సాక్షి, అమరావతి: హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం సముచితం, ప్రశంసనీయం, ఆహ్వానించాల్సిన విషయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేందుకు సంబంధించిన బిల్లును మంగళవారం ఆమె అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ విజయాలు, ఆయన అందించిన సేవలు, ఆయన చూపిన దాతృత్వం, మంచితనం, గొప్పదనం భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అందుకే హెల్త్ వర్సిటీకి ఆయన పేరు పెట్టామని స్పష్టం చేశారు. ‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది ప్రాణాలు కాపాడారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఈ నేపథ్యంలో హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడంలో తప్పేంటి? ఎన్టీఆర్ను వాడు, వీడు అని సంబోధించిన వ్యక్తి చంద్రబాబు
అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఫొటో, పేరు కనిపించకూడదని మాట్లాడతారు. ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగువారు ఎవరూ మర్చిపోలేదు. (2019 ఎన్నికల ముందు మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు) చంద్రబాబు, రాధాకృష్ణ మనసులో ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయో ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.
ఆ మాటలు చంద్రబాబువి కాదా? ‘ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీయే ఉందా ఇంకా.. అని రాధాకృష్ణ అడిగితే, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు మారుస్తాం.. అది ఎప్పుడో మరిచిపోయారు.. వాడిది అయిపోయింది.. వాడిది అప్పుడు’ అని ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడారు. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అప్పట్లో చంద్రబాబు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. గతంలో ప్రచురితమైన పత్రికల్లో ఇది కనిపిస్తుంది. ఇదీ చంద్రబాబుకు ఎన్టీఆర్ మీదున్న గౌరవం. (ఆ క్లిప్పింగ్స్ ప్రదర్శించారు) సీఎం వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్ మీద అపార గౌరవం ఉంది కాబట్టే ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు’ అని చెప్పారు.
ప్రజలతో విడదీయలేని బంధం
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంటేనే తెలుగు ప్రజలకు విడదీయలేని ఒక బంధం.. ఒక భావోద్వేగం అని మంత్రి రజిని చెప్పారు. ‘వైఎస్సార్ మరణవార్త విని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన 800 మంది అందుకు సాక్ష్యం. ఒక మనిషి శాసిస్తే.. గాడి తప్పిన ఒక రాష్ట్రం పట్టాలెక్కుతుందంటే ఆ వ్యక్తి డాక్టర్ వైఎస్సార్. వైఎస్సార్ గొప్ప మానవతావాది. పరిపాలన దక్షుడు.
ప్రజల కోసమే బతికాడు. ప్రజల కోసం వెళ్తూనే మరణించాడు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 8 మెడికల్ కాలేజీలు ఉంటే.. వైఎస్సార్ 3 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. ఇప్పుడు ఆయన తనయుడుగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో మరో 17 మెడికల్ కాలేజీలను తీసుకురాబోతున్నారు. మొత్తం మన రాష్ట్రంలో 28 మెడికల్ కాలేజీలు ఉండబోతున్నాయి. వైఎస్సార్ ఎన్నో గొప్ప పనులు చేసినందున మనం క్రెడిట్ తీసుకోవడంలో తప్పు లేదు’ అని చెప్పారు.
ఔరంగజేబుకు, చంద్రబాబుకు తేడా లేదు
నారాయణ స్వామి, డిప్యూటీ సీఎం
చంద్రబాబు, ఔరంగజేబు ఒక్కటే. మామను వెన్ను పోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. తమ్ముడిని కూడా మానసిక సంక్షోభంతో ఇంటికే పరిమితం చేశాడు. చంద్రబాబు పగ, ఈర్ష్య, ద్వేషంతో పుట్టాడు. ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని సవాల్ విసరడం కాదు.. జడ్ కేటగిరీ భద్రత లేకుండా నువ్వు రావాలి. పేద వారిని దగ్గరకు తీసుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉందా? సత్య హరిశ్చంద్రుడిని వైఎస్ జగన్ రూపంలో చూశాం. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేందుకు కుప్పం నాంది పలుకుతుంది.
