ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో మరో స్కామ్ వెలుగుచూస్తోంది.
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో మరో స్కామ్ వెలుగుచూస్తోంది. ఇప్పటికే పీజీ ఎంట్రెన్స్‌లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించగా.. తాజాగా పారామెడికల్ కోర్సు ల్లో అక్రమాలు బయటపడుతున్నాయి. పారామెడికల్ విద్యార్థులు పరీక్షల్లో తప్పినా పాసైనట్లు సర్టిఫికెట్లు ఇస్తున్నారని తెలుస్తోం ది. అయితే ఈ వ్యవహారం బయటపడకుండా అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
బీఎస్సీ (నర్సింగ్), ఫిజియోధెరఫీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ) కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. ప్రతి పరీక్షలోనూ కనీస పాస్ మార్కులు సాధించుకుని, మొత్తం మీద 50శాతం మార్కులు వస్తేనే పాసైనట్లుగా వర్సిటీ నిర్ధారిస్తుంది. అయితే చాలామంది విద్యార్థులు ప్రొఫెసర్ల చలవతో ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్‌లో మంచిమార్కులు సంపాదించుకుంటున్నా థియరీ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. పారామెడికల్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు థియిరీలో తప్పితే రెండో సంవత్సరానికి అనుమతించరు. దీన్ని ఆసరాగా తీసుకుని వర్సిటీలో కొంతమంది అధికారులు విద్యార్థులను దోచుకుంటున్నారు. థియిరీలో తప్పినప్పటికీ ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్‌లో ఎక్కువ మార్కులు సాధించుకుని మూడింటి మీద కలిపి 50శాతం మార్కులు దాటిన విద్యార్థులను తమ పావులుగా ఎంపిక చేసుకుంటున్నారు. థియిరీ పరీక్షలో కూడా కనీస మార్కులు వచ్చినట్లు మార్పు చేసి పాసైనట్లుగా మార్కుల జాబితాను జారీ చేస్తున్నారు. ఇందులో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని తెలిసింది. విద్యార్థి మార్కుల జాబితాను పరిశీలించినా 50శాతం దాటి ఉండడంతో పరీక్ష తప్పినట్లుగా ఎవరికీ అనుమానం రాదు.
కాన్ఫిడెన్షియల్ విభాగంలోనే అక్రమాలు
విద్యార్థుల జవాబు పత్రాలు వ్యాల్యూయేషన్ అయిన తరువాత వచ్చిన మార్కుల్ని ఎగ్జామినేషన్ కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఉండే టోటల్ మార్క్స్ రిజిష్టర్(టీఆర్)లో నమోదు చేస్తారు. పరీక్ష ఫీజులు కట్టించుకోవాలన్నా, సర్టిఫికెట్లు జారీ చేయాలన్నా ఈ టీఆర్‌తో విద్యార్థుల మార్కుల జాబితాలను సరిపోల్చుకోవాల్సి ఉంటుంది. అవినీతికి పాల్పడిన ఈ విభాగంలోని కొందరు అధికారులు టీఆర్‌తో మార్కుల జాబితాలను సరిపోల్చకుండానే పాసైనట్లుసర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారం ఇటీవల కాన్ఫిడెన్షియల్ విభాగం సిబ్బందిలో మార్పులు జరగడంతో వెలుగుచూసింది. ఫిజియోథెరపీలో సుమారు 12 మంది విద్యార్థుల వద్ద ఉన్న మార్కుల జాబితాల్లో పాసైనట్లు ఉండగా, టీఆర్‌లో తప్పినట్లుగా సిబ్బంది గుర్తించా రు. దీంతో ఆ విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయాలో వద్దో తేల్చుకోలేకపోతున్నారు. గుట్టుచప్పు డు కాకుండా ఈ విషయాన్ని సర్దుబాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.