
ఎంబీబీఎస్ ఇక ఖరీదు
రాష్ట్రంలో వైద్య విద్య మరింత ప్రియం కానుంది. త్వరలోనే ఎంబీబీఎస్ ఫీజులను భారీగా పెంచాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల మోత
భారీగా పెరగనున్న ఫీజులు
కన్వీనర్ కోటా ఫీజు రూ.60 వేల నుంచి రూ.లక్షకు పెంచే చాన్స్
యాజమాన్య కోటా ఫీజు రూ.5.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెరగవచ్చు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య మరింత ప్రియం కానుంది. త్వరలోనే ఎంబీబీఎస్ ఫీజులను భారీగా పెంచాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు, వైద్య విద్యాశాఖకు చెందిన అధికారులు కలసి కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సాధారణ ఫీజు విషయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అది ప్రస్తుతం ఏడాదికి రూ.10 వేలు మాత్రమే ఉంది. అయితే ప్రైవేటు కళాశాలల్లో ఉన్న సీట్లపైనే ప్రధానంగా దృష్టి సారించారు. కన్వీనర్ కోటా సీట్లతోపాటు యాజమాన్య కోటా సీట్ల ఫీజులను భారీగా పెంచనున్నట్టు సమాచారం. దీనిపై ఉన్నత విద్యామండలి అధికారులతోనూ ప్రభుత్వం చర్చిస్తోంది.
యాజమాన్య, కన్వీనర్ కోటా ఫీజుల పెంపు
ప్రైవేటు కళాశాలల్లో ప్రస్తుతం 50 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. మరో 40 శాతం సీట్లను యాజమాన్య కోటా కింద, 10 శాతం సీట్లను ‘బి’ కేటగిరీ కోటాలో భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం కన్వీనర్ కోటాకింద ఏడాదికి రూ.60 వేలు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులను రూ.లక్ష వరకూ పెంచే అవకాశమున్నట్టు సమాచారం. అదేవిధంగా యాజమాన్య కోటా సీట్లకు ప్రస్తుతం ఏడాదికి రూ.5.5 లక్షలు వసూలు చేస్తుండగా.. ఇకమీదట ఇది రూ.10 లక్షల వరకూ పెరిగే అవకాశముంది. గతేడాదే ఏఎఫ్‌ఆర్సీ(అడ్మిషన్ ఫీ రెగ్యులేటరీ కమిటీ).. కళాశాలల్లో వసతుల ఆధారంగా ఫీజులు పెంచాలని సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం తెలిసిందే.
‘బి’ కేటగిరీ సీట్ల రద్దు యోచన..
వచ్చేఏడాది నుంచి ‘బి’ కేటగిరీ కోటా సీట్లను రద్దు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు కళాశాలల్లో 10 శాతం సీట్లను ‘బి’ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏడాదికి ఒక్కో విద్యార్థినుంచి రూ.2.40 లక్షలు వసూలు చేస్తున్నారు. అయితే ఈ సీట్లను రద్దు చేసి యాజమాన్య కోటా సీట్లలో కలిపేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం పీజీ వైద్య సీట్లలాగే ప్రభుత్వానికి 50 శాతం సీట్లు, ప్రైవేటు కళాశాలలకు 50 శాతం సీట్లు ఉంటాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. కేవలం నిర్ణయించిన ఫీజులను చెల్లించి చేరాల్సి ఉంటుంది.
రూ.150 కోట్లు నష్టపోయాం
వాస్తవానికి ప్రతి మూడేళ్లకోసారి ఫీజులను పెంచాలి. కానీ చివరిసారిగా 2010లో పెంచారు. ఐదేళ్లవుతున్నా ఫీజులు పెంచలేదు. దీనివల్ల ప్రైవేటు వైద్య కళాశాలల నిర్వహణ భారమైంది. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు సుమారు రూ.150 కోట్ల వరకూ నష్టపోయాయి. ఈ ఏడాది ఫీజులు పెంచకపోతే అడ్మిషన్లు జరపలేమని ప్రైవేటు వైద్య కళాశాలల అసోసియేషన్ ప్రభుత్వానికి విన్నవించింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా లేఖలిచ్చింది.
‘బి’ కేటగిరీ సీట్లను యాజమాన్య కోటాలోనే విలీనం చేయాలని సూచించింది. ఏటా సీట్లను అమ్ముకుంటున్నట్టు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో...యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించినా తమకు అభ్యంతరమేమీ లేదని లేఖలో పేర్కొంది. మెరిట్ ప్రాతిపదికనే అడ్మిషన్లు జరిపేందుకు తమకెలాంటి అభ్యంతరాల్లేవని పేర్కొన్నట్టు తెలిసింది. వాస్తవానికి 2013లోనే ఫీజులు పెంచాలని, కానీ పెంచలేదని, 2014లో రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో తామూ ఏమీ అనలేకపోయామని, ఇప్పుడు మాత్రం ఫీజులు పెంచకపోతే 2015-16 సంవత్సరంలో అడ్మిషన్లు నిర్వహించలేమని అసోసియేషన్ వివరించింది.
భారతీయ వైద్యమండలి ఆగ్రహం..
గతేడాది యాజమాన్య కోటా సీట్ల భర్తీపై భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) తీవ్రంగా మండిపడింది. కొన్నిచోట్ల ఇంటర్ మార్కులతో, మరికొన్నిచోట్ల ఎంసెట్ మార్కులతో రకరకాలుగా యాజమాన్యకోటా సీట్లను భర్తీ చేశారు. దీనిపై ఎంసీఐ స్పందిస్తూ.. ఈ సీట్లన్నిటినీ రద్దుచేయాలని కోరింది. అయితే అప్పట్లో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీఎంఈ, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైస్ చాన్సలర్లు.. అడ్మిషన్లు రద్దు చేసి, తిరిగి నిర్వహించే సమయం లేదని, ఈ ఒక్కసారికి అనుమతించాలని, వచ్చే ఏడాది సీట్ల భర్తీలో జాగ్రత్తలు తీసుకుంటామని రాతపూర్వక హామీఇచ్చారు.
ముందు భర్తీ విధానాన్ని నిర్ణయించాల్సి ఉంది
ఫీజులు నిర్ణయించే ఏఎఫ్‌ఆర్‌సీలో వైద్య విద్యా సంచాలకులు సభ్యులు కారు. దీంట్లో మా ప్రమేయమేమీ ఉండదు. అయితే యాజమాన్య కోటా సీట్ల భర్తీ విధానాన్ని ముందే నిర్ణయించాల్సి ఉంది. చివరివరకూ ఎలా భర్తీ చేస్తారో తెలియకపోవడంతో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది.
-డా.శాంతారావు, వైద్యవిద్యా సంచాలకులు
ప్రైవేటు కళాశాలలు.. సీట్లు
కాటూరి మెడికల్ కాలేజీ, గుంటూరు 150
పిన్నమనేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ 150
ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజీ 150
అల్లూరి సీతారామరాజు అకాడెమీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ 150
కోనసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ 150
మహరాజ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
మెడికల్ సెన్సైస్ 150
జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ 200
జెమ్స్ మెడికల్ కాలేజీ 100
ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
మెడికల్ సెన్సైస్, విశాఖ 150
పీఈఎస్ మెడికల్ కాలేజీ, కుప్పం 150
శాంతిరాం మెడికల్ కాలేజీ 100
నారాయణ మెడికల్ కాలేజీ 200