తెలంగాణలో సమ్మె చేసిన జూనియర్ వైద్యులు మళ్లీ చిక్కుల్లో పడ్డారు. సమ్మెకాలానికి అనుగుణంగా ప్రభుత్వం కోర్సు కాలపరిమితిని పొడిగించింది.
- ఎన్టీఆర్ వర్సిటీ పాలకమండలి
- అత్యవసర భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సమ్మె చేసిన జూనియర్ వైద్యులు మళ్లీ చిక్కుల్లో పడ్డారు. సమ్మెకాలానికి అనుగుణంగా ప్రభుత్వం కోర్సు కాలపరిమితిని పొడిగించింది. దీంతో పీజీ అడ్మిషన్లకు అనుమతులొస్తాయని అంతా సంబరపడ్డారు. వీటిపై తాజాగా బుధవారం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది.
నిజానికి సమ్మె చేసిన విద్యార్థుల హౌస్‌సర్జన్ మార్చి 30 నాటికి పూర్తి కావాలి. అయితే సుమారు 600 మంది వైద్యవిద్యార్థులు 62 రోజులపాటు సమ్మె చేశారు. ఈ సమ్మె కాలంమేరకు కోర్సు పొడిగిస్తే మే 30 నాటికి అది పూర్తవుతుంది. అయితే పీజీ ప్రవేశపరీక్ష మార్చి 1న జరగనుంది. మార్చి 8న పీజీ డెంటల్ ఉంటుంది. భారతీయ వైద్యమండలి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ రెండో వారంలో కౌన్సిలింగ్ మొదలవుతుంది. మే 2 కల్లా తరగతుల్లో చేరిపోవాలి.
పొడిగించిన కోర్సు ప్రకారం మే 30 వరకూ వీళ్లు ఇంటర్న్‌షిప్‌లోనే ఉంటారు. అయితే పాలకమండలి భేటీలో తొలుత పీజీ ప్రవేశ పరీక్షకు అనుమతిద్దామని, ఆ తర్వాత భారతీయ వైద్యమండలికి షెడ్యూల్ మార్చాలని విన్నవిద్దామని తీర్మానించారు. ఈ విషయమై ఎన్టీఆర్ వర్సిటీ వీసీ డా.రవిరాజును అడగ్గా... విద్యార్థులు నష్టపోకుండా ప్రవేశపరీక్షకు అనుమతినిచ్చామని, ఆ తర్వాత ఏం చేయాలనేదానిపై ఆలోచిస్తామన్నారు.