డెంటల్, మెడికల్ పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సుల్లో 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌పై సందిగ్ధత వీడలేదు.
- జూన్ రెండో వారంలో నిర్వహించే అవకాశం
- అంతకుముందు ఎండీఎస్ కౌన్సెలింగ్
విజయవాడ, న్యూస్‌లైన్ : డెంటల్, మెడికల్ పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సుల్లో 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌పై సందిగ్ధత వీడలేదు. భారతీయ వైద్య మండలి నియమ నిబంధనల ప్రకారం జూలై 10 నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటివ రకు కౌన్సెలింగ్ నిర్వహణ తేదీలపై డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
దానికితోడు రాష్ట్రంలోని పోస్టుగ్రాడ్యుయేషన్ సీట్ల భర్తీకి సంబంధించి ఎంసీఐ నుంచి కొన్ని కళాశాలలకు ఎన్‌వోసీలు రావాల్సిఉంది. ఏకీకృత ఫీజు విధానంపై భిన్నవాదనలు వినిపించడం, ఈ విషయంలో గవర్నర్ సైతం చొరవ చూపక పోవడంతో ఈ వ్యవహారం తేలేవరకు కౌన్సెలింగ్ జరిపే అవకాశాలు కనిపించడం లేదు. ఎప్పుడు నిర్వహించేది వర్సిటీ అధికారులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరోవైపు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజ్ విదేశాల్లో ఉన్నందున ఆయన వచ్చిన తర్వాత కౌన్సెలింగ్ నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.
ఆదినుంచీ వివాదాలే..
ఈ ఏడాది పీజీ అడ్మిషన్లకు సంబంధించి ఆదినుంచీ వివాదాలమయంగానే మారింది. తొలుత నిర్వహించిన పీజీమెట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత, అనర్హులకు ర్యాంకులు వచ్చాయంటూ పలువురు ఆందోళన చేయడంతో పేపరు లీకేజీ వ్యవహారం బట్టబయలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించారు. రెండోసారి నిర్వహించిన పీజీమెట్ ఫలితాలను పదిహేను రోజుల కిందటే వర్సిటీ ప్రకటించింది.
పోస్టుగ్రాడ్యుయేషన్ సీట్లకు ప్రైవేటు కళాశాలలో ఫీజుల విషయంలో అభ్యంతరాలు తలెత్తడం, కొన్ని కళాశాలలకు ఎన్‌వోసీలు రాకపోవడంతో కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించడంలో జాప్యం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో కౌన్సెలింగ్ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
జూన్ పదో తేదీ తర్వాత మెడికల్ పీజీ కౌన్సెలింగ్ నిర్వహించాలనే నిర్ణయంతో ఉన్నారు. కాగా ఎండీఎస్ కౌన్సెలింగ్ ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి అనంతరం ఫీజు విషయంలో స్పష్టత లేక వాయిదా వేసిన విషయం తెలిసిందే. మెడికల్ పీజీ కౌన్సెలింగ్‌కు రెండు రోజుల ముందు డెంటల్ పోస్టుగ్రాడ్యుయేషన్ (ఎండీఎస్) కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అప్పటికి ఫీజుల విషయంలో నెలకొన్న గందర గోళం పరిష్కారం కావాల్సిఉంది.