విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీలు, 26 నుంచి 29వ తేదీ వరకు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల బాస్కెట్‌బాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఐ.వి.రావు తెలిపారు. యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరీ రాష్ట్రాల నుంచి దాదాపు 46 యూనివర్సిటీల జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు.
ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో నార్త్, సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్, సెంట్రల్‌జోన్‌ల నుంచి మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన మొత్తం 20 జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఈ సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో పూల్-ఏ, బీ మ్యాచ్‌లు విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, పూల్-సీ మ్యాచ్‌లు చినకాకాని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల, పూల్-డీ మ్యాచ్‌లు డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల(చినవుటుపల్లి) ప్రాంగణాల్లో జరుగుతాయని వివరించారు. క్వార్టర్ ఫైనల్, లీగ్ మ్యాచ్‌లు, ఫైనల్స్ విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల మైదానంలో జరుగుతాయని తెలిపారు.
ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నీ నాకౌట్, ఫైనల్స్ మ్యాచ్‌లు ఈ నెల 28, 29 తేదీల్లో సిద్దార్థ ప్రభుత్వ ైవె ద్య కళాశాల మైదానంలో నిర్వహిస్తామన్నారు. పగలుతో పాటు సాయంత్ర ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు. టోర్నీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రారంభమవుతుందన్నారు. సమావేశంలో సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.కృష్ణమూర్తి, హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు క్యాదర్శి డాక్టర్ ఇ.త్రిమూర్తి, తమిళనాడు స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఆర్.తిరుమలై స్వామి పాల్గొన్నారు.
హెల్త్ యూనివర్సిటీ జట్టు ఇదే
ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళా బాస్కెట్‌బాల్ టోర్నీలో పాల్గొనే హెల్త్ యూనివర్సిటీ జట్టును శుక్రవారం యూనివర్సిటీ స్పోర్ట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ త్రిమూర్తి విడుదల చేశారు. జట్టులో పి.నిఖిత, కె.శ్రీనైనా, అంకితాసింగ్ తోమర్, వై.ఉర్మిళా(సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల), శృతి ఎస్.నాయర్, ఎ.రమ్య (ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల), వి.ఎన్.వి. వైష్ణవి, ఎం.మానిని(మహారాజా మెడికల్ కళాశాల, విజయనగరం),డి.పద్మప్రియాంక(సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల, ఏలూరు), సిహెచ్.నిఖితచౌదరి (మమతా మెడికల్ కళాశాల, ఖమ్మం), వి.జయశ్రీ(ఆర్మీ డెంటల్ కళాశాల, సికింద్రబాద్), వి.డి.భార్గవి(కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల) హెల్త్ యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. జట్టు కోచ్ కె.రాజేంద్రప్రసాద్ (శాయ్ కోచ్), మేనేజర్‌గా డాక్టర్ ఇ.త్రిమూర్తి వ్యవహరిస్తారు. జట్టు సభ్యులను యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఐ.వి.రావు శుభాకాంక్షలు తెలిపారు.
నేటి నుంచి సౌత్‌జోన్ బాస్కెట్‌బాల్ టోర్నీ
Published Sat, Dec 21 2013 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement