విజయవాడలో ఫలితాలు విడుదల చేసిన మంత్రి కామినేని
విజయవాడ (లబ్బీపేట): ఏపీలో తొలిసారిగా ప్రైవేటు వైద్య కళాశాలల్లోని యాజమాన్య కోటా (బి కేటగిరీ) సీట్ల భర్తీకోసం నిర్వహించిన ఎంసెట్ ఎ.సి.(అసోసియేటెడ్ కాలేజెస్) 2015 ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో గురువారం విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా సీట్ల ప్రవేశ పరీక్ష పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కులకు ఇంటర్మీడియెట్ మార్కులు కలిపిన తర్వాత మెరిట్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తామన్నారు. ఎంబీబీఎస్‌లో 700, బీడీఎస్‌లో 387 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.
తొలిసారి జరిగిన ఈ ప్రవేశ పరీక్షలో తంగెళ్ల ఆదర్శవర్ధన్ 153 మార్కులతో ఫస్ట్ ర్యాంకు, అమ్మిరెడ్డి వెంకట శివకృష్ణారెడ్డి 145 మార్కులతో రెండో ర్యాంకు, సాయిగోపాల కూరపాటి 144 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో హెల్త్ వర్సిటీ వీసీ డా. టి.రవిరాజు, రిజిస్ట్రార్ డా.ఎస్.బాబూలాల్, ఎంసెట్ ఏసీ కన్వీనర్ కొడాలి జయరమేశ్ పాల్గొన్నారు.
రేవంత్ చేసింది సరైంది కాదు
నామినేటెడ్ ఎమ్మెల్యేకు ముడుపులిచ్చిన రేవంత్‌రెడ్డి చర్య ప్రోత్సహించేది కాదని మంత్రి కామినేని చెప్పారు. ప్రజలు ఒక పార్టీకి, ఒక వ్యక్తికి ఓట్లేసి గెలిపించాక మరో పార్టీలో చేరడం సరికాదన్నారు. మ్యాగీ నూడుల్స్ విషయంలో ప్రభుత్వం శాంపిల్స్ సేకరించిందని, ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఏపీ ఎంసెట్ ఏసీ ఫలితాలు విడుదల
Published Fri, Jun 5 2015 3:47 AM | Last Updated on Sat, Sep 29 2018 6:18 PM
Advertisement
Advertisement