చిలకలూరిపేట/తాడేపల్లిగూడెం రూరల్/గుడివాడ టౌన్/సింహాచలం: మేనిఫెస్టో అంటే సినిమా కాదని.. దానిని విడతల వారీగా విడుదల చేస్తానని చంద్రబాబునాయుడు చెప్పడం ఏమిటోనని వైఎస్సార్‌సీపీ నేతలు ఎద్దేవా చేశారు. అసలు చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానమని వారన్నారు.
ముసలి బ్యాచ్ ఒకరినొకరు పలకరించుకోడానికే మహానాడు పెట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వంటి దుర్మార్గుడిని సమూలంగా రాజకీయాలకు దూరంగా ఉంచేలా ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. మహానాడు నేపథ్యంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు విడదల రజిని, మేరుగు నాగార్జున, మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వేర్వేరుచోట్ల టీడీపీపై విమర్శలు గుప్పించారు. వారేమన్నారంటే..
మేనిఫెస్టోపై బాబు మాట్లాడడం సిగ్గుచేటు: మంత్రి రజిని
మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడం సిగ్గుచేటు. తొలి విడత అంటూ దానిని విడుదల చేయడం ఏంటో ఎవరికీ అర్థంకాని విషయం. మేనిఫెస్టో అంటే ఏ పార్టీకి అయినా పవిత్రమైనదిగా భావించాలి. మా నాయకుడు జగనన్న మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తారు. ఇచ్చిన హామీల్లో 98 శాతానికి పైగా నెరవేర్చి ప్రజల బతుకుల్లో జగనన్న వెలుగులు నింపారు.
కానీ, చంద్రబాబు 2014లో 600కు పైగా హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా దానిని ఎవరికీ కనపడకుండా చేశారు. మేనిఫెస్టో అంటే ఆయనకు చిత్తుకాగితంతో సమానం. ఇక మహానాడు వేదికగా చంద్రబాబునాయుడు డిక్షనరీలో లేని సంక్షేమం, అభివృద్ధి, పేదలు అంటూ కొత్త రాగం అందుకున్నారు.
నిజానికి.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడానికే మహానాడును పెట్టినట్లుగా ఉంది. సైకిల్ ముందుచక్రం సంక్షేమానికి, వెనక చక్రం అభివృద్ధికి నిదర్శనమని బాబు ప్రకటించటం హాస్యాస్పదం. వాస్తవానికి సైకిల్ ముందు చక్రం దోచుకోవటానికి, వెనుక చక్రం దాచుకోవటానికి నిదర్శనం.
బాబువి తప్పుడు రాజకీయాలు: డిప్యూటీ సీఎం ‘కొట్టు’
చంద్రబాబు ఎక్కడో హైదరాబాద్‌లో ఉండి చుట్టం చూపుగా రాష్ట్రానికి వచ్చి ఇక్కడ తప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు. పిల్లనిచ్చిన సొంత మామకు వెన్నుపోటు పొడిచాడు. అటువంటి దుర్మార్గుడు ప్రజల సంతోషాన్ని నాశనం చేసేందుకు మళ్లీ ఎన్టీఆర్ బొమ్మతో ముందుకొస్తున్నాడు. ఈయనకు పవన్ తోడవుతున్నాడు. పవన్‌ను నమ్మి గ్రామాల్లో జనసేన కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చుపెడుతుంటే పవన్ మాత్రం తన సొంత సామాజికవర్గాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టేస్తున్నాడు.
తనకు సీఎం అయ్యే పరిస్థితిలేదని తెలిసి.. చంద్రబాబు సీఎం అయితే ఆయన నీడలో బతికేయవచ్చని పవన్ తప్పుడు ఆలోచన చేస్తున్నాడు. జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఓర్వలేకపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మారీచులు వస్తారు.. వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
బాబు దళిత వ్యతిరేకి: మంత్రి ‘మేరుగు’
చంద్రబాబు దళిత వ్యతిరేకి. ఆయనకు ఎస్సీలంటే చులకన. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆయన చేసిన వ్యాఖ్యలు అంబేడ్కర్‌ని అగౌరవపరిచినట్లే. ఆనాడు ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పని చంద్రబాబు ఇప్పటికీ అంబేడ్కర్ విగ్రహం పాదాల చెంతకు వచ్చి చెప్పలేదు. అది ఆయనలోని అహంకారానికి నిదర్శనం. అసలు అంబేడ్కర్ ఆలోచన విధానానికి ఆయన పూర్తి వ్యతిరేకం.
కానీ, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అంబేడ్కర్ భావజాలంతో ముడిపడి ఉంది. టీడీపీ హయాంలో దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు. దళిత మహిళలను అగౌరవపరిచినా కూడా స్పందించలేని పరిస్థితి. దళిత భూములను లాక్కున్నారని ప్రశ్నిస్తే స్వయంగా నన్నే అరెస్టుచేశారు. అదే జగనన్న పాలనలో దళితులకు ఎంతో మేలు జరిగింది.
టీడీపీ నేతలు స్క్రాప్ బ్యాచ్: కొడాలి నాని
టీడీపీ నేతలందరూ కలిసి రాజమండ్రిలో మహానాడు సభ పెట్టారు. దానివల్ల తెలుగుదేశానికి వచ్చే లాభం ఏమీ ఉండదు. వారంతా స్క్రాప్ బ్యాచ్. ప్రస్తుతం ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు ఈ కార్యక్రమం ద్వారా సిద్ధమవుతున్నాడు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందని చెప్పిన చంద్రబాబు నేడు తిరిగి ఆ మహా నాయకుని పేరు వాడుకుంటున్నారు.
1999 ఎన్నికల్లో వాజ్‌పేయిని అడ్డుపెట్టుకుని గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఆయన పేరును ఎక్కడా కనబడనివ్వలేదు. నాలాంటి అభిమానులు ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుంటే బెదిరించిన పరిస్థితులున్నాయి. ఇప్పుడు గతిలేక రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్‌ను ఈ 420 చంద్రబాబు వాడుకొంటున్నాడు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఆయన్ను చెప్పుదెబ్బలు కొడతారు. చంద్రబాబు, లోకేశ్‌కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీచేయాలి.
Comments
Please login to add a commentAdd a comment