కస్టోడియన్ సర్టిఫికెట్ సరిపోతుంది!
బీ నుంచి ఏ-కేటగిరీకి మారి కాలేజీలో చేరడంపై హెల్త్ వర్సిటీ వీసీ
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): బీ-కేటగిరీ మెడికల్ సీట్లు పొందిన అభ్యర్థులు రెండో విడత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌లో ఏ-కేటగిరీ సీటు పొందితే ఆయా కళాశాలల్లో అడ్మిట్ అయ్యేందుకు, అభ్యర్థుల వద్ద (ధ్రువపత్రాల) కస్టోడియన్ సర్టిఫికెట్, సీటు అలాట్‌మెంట్ లెటర్ ఉంటేసరిపోతుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి .రవిరాజు తెలిపారు. ఈ మేరకు అన్ని ప్రైవేటు మెడికల్ కళాశాలలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. బీ నుంచి ఏ-కేటగిరీ సీట్లు పొందిన అభ్యర్థులు సర్టిఫికెట్ల కోసం ఏపీ ప్రైవేటు మెడికల్ కళాశాల అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఇప్పటికే అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారమిచ్చినట్లు తెలిపారు. నిర్దేశించిన మేరకు ఈనెల 27న మధ్యాహ్నం 2గంటల్లోగా అభ్యర్థులు ఆయా కళాశాలల్లో అడ్మిట్ కావాలని సూచించారు.
28న మూడో విడత మెడికల్ కౌన్సెలింగ్
ఏపీలో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈనెల 28న మూడో, తుది విడత మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డా.ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈమేరకు వర్సిటీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చే సింది. అభ్యర్థులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల్లోగా వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవాలన్నారు. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు కూడా తుదివిడతకౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని తెలిపారు.
29న రెండో విడత బీ-కేటగిరీ సీట్ల మెడికల్ కౌన్సెలింగ్
ఏపీలో ప్రైవేటు మెడికల్/డెంటల్ కళాశాలల్లోని బీ-కేటగిరీ సీట్ల భ ర్తీకి ఈనెల 29న డా.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కౌన్సెలింగ్ కన్వీనర్ డా.జయరమేశ్ తెలిపారు. ఈమేరకు సోమవారం ఏపీ ప్రైవేటు మెడికల్ కళాశాలల అసోసియేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.