ఎన్టీఆర్ అంటే మాకు గౌరవం
గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంతో గౌరవం. వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తెచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదే. అందుకే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెడుతున్నాం. రాజకీయంగా ఏమీ లేక, టీడీపీ సభ్యులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారు.
బాబు హయాంలో ఎన్టీఆర్ పేరుపై ఒక్క పథకం లేదు
అబ్బయ్య చౌదరి, దెందులూరు ఎమ్మెల్యే
సభలో టీడీపీ సభ్యుల తీరు చాలా బాధాకరం. స్పీకర్ వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. అధికారం కోల్పోతేనే టీడీపీకి ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. అధికారంలో లేనప్పుడే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ‘ఎన్టీఆర్ పేరును ఆరోగ్యశ్రీ పథకంలో తీసేస్తా, వాడి పేరు కనబడకుండా చేస్తా, ఇక ఏ పథకానికి వాడి పేరు పెట్టను’ అని చెప్పింది చంద్రబాబే. ప్రతి పథకానికి చంద్రన్న పేరు పెట్టుకున్న వీళ్లు ఎన్టీఆర్పై ప్రేమ ఉన్నట్లు నటించడం తగదు. బాబు హయాంలో ఎన్టీఆర్ పేరుపై ఒక్క పథకం లేదు. ఎన్టీఆర్ను మా పార్టీ గౌరవించింది. హెల్త్ వర్సిటీకి ఎందుకు వైఎస్సార్ పేరు పెట్టాలనుకున్నామో తెలుసుకోకుండా ఆందోళన చేయడం తగదు.
వైఎస్సార్ పేరు ఆమోదయోగ్యం
మంత్రి, మేరుగు నాగార్జున
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి భారతదేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో ఆరోగ్యశ్రీ పేదల ఆరోగ్యానికి అండగా నిలిచింది. పేద ప్రజల కోసం ఆలోచన చేసే రూపాయి డాక్టర్‌గా వైఎస్సార్‌కు పేరుంది. అలాంటి మహనీయుడి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెడితే బాగుంటుందని భావించాం. సీఎం వైఎస్ జగన్ ఏ మండలానికి వెళ్లినా బ్రహా్మండమైన ఆస్పత్రి, జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హెల్త్ యూనివర్సిటీకి రాజశేఖరరెడ్డి పేరు ఆమోదయోగ్యం అని భావిస్తున్నాం. ఇక టీడీపీ వాళ్ల బాగోతం గురించి ఎంత చెప్పినా తక్కువే. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయులు, రామానాయుడులు సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌ను బహిరంగంగానే కొట్టారు. వీధి రౌడీగా ఉండి మర్డర్ కేసు వల్ల విజయవాడ నుంచి వెళ్లి విశాఖపట్నంలో స్థిరపడిన రామకృష్ణబాబు కూడా చేయి చేసుకున్నారు. పయ్యావుల కేశవ్ సభలో రౌడీలా ప్రవర్తించారు.
ఎన్టీఆర్ పట్ల బాబుకు గౌరవం లేదు
మంత్రి, అంబటి రాంబాబు
తెలుగుదేశం సభ్యుల ప్రవర్తన చాలా దురదృష్టకరం. రెడ్ లైన్ దాటి, స్పీకర్ పోడియం వద్దకు వచ్చి, దౌర్జన్యం చేస్తూ, కాగితాలు చించి పైకి విసరడం ఏమిటీ? ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న పచ్చ కాగితాలు తెచ్చి చించి పడేయడం చూస్తే వారికి వాళ్ల నాయకుడి మీద ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు గౌరవం ఇవ్వకూడదని ఎప్పుడూ అనుకోలేదు.
మా ప్రభుత్వం ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టింది. వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్యులు, ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఆరోగ్యశ్రీని తెచ్చిన ఆ మహానుభావుడి పేరును హెల్త్ వర్సిటీకి పెట్టాలని భావిస్తున్నాం. ఎన్టీఆర్ను అవమానించింది చంద్రబాబే. ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీకి ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.
Comments
Please login to add a commentAdd a comment