ఏపీ ఎంసెట్ యధాతథం | AP Govt clears doubt on EAMCET, will be held on 29 April | Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్ యధాతథం

Published Thu, Apr 28 2016 10:03 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

AP Govt clears doubt on EAMCET, will be held on 29 April

-నీట్‌పై సుప్రీం ఉత్తర్వులు వచ్చినా పరీక్ష నిర్వహణకే నిర్ణయం
-371డీ రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించనిదే నీట్ సాధ్యంకాదన్న రాష్ట్రం
-రాష్ట్ర వాదనపై మరోసారి విచారిస్తామన్న సుప్రీం కోర్టు
-యధావిధిగా పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్సు టెస్టు(ఎంసెట్)-2016 శుక్రవారం(29 ఏప్రిల్)న యధాతథంగా జరగనుందని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకటించి ఉన్నందున ఎంసెట్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని, జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) నిర్వహణపై సుప్రీంకోర్టు ఉత్తర్వులకు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు.

దీంతో ఏపీ, తెలంగాణల్లో కలిపి ఏపీ ఎంసెట్‌ను యధావిధిగా నిర్వహించడానికి కాకినాడ జేఎన్‌టీయూ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెడికల్, అగ్రికల్చర్ విభాగాల పరీక్షలు యధాతథంగా జరుగుతాయని ఎంసెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ వీఎస్‌ఎస్ కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు పేర్కొన్నారు. ఇంజనీరింగ్ పరీక్ష కోసం ఏపీలో 329, హైదరాబాద్‌లో 26 మొత్తం 355 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. మెడికల్, అగ్రికల్చర్ పరీక్ష కోసం ఏపీలో 165, తెలంగాణలో 26 కేంద్రాలను ఏర్పాటుచేశారు.

పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇన్విజిలేటర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు తదితర అధికారులనే కాకుండా పర్యవేక్షణకూ కలిపి మొత్తం 713 మందిని పరిశీలకులు, ప్రత్యేక అబ్జర్వర్లు, ఎన్‌ఫోర్సుమెంటు అధికారులను నియమించారు. అభ్యర్ధులు గంట ముందుగా పరీక్ష హాలుకు చేరుకోవాలని, పరీక్ష ప్రారంభ సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు ప్రకటించారు.

నీట్‌పై ఉదయం నుంచి సందిగ్థత
మెడికల్, డెంటల్ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)ను అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరిగా అమలు చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఎంసెట్ నిర్వహణపై కొంత సందిగ్థత ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చర్యలు ఎలా అన్న అంశంపై ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ అధికారులు న్యాయనిపుణులతో చర్చించారు. ఏపీ ఎంసెట్‌ను శుక్రవారం నిర్వహించాల్సి ఉండటం, నీట్‌పై దాఖలైన పిల్‌కు సంబంధించి గురువారమే సుప్రీంకోర్టులో విచారణ జరగనుండడంతో ముందు రోజే ఏపీ ఉన్నత విద్యామండలి అధికారులు ఢిల్లీకి చేరుకొని ఎంసెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే ప్రకటించడం, మెడికల్ విభాగంలో లక్షమంది విద్యార్ధులు పరీక్షలు రాయనుండడం తదితర అంశాలను కోర్టుకు తమ న్యాయవాది ద్వారా వినిపించారు.

ఏపీకి ఆర్టికల్ 371డీ రాష్ట్రంలో అమల్లో ఉన్నందున నీట్ నిర్వహణకు వీలుండదని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఏపీలో విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల అవకాశాల్లో స్థానికులకే ప్రాధాన్యమిచ్చేలా ప్రత్యేకంగా 371 డీ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో నీట్‌ను ఏపీలో అమలుచేయడానికి వీలుకాదని, రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాకనే నీట్ నిర్వహణకు ఆస్కారముంటుందని సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఈ విన్నపాన్ని సుప్రీంకోర్టు కూడా పరిగణనలోకి తీసుకొంటూనే దీనిపై వాదనలు తదుపరి వింటామని స్పష్టంచేసింది.

నీట్ నిర్వహణ తప్పనిసరని కేంద్రం, రాష్ట్రాలు నీట్ నిర్వహణకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)కి సహకరించాలని స్పష్టంచేసింది. మే 1న, జులై 2న రెండుదశల్లో నీట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అయితే, సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీలను ఏపీ అధికారులు, న్యాయనిపుణులతో కలసి చర్చించారు. ఏపీ వినిపించిన 371 డీ తదితర అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకొని ఆ వాదనలను తదుపరి వింటామని పేర్కొన్నందున ప్రస్తుతానికి ఎంసెట్‌ను యధావిధిగా నిర్వహించడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు.

సీబీఎస్‌ఈ షెడ్యూల్ మేరకు మే 1న నిర్వహించ తలపెట్టిన నీట్-1(ఏఐపీఎంటీ-ఆలిండియా ప్రీమెడికల్ టెస్టు) నుంచి ఏపీకి ఇంతకు ముందే మినహాయింపు ఉన్నందున ఇబ్బందులు లేవన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఏపీ ఎంసెట్‌ను ముందుకు తీసుకువెళ్లాలన్న అభిప్రాయానికి వచ్చారు. దీనిపై మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావులకు వివరించారు. ముందుగా ఎంసెట్‌ను నిర్వహించి తదుపరి రాష్ట్రం వాదనలపై మరోసారి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయవచ్చా? లేదా అనే అంశంపై చర్చించారు. ఆ మేరకు ఏపీ ఎంసెట్‌ను యధాతథంగా నిర్వహించడానికి ఏపీ ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ఎంసెట్ ఛైర్మన్, కన్వీనర్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.


ఏపీ ఎంసెట్‌కు 2,92,507 మంది
శుక్రవారం జరగనున్న ఏపీ ఎంసెట్‌కు 2,92,507 మంది హాజరుకానున్నారు. ఇందులో ఇంజనీరింగ్‌లో 1,89,273 మంది, మెడికల్‌లో 1,03,234 మంది ఉన్నారు. తెలంగాణ నుంచి ఏపీ ఎంసెట్‌కు అత్యధిక సంఖ్యలో దరఖాస్తు చేయడం విశేషం. ఎంసెట్ కేంద్రాల వద్ద కంప్యూటర్ సెంటర్లు, జిరాక్సు సెంటర్లు హోటళ్లను మూసివేయించేలా ఆదేశాలు జారీచేశారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ అదనపు బస్సులు నడపడంతోపాటు విద్యార్ధులకు ఉచిత ప్రయాణానికి అనుమతించింది. పరీక్ష కేంద్రాల్లోకి స్మార్ట్‌ఫోన్లు, చేతివాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని కన్వీనర్ సాయిబాబు స్పష్టంచేశారు. పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలు ఏర్పాటు చేయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement