- ఎన్టీఆర్ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఎన్‌సీసీ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీని వాయిదా వేయాలని హైకోర్టు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఆదేశించింది. ఎన్‌సీసీ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రాధాన్యత విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో వారంరోజులపాటు కౌన్సెలింగ్ వాయిదా వేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఎన్‌సీసీ కోటా సీట్ల భర్తీ విషయంలో ఎన్టీఆర్ వర్సిటీ అధికారులు నిర్దిష్ట విధానాన్ని అనుసరించట్లేదంటూ కర్నూలు జిల్లాకు చెందిన మర్రి సాయిశ్రీ, హైదరాబాద్‌కు చెందిన మాళవిక.. మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు.
వీటిని జస్టిస్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. అండమాన్ నికోబార్‌లో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులకే సీట్ల భర్తీలో ప్రాధాన్యమిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. అంతేగాక ఎన్‌సీసీ డెరైక్టరేట్లు స్పాన్సర్ చేయని గెస్ట్ కాడెట్‌లకు సైతం సీట్లు ఇస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఒక్కో రాష్ట్రప్రభుత్వం ఒక్కోవిధంగా ప్రాధాన్యతను రూపొందించిందని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. అసలు ప్రాధాన్యతలను తమ ముందుంచాలని కేంద్రప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.