
పీజీ మెడికల్ ఎంట్రెన్స్‌లో సౌమ్యకు మొదటి ర్యాంక్
విజయవాడ: పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష-2015లో డాక్టర్ కాండూరి సౌమ్య (హాల్‌టికెట్ నంబర్ 832117, ఏయూ) మొదటి ర్యాంక్ సాధించారు. పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ నెల ఒకటో తేదీన నిర్వహించిన ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ఫలితాలను వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు ఆదివారం విడుదల చేశారు. ఉల్చి జయవర్థన్ (హాల్‌టికెట్ నంబర్ 807146, ఏయూ) ద్వితీయ ర్యాంక్, కౌతా సంధ్య (హాల్‌టికెట్ నంబరు 832048, ఏయూ) తృతీయ ర్యాంక్, శ్రీలక్ష్మీ జేపీరావు (80547, ఏయూ) నాలుగో ర్యాంక్, కె.హర్షవీణ (హాల్‌టికెట్ నంబరు 809132, ఓయూ) ఐదో ర్యాంక్ సాధించారు. మొత్తం 13,223 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 8,983 (67.93 శాతం) మంది అర్హత సాధించినట్లు వీసీ తెలిపారు. గత ఏడాది(60.43శాతం)తో పోల్చితే ఈ ఏడాది ఉత్తీర్ణత 7.5 శాతం పెరిగింది. మొదటి 50 ర్యాంకుల్లో 23 మంది ఏయూ, 21 మంది ఓయూ, ఆరుగురు ఎస్‌వీయూ అభ్యర్థులు నిలిచినట్లు చెప్పారు. మొదటి ర్యాంక్ విజేత కాండూరి సౌమ్య (విజయనగరం) స్విమ్స్ పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలోనూ సెకండ్ ర్యాంకులో నిలిచినట్లు తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్‌బీ లాల్ పాల్గొన్నారు.
ముగిసిన ఎండీఎస్ ప్రవేశ పరీక్ష: పీజీ డెంటల్ (ఎండీఎస్) కోర్సులో అడ్మిషన్లకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆదివారం ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహించింది. మొత్తం 1,996 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 28 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు వీసీ రవిరాజు తెలిపారు. ఫలితాల్ని ఈ నెల 16న విడుదల చేస్తామన్నారు.