PG medical entrance
-
28న పీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్
2016-17 విద్యా సంవత్సరంలో పీజీ డిగ్రీ, డిప్లొమా (ఎండీ /ఎంఎస్) మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 28న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి అందుబాటులో ఉన్న సుమారు 2700 సీట్లలో 1840 సీట్లను కన్వీనర్ కోటా కింద ప్రవేశ పరీక్షల ఆధారంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ భర్తీ చేస్తుంది. ప్రవేశ పరీక్ష కోసం రెండు రాష్ట్రాల్లో కలిపి 55 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏపీలో 27, తెలంగాణలో 28 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఈ నెల 21 నుంచే హాల్‌టిక్కెట్లు డౌన్లోడు చేసుకుంటున్నారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది. 29న ఆన్సర్ ‘కీ’ విడుదల చేస్తారు. మార్చి 10న ఫైనల్ ‘కీ’తో పాటు ఫలితాలు విడుదల చేయనున్నారు. -
పీజీ మెడికల్ ఎంట్రెన్స్‌లో సౌమ్యకు మొదటి ర్యాంక్
విజయవాడ: పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష-2015లో డాక్టర్ కాండూరి సౌమ్య (హాల్‌టికెట్ నంబర్ 832117, ఏయూ) మొదటి ర్యాంక్ సాధించారు. పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ నెల ఒకటో తేదీన నిర్వహించిన ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఫలితాలను వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు ఆదివారం విడుదల చేశారు. ఉల్చి జయవర్థన్ (హాల్‌టికెట్ నంబర్ 807146, ఏయూ) ద్వితీయ ర్యాంక్, కౌతా సంధ్య (హాల్‌టికెట్ నంబరు 832048, ఏయూ) తృతీయ ర్యాంక్, శ్రీలక్ష్మీ జేపీరావు (80547, ఏయూ) నాలుగో ర్యాంక్, కె.హర్షవీణ (హాల్‌టికెట్ నంబరు 809132, ఓయూ) ఐదో ర్యాంక్ సాధించారు. మొత్తం 13,223 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 8,983 (67.93 శాతం) మంది అర్హత సాధించినట్లు వీసీ తెలిపారు. గత ఏడాది(60.43శాతం)తో పోల్చితే ఈ ఏడాది ఉత్తీర్ణత 7.5 శాతం పెరిగింది. మొదటి 50 ర్యాంకుల్లో 23 మంది ఏయూ, 21 మంది ఓయూ, ఆరుగురు ఎస్వీయూ అభ్యర్థులు నిలిచినట్లు చెప్పారు. మొదటి ర్యాంక్ విజేత కాండూరి సౌమ్య (విజయనగరం) స్విమ్స్ పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలోనూ సెకండ్ ర్యాంకులో నిలిచినట్లు తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్బీ లాల్ పాల్గొన్నారు. ముగిసిన ఎండీఎస్ ప్రవేశ పరీక్ష: పీజీ డెంటల్ (ఎండీఎస్) కోర్సులో అడ్మిషన్లకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆదివారం ఆన్లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహించింది. మొత్తం 1,996 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 28 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు వీసీ రవిరాజు తెలిపారు. ఫలితాల్ని ఈ నెల 16న విడుదల చేస్తామన్నారు. -
మణిపాల్ ప్రెస్ నుంచే పేపర్ లీక్
సీఐడీ అదనపు డీజీ వెల్లడి పేపర్ లీకేజి కేసులో మరో 11 మంది అరెస్టు సూత్రధారుల కోసం కొనసాగుతున్న వేట సోమవారం అరెస్టయింది వీరే.. దళారులు: చక్రవర్తి, భూషణ్‌రెడ్డి, విజయ్, కిష్టప్ప, అభిమన్యు, పాట్రిక్, అమీర్ అహ్మద్ ర్యాంకర్లు (ర్యాంకు): పి.భరత్‌కుమార్ (7), సీహెచ్ రామారావు(14), సీహెచ్ సాయి ప్రణీత్ (15), కె.రమణ (26) సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ విశ్వ విద్యాలయం నిర్వహించిన పీజీ మెడికల్ ప్రవేశపరీక్ష (పీజీఎంఈటీ) -2014 ప్రశ్నపత్రం కర్ణాటకలోని మణిపాల్‌లో ఉన్న మణిపాల్ ప్రింటింగ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రెస్ నుంచే లీక్ అయినట్లు గుర్తించామని సీఐడీ అదనపు డీజీ టి.కృష్ణప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో గత నెల 29న 9 మందిని అరెస్టు చేయగా, సోమవారం మరో 11 మందిని అరెస్టు చేశామని, వీరిలో ఏడుగురు బ్రోకర్లు, నలుగురు ర్యాంకర్లు ఉన్నారని చెప్పారు. లీకేజ్‌లో సూత్రధారుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. ‘కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సీహెచ్ భూషణ్‌రెడ్డి 2011లో లక్డీకాపూల్ వద్ద బాలాజీ కెరీర్ సొల్యూషన్స్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఆతర్వాత అతనికి ఇదే రంగంలో ఉన్న వి.సురేష్ (బెంగళూరు), అంజు సింగ్ (ముంబై), ధనుంజయ్ కుమార్ చౌహాన్ (బీహార్), కె.మునీశ్వర్‌రెడ్డి (కడప), డి.సాయినాథ్ (హైదరాబాద్)లతో పరిచయమేర్పడింది. వీరంతా కలిసి కర్ణాటకలోని దావనగెరెకు చెందిన అమీర్ అహ్మద్ సాయంతో పీజీఎంఈటీ ప్రశ్నపత్రం లీక్ చేశారు. దావనగెరెలో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థ నిర్వహిస్తున్న పౌల్సన్, అమీర్ అహ్మద్, అంజుసింగ్లు ఒక ముఠాగా ఏర్పడి ప్రశ్నపత్రాన్ని బయటకు తెచ్చారు.. ఈ కేసులో పౌల్సన్ కూడా కీలక సూత్రధారి. అంజుసింగ్, అమీర్ అహ్మద్‌లకు సహాయకులుగా వ్యవహరించిన అభిమన్యు, పాట్రిక్‌లు అనేక మంది వైద్య విద్యార్థుల్ని కన్సల్టెన్సీల ద్వారా ఎంపిక చేసి ఒప్పందాలు కుదుర్చుకునేలా చేశారు. వీరికి గుంతకల్‌కు చెందిన కిష్టప్ప, నరసరావుపేటకు చెందిన చక్రవర్తి, మరికొందరు దళారులు సహకరించారు’ అని ఆ ప్రకటనలో తెలిపారు. -
