కోట్లు ఇస్తేనే సీట్లు!
* ప్రభుత్వ వైద్య కళాశాలలపై కేంద్రానికి ఏపీ సర్కారు లేఖ
* 9 కాలేజీలకు మొత్తం రూ. 945 కోట్లు అవసరమని నివేదిక
* మూడు కాలేజీల్లో 50 చొప్పున సీట్లు పెంచాలని వినతి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ ఏడాది కేటాయించిన ఎంబీబీఎస్ సీట్లను నిలబెట్టుకోవటం అధికారులకు భారంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వదు, కేంద్రం నుంచి ఇంకా రాలేదు. ఈ పరిస్థితుల్లో సీట్లను నిలబెట్టుకోవడానికి రూ. 945 ఇవ్వాలంటూ కేంద్రం మీదే భారమేస్తూ నివేదిక ఇచ్చారు. వాస్తవానికి వైద్య కళాశాలలకు సీట్లు కేటాయించిన మూడు నెలలో వసతులు కల్పించాలని భారతీయ వైద్యమండలి నిబంధనలు విధించింది.
దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అప్పట్లో రాతపూర్వక హామీ ఇచ్చారు కూడా. ఆ తర్వాత రాష్ట్ర అధికారులు ఈ ఏడాది రాష్ట్రం విడిపోయిన కారణంగా పలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నామని, సిబ్బంది, మౌలిక వసతుల కల్పన, నిధులు సమకూర్చటంలో ఇబ్బందులున్నాయని.. కాబట్టి ఈ ఏడాది కాస్త సడలింపునివ్వాలని కోరుతూ ఎంసీఐకి లేఖ రాశారు. వచ్చే ఏడాదికైనా వసతుల కల్పన కష్టం గా ఉన్న నేపథ్యంలో తమకు తక్షణమే ఆర్థిక సా యం అందించాలని కేంద్రాన్ని కోరారు.
వచ్చిన సీట్లనూ మీ ఖాతాలోనే వేసుకోండి
దేశవ్యాప్తంగా ఈ ఏడాది వైద్య కళాశాలల్లో సీట్లు పెంచుకోవచ్చునని, వాటికి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్‌ఎస్) కింద నిధిలిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ చెప్పింది. ఇందుకు ఒక్కో సీటుకు రూ. 1.20 కోట్లు వ్యయమవుతుంది. ఇందులో 70 శాతం కేంద్రం ఇచ్చేందుకు ఒప్పుకుంది. అయితే అప్పటికే మన రాష్ట్రంలో వైద్య కళాశాలలకు అదనంగా 300 సీట్లు వచ్చాయి. ఈ సీట్లను కూడా సీఎస్‌ఎస్ స్కీంలో కలిపేసి నిధులివ్వాలని ఏపీ కేంద్రాన్ని కోరింది. దీంతో పాటు అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల, రిమ్స్ శ్రీకాకుళం, రిమ్స్ కడప కళాశాలలకు అదనంగా 50 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలని కోరింది. వచ్చిన సీట్లను నిలబెట్టుకోవాలన్నా, అదనపు సీట్లను పొందాలన్నా ప్రస్తుత అంచనా ల ప్రకారం రూ. 945 కోట్లు అవసరమని వైద్య విద్యాశాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.