తెలంగాణ ఆరోగ్య వర్సిటీ వీసీగా కరుణాకర్‌రెడ్డి
♦ ఎట్టకేలకు మొదలైన ప్రక్రియ... పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
♦ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు
సాక్షి, హైదరాబాద్/హన్మకొండ: ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట వరంగల్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా డాక్టర్ బందె కరుణాకర్‌రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం శుక్రవారం సంతకం చేశారు. కరుణాకర్‌రెడ్డి ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఇక వచ్చే వైద్య విద్యా సంవత్సరం నుంచి ఈ వర్సిటీ పూర్తిస్థాయిలో పనిచేయనుంది. ఇప్పటివరకు విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి జరుగుతోన్న కార్యకలాపాలన్నీ దీని కిందకు రానున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు 4, ప్రైవేటు వైద్య కళాశాలలు 12 ఉన్నాయి. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 11 డెంటల్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోకి రానున్నాయి. వీసీ నియామకం జరిగాక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే 80 పోస్టుల భర్తీకి సీఎం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వీసీ ఆధ్వర్యంలో వాటి భర్తీ చేపడతారు. వరంగల్‌లో విశ్వవిద్యాల యానికి భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది.