తెలంగాణలో 24 నుంచి పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ | April 24 from PG Medical web counseling in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 24 నుంచి పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్

Published Fri, Apr 22 2016 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

తెలంగాణలో 24 నుంచి పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్

తెలంగాణలో 24 నుంచి పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి...
* 85 శాతం సీట్లు లోకల్ అభ్యర్థులకే
* జూన్ 1కి ముగియనున్న కౌన్సెలింగ్
* ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ రవిరాజు వెల్లడి

విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా) కోర్సులో అడ్మిషన్లకు వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ఏపీలో, 24 నుంచి తెలంగాణలో ప్రారంభంకానుంది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణకు విడివిడిగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పీజీ మెడికల్ సీట్ల అడ్మిషన్లకు ఈ ఏడాది కొత్తగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు.

కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు మే ఒకటో తేదీలోగా చేరాలని, రెండో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.

85 శాతం సీట్లు లోకల్: లోకల్ సీట్లు 85% స్థానిక అభ్యర్థులకు కేటాయిస్తారు. వీరితోపాటు అన్‌రిజర్వుడు (మెరిట్) కింద 15 శాతం సీట్ల కోసం ఇరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆయా ర్యాంకుల వారీగా హెల్ప్‌లైన్ సెంటర్లకు హాజరైన అభ్యర్థులు సర్టిపికెట్ల వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యాక రెండ్రోజుల్లోగా (నిర్దేశించిన తేదీల్లోగా) వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. మరో ఒకటి, రెండు రోజుల్లో సీట్లు అలాట్ అవుతాయన్నారు. అభ్యర్థులు పెట్టుకున్న ఆప్షన్లను ప్రతిసారీ ప్రింటౌట్ తీసుకోవడం మంచిదని సూచించారు. మే నెల రెండో వారంలో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. జూన్ 1 నాటికి కౌన్సెలింగ్ ముగుస్తుందన్నారు. అభ్యర్థులకు ర్యాంకుల ప్రకారం ఎన్నిసార్లయినా ఆప్షన్లు పెట్టుకోవచ్చన్నారు.
 
నాన్ సర్వీస్ అభ్యర్థులకు..
ఏపీ అభ్యర్థులు విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ క్యాంపస్, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ, తిరుపతి ఎస్వీయూలో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ అభ్యర్థుల కోసం విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, హైదరాబాద్ జేఎన్‌టీయూ, వరంగల్ కాకతీయ వర్సిటీలో హెల్ప్‌లైన్ సెంటర్లున్నాయి.
 
ఇన్ సర్వీస్ అభ్యర్థులకు..
ఏపీకి చెందిన సర్వీస్ అభ్యర్థులందరూ ఈనెల 24న, తెలంగాణ అభ్యర్థులు 26న పైన తెలిపిన సెంటర్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలి. వికలాంగుల కోటాకు చెందిన ఇరు రాష్ట్రాల అభ్యర్థులు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో మాత్రమే ఈనెల 24న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలి. కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజుకు కింద ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,000 చెల్లించాలి.
 
తేవాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లు
హాల్‌టికెట్, పదోతరగతి సర్టిఫికెట్, ఇంటర్, ఎంబీబీఎస్, ఇంటర్న్‌షిప్, మొదటి నుంచి ఫైనలియర్ వరకు ఎంబీబీఎస్ మార్కుల మెమోలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఎంబీబీఎస్ ఫస్ట్ టు ఫైనలియర్ స్టడీ సర్టిఫికెట్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెంది బయట రాష్ట్రాల్లో చదివిన అభ్యర్థుల తల్లిదండ్రులు పదేళ్ల రెసిడెన్స్ సర్టిఫికెట్, శాశ్వత కులధ్రువీకరణ సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలి.
 
తొలిరోజు 1,500 ర్యాంకుల వరకు
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 22న ఒకటి నుంచి 1,500 ర్యాంకుల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆహ్వానించారు. వీరు ఈనెల 23, 24 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. 23న 1,501 నుంచి 4,500 ర్యాంకు వరకు అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరై 24, 25 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. 24న 4,501 నుంచి చివరి ర్యాంకు వరకు వెరిఫికేషన్‌కు హాజరై 25, 26 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. తెలంగాణ అభ్యర్థులు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లలో ఈనెల 24న మొదటి నుంచి 1000 ర్యాంకుల వరకు హాజరై 25, 26 తేదీల్లో, 25న 1001 నుంచి 4 వేల ర్యాంకు వరకు అభ్యర్థులు హాజరై 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. 26న 4001 నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరై 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి.
 
సీట్ల వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఏయూ ప్రభుత్వ కళాశాలల్లో 396 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 276 సీట్లుండగా, ఇందులో 430 నాన్‌సర్వీస్, 232 సీట్లు సర్వీస్ అభ్యర్థులకు కేటాయిస్తారు. ఎస్వీయూ పరిధిలో ప్రభుత్వ కళాశాలల్లో 235 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లోని కన్వీనర్ కోటాలో 119 సీట్లు అందుబాటులో ఉండగా, ఇందులో 227 నాన్‌సర్వీస్ అభ్యర్థులకు, 127 సర్వీస్ అభ్యర్థులకు కేటాయిస్తారు. ఓయూ ప్రభుత్వ కళాశాలల్లో 530 సీట్లు, ప్రైవేటు కన్వీనర్ కోటాలో 298 సీట్లున్నాయి.

ఇందులో 533 సీట్లు నాన్‌సర్వీస్, 295 సీట్లు సర్వీస్ అభ్యర్థులకు కేటాయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో 61 సీట్లున్నాయి. మొత్తం పీజీ మెడికల్ 2,587 సీట్లుండగా, కన్వీనర్ కోటా కింద ఇరు రాష్ట్రాల్లో కలిపి 1,905 సీట్లు, మేనేజ్‌మెంట్ కోటా కింద 682 సీట్లున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement