్షన్లు..
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 35 శాతం బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్లకు నేటి నుంచి ప్రవేశాల ప్రక్రియ మొదలుకానుంది. దీనికి సంబంధించి ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. గురువారం నుంచి 19 వరకు విద్యార్థులు తమ సర్టిఫికెట్లను ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్లను పరిశీలించి, మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ఆ జాబితా ప్రకారం విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. ఉస్మానియా వర్సిటీలోని దూర విద్యా కేంద్రంలో ఈ నెల 23, 24 తేదీల్లో కాళోజీ ఆరోగ్య వర్సిటీ, ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో ప్రైవేటు కాలేజీల సంఘం కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. సీటు పొందిన వారు వెంటనే మొదటి ఏడాది ఫీజును చెల్లించాలని, మరో ఏడాదికి గ్యారంటీ చూపించాల్సి ఉంటుందని ప్రైవేటు మెడికల్ కాలేజీ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 27 నాటికి కాలేజీల్లో చేరాలన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 15 శాతం ఎన్నారై కోటా సీట్లకు ప్రత్యేకంగా కాలేజీల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తారని వెల్లడించారు.
గడువులోగా పూర్తి చేసేందుకే..
నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో అడ్మిషన్లను ఈ నెలాఖరుకే పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-3 నిర్వహిం చడంతో ప్రవేశాలు ఆలస్యమయ్యాయి. దీంతో గడువులోగా ప్రవేశాలు పూర్తి చేయడం సాధ్యం కాదని భావించిన సర్కారు.. అదనంగా నెల సమయం కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కానీ సుప్రీం నుంచి అనుమతి వస్తుందో, రాదోననే సందేహంతో.. ఈ నెలాఖరులోగానే ప్రవేశాలు పూర్తి చేసేలా ఈ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది.