
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉన్న సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లు కలిపి 3,662 ఉన్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ప్రభుత్వ పరిధిలో (ఆల్ ఇండియా కోటాతో కలిపి) 3,662 సీట్లు ఉన్నాయి. వీటికోసం అభ్యర్థులు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. రాష్ట్ర ర్యాంకులనుబట్టి చూస్తే 32 వేలమందికిపైనే ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఏడాది మార్కులు ఎక్కువగా వచ్చినందున గత ఏడాది కటాఫ్‌లతో బేరీజు వేయలేమని, అందువల్ల సీటు ఎక్కడొస్తుందనేని అంచనా వేయలేమని అభ్యర్థులు పేర్కొంటున్నారు. వీరు వరుసగా విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు వైద్యకళాశాల, కర్నూలు, తిరుపతి, కాకినాడ కాలేజీలను తమ ప్రాధాన్యతలుగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కింద అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలల్లోనూ మౌలిక వసతులు కల్పించడం, అధ్యాపకులను నియమించడంతో మిగతా కాలేజీల్లో సీటు వచ్చినా బావుంటుందని పేర్కొంటున్నారు. త్వరలోనే ఆన్‌లైన్ పరిశీలనకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.