
కన్సల్టెన్సీ.. సాఫ్ట్‘కాపీ’.. స్పెషల్ క్లాస్
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన పీజీ వైద్యవిద్య ప్రవేశపరీక్ష (పీజీఎంఈటీ-2014) ప్రశ్నపత్రం లీకేజీలో ఓ కన్సల్టెన్సీ నిర్వాహకులు కీలక పాత్ర పోషించారు!
పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ సాగిందిలా!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన పీజీ వైద్యవిద్య ప్రవేశపరీక్ష (పీజీఎంఈటీ-2014) ప్రశ్నపత్రం లీకేజీలో ఓ కన్సల్టెన్సీ నిర్వాహకులు కీలక పాత్ర పోషించారు! విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వారు పెన్‌డ్రైవ్‌లో నుంచి దళారుల ద్వారా ప్రశ్నపత్రం సాఫ్ట్‌కాపీని సంపాదించారు. తమకు నగదు చెల్లించిన, చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వైద్య విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సమాచారం మేరకు సీఐడీ ఇప్పటికే 29 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. మరోవైపు పరారీలో ఉన్న సూత్రధారుల కోసం కోల్‌కతా, జలంధర్‌లో గాలిస్తోంది. నిందితుల అరెస్టును శనివారం ప్రకటించే అవకాశం ఉంది.
ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కొందరు యూనివర్సిటీ అధికారుల పాత్రనూ సీఐడీ సందేహిస్తోంది. ప్రశ్నపత్రాన్ని రూపొందించే కమిటీలో మోడరేటర్‌ది కీలక పాత్ర. తుది మెరుగులు దిద్దిన ప్రశ్నపత్రాన్ని ఓ సీనియర్ స్టెనోగ్రాఫర్ సాయంతో సాఫ్ట్‌కాపీగా మారుస్తారు. దీన్ని పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి, ప్రశ్నపత్రాల ముద్రణ కోసం సీల్డ్ కవర్‌లో రాష్ట్ర వెలుపల ఉన్న అధీకృత ప్రింటర్‌కు అప్పగిస్తారు. అయితే ఎన్టీఆర్ వర్సిటీలో పదేళ్లకు పైగా తాత్కాలిక (అడ్‌హక్) ప్రాతిపదికన మోడరేటర్‌గా పనిచేస్తున్న అధికారి నియామకానికి సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవు. మరోవైపు ప్రశ్నపత్రాన్ని పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసిన అధికారులు.. దానికి ఎలాంటి పాస్‌వర్డ్ ఏర్పాటు చేయలేదు.
నిబంధనల ప్రకారం పెన్‌డ్రైవ్ ఉన్న సీల్డ్ కవర్‌ను ప్రింటింగ్ ప్రెస్ ఉన్న ప్రాంతంలోనే, ప్రింటర్‌కు నేరుగా అందించాల్సి ఉంది. అయితే అధికారులు ప్రింటర్ ప్రతినిధులకు వారి కార్యాలయం ఉన్న ప్రాంతంలో కాకుండా బయట అప్పగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ప్రతినిధులతో కుమ్మకైన అంతర్రాష్ట్ర ముఠా ప్రశ్నపత్రం సాఫ్ట్ కాపీనే చేజిక్కించుకున్నట్లు సీఐడీ నిర్ధారించినట్లు సమాచారం. మరోవైపు పీజీఎంఈటీ-2014 ప్రశ్నపత్రాల్ని ఫిబ్రవరి 8నే ముద్రించిన ప్రింటర్... వాటిని వర్సిటీ అధికారులకు ఆలస్యంగా అదే నెల 25న డెలివరీ ఇచ్చినట్లు తేలింది. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమైనా వర్సిటీ అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కొందరు వర్సిటీ సిబ్బందిపై సందేహంతో అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అలాగే కోల్‌కతాకు చెందిన సూత్రధారితో పాటు జలంధర్‌కు చెందిన మరో కీలక దళారి కోసం సీఐడీ పోలీసులు గాలిస్తున్నారు. లీకేజ్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్న విజయవాడలోని రామనగరం ఏడీ రోడ్ ప్రాంతానికి ఓ రిటైర్డ్ బ్యాంకు అధికారినీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
తెర వెనుక కన్సల్టెన్సీ పాత్ర...
కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ఓ కన్సల్టెన్సీయే ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని తెర వెనుక ఉండి నడిపించిందని సీఐడీ అనుమానిస్తోంది. దీని నిర్వాహకులు దళారుల్ని ఏర్పాటు చేసుకుని ఈ తరహా వ్యవహారాలు సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో కొద్దిమందికే లీకేజీలిస్తున్న ఈ ముఠా ఈసారి మాత్రం భారీ సంఖ్యలో అభ్యర్థులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దాదాపు 29 మంది వైద్య విద్యార్థులకు దళారుల ద్వారా పరీక్షకు ముందు హైదరాబాద్, బెంగళూరు, గోవా, ముంబైల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించినట్లు సమాచారం. అక్కడే వీరికి ప్రశ్నపత్రం అందించి, అన్నింటికీ సమాధానాలు రాయద్దంటూ చెప్పి కొన్ని తొలగించినట్లు తెలిసింది. దీంతో ఎప్పుడూ లేనివిధంగా ర్యాంకర్లకు మొత్తం 196 మార్కులకు గాను 180 మార్కుల వరకు వచ్చాయి.
గురివిరెడ్డి ముందే చెప్పాడు!
2009లో ఎంసెట్, 2012లో చండీగఢ్ పీజీ మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్షల హైటెక్ మాల్ ప్రాక్టీస్ కుంభకోణాల్లో సూత్రధారి గురివిరెడ్డి ఈ ఏడాది వీఆర్‌వో, వీఏవో పరీక్షల్లోనూ ఇదే తరహా వ్యవహారానికి ప్రయత్నించాడు. అయితే దీనిపై ముందే సమాచారం అందుకున్న కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు అతన్ని ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన గురివిరెడ్డి... వారానికి రెండుసార్లు నంద్యాల పోలీసుస్టేషన్‌కు వచ్చి సంతకాలు చేస్తున్నాడు. పీజీఎంఈటీ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో అతన్నీ దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. అప్పటికింకా ఏకసభ్య కమిటీ నివేదిక ఇవ్వలేదు. ర్యాంకర్ల పేర్లు, ర్యాంకులను పరిశీలించిన గురివిరెడ్డి... కచ్చితంగా గోల్‌మాల్ జరిగిందని చెప్పాడు.
నిందితులు నేడు మీడియా ముందుకు!
విజయవాడ, న్యూస్‌లైన్: పీజీఎంఈటీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సీఐడీ అధికారులు మూడ్రోజులుగా కంట్రోలర్ ఆ్‌ఫ్ ఎగ్జామ్స్ విజయకుమార్‌ను విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు కొందరు విద్యార్థులు, కీలక వ్యక్తులు సీఐడీ అదుపులో ఉన్నారు. వీరిని శనివారం మీడియా ముందు ప్రవేశపెడతారని సమాచారం. అధికారులు ప్రాథమిక నివేదికను గురువారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు పంపించారు. ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమితులైన ఐజీ నవీన్‌కుమార్ ఆదేశాలతో గుంటూరు జిల్లాలో 100లోపు ర్యాంకులు సాధించిన 11 మంది నాన్‌లోకల్ అభ్యర్థులను శుక్రవారం కూడా విచారించినట్లు సమాచారం.
ఈ కేసులో కీలక నిందితుడి భార్య బెంగళూరులో డాక్టర్‌గా పనిచేస్తున్నారని, ఆమె కోసం సీఐడీ అధికారులు వెళ్లారని తెలిసింది. ఆమెను విచారిస్తే మరిన్ని ఆధారాలు లభిస్తాయని భావిస్తున్నారు. అలాగే వర్సిటీలో ఓ ఉన్నతాధికారిణి పాత్ర కీలకమని సీఐడీ నిర్ధారణకు వచ్చిందని, ఆమెను అరెస్టు చేయనున్నారని శుక్రవారం ప్రచారం జరిగింది. ప్రశ్నపత్రం ప్రింటింగ్ ప్రెస్‌లో లీకైందని సీఐడీ తే ల్చడంతో వర్సిటీ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందనే కోణంలో గవర్నర్‌కు నివేదిక అందజేస్తారని సమాచారం. మళ్లీ పరీక్ష నిర్వహణకు ఆదేశించినా అందుకు తగినట్లుగా వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.