కొత్త దరఖాస్తులకు ఆహ్వానం: వీసీ
రీ-ఎంట్రెన్స్ నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్‌టీఆర్ హెల్త్ వర్సిటీ
గత ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వారు దరఖాస్తు చేయనక్కర్లేదు
కొత్తవారు 9 నుంచి 11 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి
21 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ రవిరాజు వెల్లడి
సాక్షి, విజయవాడ: పీజీ మెడికల్ రీ-ఎంట్రన్స్ ఈ నెల 27వ తేదీన నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు ప్రకటించారు. ఈ మేరకు హెల్త్ వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. రీ-ఎంట్రన్స్‌కు డాక్టర్ ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌పీజీఎంఈటీ - 2014గా నామకరణం చేశారు. గత నెల 2వ తేదీన నిర్వహించిన పీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్తగా దరఖాస్తు చేసుకోనవసరం లేదని వీసీ చెప్పారు. ఏదేనీ కారణంతో ఇంతకుముందు పీజీఎంఈటీ-14కు దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇంతకుముందు (సరైన ధ్రువపత్రాలు సమర్పించక) తిరస్కరణకు గురైన దరఖాస్తులకు సక్రమ ధ్రువపత్రాలు జతచేసి మరలా దరఖాస్తు చేసుకోవచ్చనీ ఆయన వెల్లడించారు.
రీ-ఎంట్రన్స్ నిర్వహణకు పూర్తిగా కొత్త కమిటీలను ఏర్పాటు చేశామని.. ప్రవేశ పరీక్ష నిర్వహించిన పది రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఫలితాలు ప్రకటించిన రెండు వారాల్లో మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష రద్దుకు కారకులుగా భావిస్తున్న అభ్యర్థులను కూడా రీ-ఎంట్రన్స్ టె స్ట్‌కు అనుమతిస్తారా అని వీసీని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘రద్దయిన పీజీ మెడికల్ ఎంట్రన్స్ రాసిన అభ్యర్థులంతా రీ-ఎంట్రెన్స్‌కు అర్హులే’’ అని వీసీ బదులిచ్చారు. కేసు ప్రస్తుతం పోలీసులు, కోర్టు పరిధిలో ఉందన్నారు. సదురు అభ్యర్థులు దోషులని న్యాయస్థానం నిర్ణయిస్తే వారి డిగ్రీలు రద్దు చేయడం, కొన్నేళ్ల పాటు పరీక్షలు రాయకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. శుక్రవారం కూడా హెల్త్ వర్సిటీలో సీఐడీ అధికారుల దర్యాప్తు జరిగింది. పోలీసుల అదుపులో ఉన్న కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ (సీఓఈ) డాక్టర్ విజయకుమార్ శుక్రవారం యూనివర్సిటీకి వచ్చారు. సీఐడీ అధికారులు సీఓఈ సమక్షంలో కొన్ని ఫైళ్లను పరిశీలించినట్లు సమాచారం.
పీజీ మెడికల్ రీ-ఎంట్రన్స్‌కు సంబంధించి ముఖ్యాంశాలివీ...
కొత్తగా అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు (హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఆర్‌ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఓఆర్‌జీ) వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుంది.
వెబ్‌సైట్ ద్వారా పూర్తిచేసిన దరఖాస్తు ప్రింటౌట్, సంబంధిత చలానా, ధ్రువపత్రాలను ఈ నెల 12వ తేదీ లోగా యూనివర్సిటీకి అందజేయాలి.
అభ్యర్థులందరూ ఈ నెల 21 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 24 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు.
మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ల (హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ, హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్య.డీఆర్‌ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఓఆర్‌జీ) చూడాలి.
పీజీ మెడికల్ రీ-ఎంట్రన్స్ 27న
Published Sat, Apr 5 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM
Advertisement
Advertisement