
గల్ఫ్ వార్ (కువైట్‌పై ఇరాక్ ఆక్రమణ) సమయంలో కువైట్ చిక్కుకుపోయిన మనవాళ్లను, ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఆక్రమించిన ఇరాక్‌లోని తిక్రిత్ నుంచి భారతీయ నర్సులను క్షేమంగా ఇండియాకు చేర్చింది.. మన పౌరుల చొరవ, ధైర్యమే! ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆకాశంకేసి చూస్తున్న ఇటలీలోని ఇండియన్స్‌నూ స్వస్థలానికి తీసుకొస్తోంది అలాంటి తెగువ, సాహసమే! ఈ విజయాల వెనక ఉన్నదీ మహిళల భాగస్వామ్యమే. ఇంకా చెప్పాలంటే ఆమె నాయకత్వం. అవును.. కరోనా కోరల్లో చిక్కుకున్న ఇటలీ నుంచి ఇండియన్స్‌ను సొంత గడ్డ మీద ల్యాండ్ చేస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానానికి కెప్టెన్ మహిళే. స్వాతి రావల్. కరోనా పేరుకు కాలం కూడా స్తంభించిపోతున్న భయంలో ఆమె ఇటలీకి విమానాన్ని నడిపి 263 మందిని ఇక్కడికి తీసుకొచ్చేసింది. ఒక బిడ్డకు తల్లి అయిన స్వాతి.. తను, తన కుటుంబం గురించే కాదు దేశం గురించీ ఆలోచించింది. తన పదిహేనేళ్ల సర్వీసులో ఇలాంటి సాహసాలు ఆమెకు కొత్తేం కాదు. 2010లో ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్లిన ఎయిర్ ఇండియా ఆల్ విమెన్ క్రూ విమానానికీ ఆమే సారథ్యం వహించింది. ‘నిజానికి నేను ఫైటర్ పైలట్ కావాలనుకున్నాను. కాని ఆ టైమ్‌లో ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలకు ఆ జాబ్ లేదు. దాంతో కమర్షియల్ పైలట్ కావాల్సి వచ్చింది. నాకు డ్యూటీ ఫస్ట్.. తర్వాతే ఏమైనా. నన్నర్థం చేసుకొని సపోర్ట్ చేస్తున్న నా కుటుంబానికి ఎన్ని థాంక్స్ చెప్పినా సరిపోదు’ అంటుంది స్వాతి రావల్. మనం కూడా స్వాతి రావల్ లాంటి వాళ్లకు థ్యాంక్స్ చెప్పాలి.. సెల్యూట్ చేయాలి.. వాళ్ల ప్రాణాలను లెక్క చేయకుండా అందిస్తున్న సేవలకు!
Comments
Please login to add a commentAdd a comment