పీజీ మెడికల్ రీ-ఎంట్రన్స్ 27న
-
పీజీ మెడికల్ రీ-ఎంట్రన్స్ 27న
కొత్త దరఖాస్తులకు ఆహ్వానం: వీసీ రీ-ఎంట్రెన్స్ నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ గత ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వారు దరఖాస్తు చేయనక్కర్లేదు కొత్తవారు 9 నుంచి 11 వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి 21 నుంచి వెబ్సైట్లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ రవిరాజు వెల్లడి సాక్షి, విజయవాడ: పీజీ మెడికల్ రీ-ఎంట్రన్స్ ఈ నెల 27వ తేదీన నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు ప్రకటించారు. ఈ మేరకు హెల్త్ వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. రీ-ఎంట్రన్స్‌కు డాక్టర్ ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌పీజీఎంఈటీ - 2014గా నామకరణం చేశారు. గత నెల 2వ తేదీన నిర్వహించిన పీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్తగా దరఖాస్తు చేసుకోనవసరం లేదని వీసీ చెప్పారు. ఏదేనీ కారణంతో ఇంతకుముందు పీజీఎంఈటీ-14కు దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇంతకుముందు (సరైన ధ్రువపత్రాలు సమర్పించక) తిరస్కరణకు గురైన దరఖాస్తులకు సక్రమ ధ్రువపత్రాలు జతచేసి మరలా దరఖాస్తు చేసుకోవచ్చనీ ఆయన వెల్లడించారు. రీ-ఎంట్రన్స్ నిర్వహణకు పూర్తిగా కొత్త కమిటీలను ఏర్పాటు చేశామని.. ప్రవేశ పరీక్ష నిర్వహించిన పది రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఫలితాలు ప్రకటించిన రెండు వారాల్లో మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష రద్దుకు కారకులుగా భావిస్తున్న అభ్యర్థులను కూడా రీ-ఎంట్రన్స్ టె స్ట్‌కు అనుమతిస్తారా అని వీసీని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘రద్దయిన పీజీ మెడికల్ ఎంట్రన్స్ రాసిన అభ్యర్థులంతా రీ-ఎంట్రెన్స్‌కు అర్హులే’’ అని వీసీ బదులిచ్చారు. కేసు ప్రస్తుతం పోలీసులు, కోర్టు పరిధిలో ఉందన్నారు. సదురు అభ్యర్థులు దోషులని న్యాయస్థానం నిర్ణయిస్తే వారి డిగ్రీలు రద్దు చేయడం, కొన్నేళ్ల పాటు పరీక్షలు రాయకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. శుక్రవారం కూడా హెల్త్ వర్సిటీలో సీఐడీ అధికారుల దర్యాప్తు జరిగింది. పోలీసుల అదుపులో ఉన్న కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ (సీఓఈ) డాక్టర్ విజయకుమార్ శుక్రవారం యూనివర్సిటీకి వచ్చారు. సీఐడీ అధికారులు సీఓఈ సమక్షంలో కొన్ని ఫైళ్లను పరిశీలించినట్లు సమాచారం. పీజీ మెడికల్ రీ-ఎంట్రన్స్‌కు సంబంధించి ముఖ్యాంశాలివీ... కొత్తగా అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు (హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఆర్‌ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఓఆర్జీ) వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. వెబ్సైట్ ద్వారా పూర్తిచేసిన దరఖాస్తు ప్రింటౌట్, సంబంధిత చలానా, ధ్రువపత్రాలను ఈ నెల 12వ తేదీ లోగా యూనివర్సిటీకి అందజేయాలి. అభ్యర్థులందరూ ఈ నెల 21 నుంచి వెబ్సైట్లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 24 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ల (హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ, హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్య.డీఆర్‌ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఓఆర్జీ) చూడాలి. -
'పీజీ మెడికల్ ఎంట్రన్స్ మళ్లీ నిర్వహించాలి'
హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ల ప్రతినిధుల బృందం మంగళవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యింది. మెడికల్ పీజీ సీట్ల వివాదాన్ని జూనియర్ డాక్టరు ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. మెడికల్ పీజీ ఎంట్రన్స్‌ను రద్దు చేసి.... మళ్లీ నిర్వహించాలని జూడాలు గవర్నర్‌ను కోరారు. కాగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. పీజీ మెడికల్ ఎంట్రన్స్‌లో అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. పరీక్ష మళ్లీ నిర్వహించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు.