జీవితంలో కోరుకున్న స్థాయికి ఎదగాలనే కలలు ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. భవిష్యత్తు అంతా శూన్యంలా అనిపించవచ్చు. అంతమాత్రాన జీవితమే లేదని నిరాశకు గురికావల్సిన పనిలేదు అని నిరూపిస్తోంది సౌమ్య. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన సౌమ్య పైలట్ కావాలని కలలు కంది. శిక్షణ కూడా పూర్తి చేసుకుంది. కానీ, పైలట్ జాబ్ పొందలేక జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరింది. కాల్‌సెంటర్‌లో పనిచేసింది. ఇప్పుడు 35 మందికి ఉద్యోగావకాశాలు ఇచ్చి సొంత కంపెనీని నడుపుతోంది. కృషి, పట్టుదల ఉంటే ఎంచుకున్న మరో రంగంలోనూ ఉన్నతిని సాధించవచ్చని నిరూపిస్తోంది.
పదిహేనేళ్ల క్రితం పైలట్ కావాలని సౌమ్య ఎన్నో కలలు కన్నది. అందుకు ఆమె తల్లిదండ్రులూ వెన్నుదన్నుగా నిలిచారు. 65 లక్షల రూపాయలు ఖర్చు చేసి అమెరికాలో పైలట్ శిక్షణ పూర్తి చేసింది. అప్పటికి సౌమ్య వయసు 19 ఏళ్లు. శిక్షణ ముగిసేనాటికి అమెరికాలో ఆర్థికమాంద్యం అక్కడి ఉద్యోగవకాశాలను కల్పించలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పైలట్‌గా ఉద్యోగం దొరకలేదు. ‘2006లో అలా నా కెరియర్ ప్రారంభమయ్యేలోపు ముగిసిపోయింది. శిక్షణ తర్వాత జాబ్ రావడం ఖాయం అనుకున్నాను. ఏడాది పాటు చేయని ప్రయత్నం లేదు. కానీ, ఆర్ధికమాంద్యంంతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ దివాలాతీశాయి. నాకు జాబ్ రాలేదు. మున్ముందు ఏం చేయాలో అర్ధం కాలేదు. అంతా శూన్యంగా అనిపించింది. విసిగిపోయి ఇండియా వచ్చేశాను.
2008లో జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరాను. అప్పుడు నా జీతం రూ.5000లు మాత్రమే. ఆ జాబ్ చేస్తూనే కాల్ సెంటర్‌లో చేరాను. రాత్రి పూట కాల్‌సెంటర్ ఉద్యోగం, పగటి పూట జిమ్‌లో రిసెప్షన్. ఈ సమయంలోనే రాబర్టో కావల్లి, గొట్టి వంటి బ్రాండ్ల నుండి దుస్తులను దిగుమతి చేసుకుంటూ వ్యాపారం చేస్తున్న ఒకావిడ పరిచయం అయ్యింది. ఆమె నుండి 20 డ్రెస్సులను అప్పు మీద తీసుకున్నాను. నా ఫ్రెండ్స్‌కు సెల్‌ఫోన్ ద్వారా ఆ డ్రెస్సుల గురించి, వాటి ధరల గురించి చెప్పాను. ఒక గంటలో ఆ 20 డ్రెస్సులను అమ్మేశాను. దాంతో నూటికి నూరు శాతం లాభం వచ్చింది. అంతే.. కాల్ సెంటర్ ఉద్యోగం మానేసి దుస్తుల వ్యాపారంలోకి దిగాను. అక్కడ నుంచి డిజైనర్ల దగ్గర నుంచి తీసుకున్న విభిన్న మోడల్ దుస్తులను ఆన్‌లైన్‌లో మార్కెటింగ్‌కి పెట్టాను. ఈ బిజినెస్‌లో రాత్రింబవళ్లు మునిగితేలాను. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ ఇతర పెద్ద, చిన్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో బట్టలు అమ్మడం విస్తృతం చేశాను.
రీటెయిల్ బిజినెస్ ద్వారా స్వదేశీ, విదేశీ కంపెనీలను కాంటాక్ట్ చేస్తుంటాను. ఇప్పుడు ప్రతిరోజూ వివిధ బ్రాండ్స్‌కి చెందిన 10 వేల డ్రెస్సులను అమ్ముతున్నాను. అమెరికా, కెనడా, ఐరోపాలో కూడా బ్రాంచ్‌ల ఏర్పాటు చేశాను. ప్రస్తుతం 35 మంది ఉద్యోగులు నా ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం కరోనా కారణంగా వ్యాపారం తగ్గినట్టుగా అనిపిస్తున్నా.. త్వరలోనే ఇది పుంజుకుంటుంది. ప్రముఖ బ్రాండెడ్, డిజైనర్ మాస్కుల వినియోగం బాగా పెరిగింది’ అంటూ తెలియజేసింది సౌమ్య. జీవితంలో ముందుకు సాగడానికి ఒక దారి మూసుకుపోతే వేల దారులు మనకోసం తప్పక తెరిచి ఉంటాయి. అవకాశాల దారుల్లో మన కలలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగడమే మార్గం అంటున్న సౌమ్య లాంటి వారు నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. –ఆరెన్నార్
Comments
Please login to add a commentAdd a comment