కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు
రాష్ట్రంలోని ఎనిమిది నగరాల్లో నిర్వహణ
మే మొదటివారంలో ఫలితాల విడుదల
విజయవాడ, వైద్యవిద్య పోస్టుగ్రాడ్యుయేషన్, డిప్లొమా కోర్సుల్లో వచ్చే విద్యాసంవత్సరం(2014-15) అడ్మిషన్లకోసం ఈ నెల 27న ప్రవేశ పరీక్ష(పీజీ-మెట్) నిర్వహించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పీజీమెట్‌ను తిరిగి నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు శుక్రవారం సమర్థించిన నేపథ్యంలో.. ముందుగా ప్రకటించిన ప్రకారం 27న ప్రవేశపరీక్ష నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధంచేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లమధ్య ఎంట్రెన్స్‌ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో నిర్వహించి రద్దయిన పరీక్షకు 15,194 మంది విద్యార్థులు హాజరవగా, ఈసారి కొత్తవారికీ అవకాశమివ్వడంతో మరో 549 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 8 నగరాల్లోని 24 కేంద్రాల్లో ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షను నిర్వహిస్తారు.
విజయవాడలోని మేరీస్టెల్లా కళాశాలకు బదులుగా పీవీపీ ఇంజనీరింగ్ కళాశాలలో, గుంటూరులోని ఏసీ కళాశాలకు బదులుగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈసారి పరీక్షను నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. మే మొదటివారంలో ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ జామర్లు ఏర్పాటు చేస్తున్నామని, హాల్‌టికెట్, పెన్ను మినహా సెల్‌ఫోన్, బ్లూటూత్ లాంటి పరికరాలను లోపలికి అనుమతించేది లేదని తెలిపారు. ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా పరీక్షించాకే పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. మెడికల్ పీజీ రీఎంట్రన్స్‌కు సంబంధించి.. హాల్ టికెట్‌లను వర్సిటీ వెబ్‌సైట్ జ్ట్టిఞ//ఠీఠీఠీ.్టటఠజిట.ౌటజలో ఐదురోజుల కిందటే ఉంచినట్లు అధికారులు తెలిపారు.
‘పీజీ-మెట్’ పునఃనిర్వహణ సరైనదే: హైకోర్టు
హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్ష (పీజీ-మెట్)ను తిరిగి నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ నెల 27వతేదీన పీజీ-మెట్ తిరిగి నిర్వహించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 69ని కొట్టివేసేందుకు నిరాకరించింది. జీవో 69 కొట్టివేయాలంటూ 90 మందికి పైగా విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు శుక్రవారం తీర్పు వెలువరించారు. అవకతవకలు జరిగినప్పుడు పాత పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఆ అధికారాన్ని అహేతుకమైనదిగా ప్రకటించజాలమని న్యాయమూర్తి తన తీర్పులో తేల్చి చెప్పారు. కొందరి అత్యాశకు అమాయకులైన ఎందరో విద్యార్థులు బాధితులుగా మారారనడంలో సందేహం లేదని జస్టిస్ నవీన్‌రావు స్పష్టం చేశారు.
రేపే మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష
Published Sat, Apr 26 2014 12:50 AM | Last Updated on Tue, Oct 16 2018 3:26 PM
Advertisement
Advertisement