టీఆర్‌ఆర్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు రద్దయిన ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారిని వివిధ మెడికల్ కాలేజీల్లో సర్దుబాటు చేసినా, ఆ కాలేజీ నుంచి ఫీజు బదిలీ జరగకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సర్దుబాటు చేసిన కాలేజీలకు ఫీజు చెల్లించకపోతే మొదటి ఏడాది పరీక్ష రాసేందుకు వీలు లేకుండా పోతుంది.
ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. టీఆర్‌ఆర్ యాజమాన్యం ఫీజు డబ్బులు బదిలీ చేయకపోవడం లేదా వెనక్కు ఇవ్వకపోవడంతో ఏకంగా బీ, సీ కేటగిరీలకు చెందిన ఏడుగురు విద్యార్థులు వైద్య విద్యకు స్వస్తి చెప్పాల్సివచ్చిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
– సాక్షి, హైదరాబాద్
ఎవ్వరికీ పట్టని విద్యార్థుల గోడు
2021–22 వైద్య విద్యా సంవత్సరంలో ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు లేవంటూ రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీల్లోని మొదటి ఏడాది ఎంబీబీఎస్ అడ్మిషన్లను జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) రద్దు చేసిన సంగతి తెలిసిందే. సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్, పటాన్‌చెరులోని టీఆర్‌ఆర్, వికారాబాద్‌లోని మహవీర్ కాలేజీల్లో మొదటి ఏడాదికి చెందిన మొత్తం 450 ఎంబీబీఎస్ సీట్లను ఎన్‌ఎంసీ రద్దు చేసింది.
దాంతో ఆయా కాలేజీల్లో చేరిన వైద్య విద్యార్థులు అడ్మిషన్లు పొందిన నెలకే రోడ్డున పడ్డారు. వాటిల్లో తొలి ఏడాది చేరిన వైద్య విద్యార్థులు అంతా కలిపి రూ.66 కోట్లు చెల్లించారు. తర్వాత టీఆర్‌ఆర్, మహావీర్ మెడికల్ కాలేజీలకు చెందిన 300 మంది (ఒక్కో మెడికల్ కాలేజీకి చెందిన 150 మంది) విద్యార్థులను 13 ప్రైవేట్ కాలేజీల్లో సర్దుబాటు చేశారు. ఎమ్మెన్నార్ కాలేజీ విద్యార్థులను మాత్రం తిరిగి అందులోనే కొనసాగించారు.
ఈ క్రమంలో టీఆర్‌ఆర్ కాలేజీ డబ్బులు ఇవ్వకుండా చెక్కులు ఇచ్చింది. అయితే అవి బౌన్స్ అవుతున్నాయి. ముఖ్యంగా బీ, సీ కేటగిరీల్లో పెద్ద మొత్తంలో డొనేషన్లు చెల్లించిన విద్యార్థులకు రసీదులు లేకపోవడం ఒక సమస్య కాగా, కొందరు తక్కువ ధరకు మాట్లాడుకోవడం వల్ల ఇతర కాలేజీల్లో సర్దుబాటుతో అక్కడ పూర్తి స్థాయి ఫీజు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సీ కేటగిరీకి చెందిన కొందరు విద్యార్థులైతే ఏకంగా ఏడాదికి రూ. 23 లక్షల చొప్పున చెల్లించారు.
ఇందులో డొనేషన్ల సొమ్ముకు కాలేజీలు ఎలాంటి రసీదులూ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. బీ, సీ కేటగిరీలకు చెందిన ఓ ఏడుగురు విద్యార్థులు పెద్దమొత్తంలో టీఆర్‌ఆర్ కాలేజీకి డొనేషన్ చెల్లించారు. కానీ ఆ కాలేజీ యాజమాన్యం ఇప్పటివరకు తిరిగి డబ్బు ఇవ్వకపోవడం, తమకు తిరిగి సీటు కేటాయించిన కాలేజీకీ డబ్బులు బదిలీ చేయకపోవడం.. మళ్లీ ఇక్కడ అంత మొత్తంలో చెల్లించేంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో మొత్తంగా ఆ ఏడుగురు విద్యార్థులూ ఎంబీబీఎస్ విద్యకే దూరమయ్యారని అంటున్నారు. కాగా మొత్తం ఈ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యం వివరణ కోసం పలుమార్లు ఫోన్ చేసినా వారు స్పందించకపోవడం గమనార్హం.
వైద్య విద్యకు దూరం
మా అమ్మాయిని సీ కేటగిరీలో టీఆర్‌ఆర్‌లో చేర్పించాను. ఒకేసారి రూ. 75 లక్షల ఫీజు చెల్లించాను. ఇతర కాలేజీలో చేరాలంటే అక్కడ డబ్బు చెల్లించాలన్నారు. టీఆర్‌ఆర్ యాజమాన్యం మాత్రం డబ్బులు బదిలీ చేయలేదు. దీంతో మా అమ్మాయి ఏకంగా ఎంబీబీఎస్ చదువుకే దూరమైంది.
– శ్రద్ధ (విద్యార్థిని తల్లి)
రసీదులు తెస్తే న్యాయం చేస్తా
టీఆర్‌ఆర్ కాలేజీలో చేరి డబ్బులు చెల్లించినట్లు తల్లిదండ్రులు, విద్యార్థులు తమ వద్దకు రసీదులతో వచ్చి లిఖిత పూర్వక ఫిర్యాదులు చేస్తే, అటువంటి వారికి న్యాయం చేస్తాము. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడతాం.
– కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
రూ.45 లక్షలు చెల్లించా
మా అబ్బాయిని టీఆర్‌ఆర్‌లో చేర్పించాను. ïఫీజు రూ.75 లక్షలకు మాట్లాడుకున్నాను. అడ్మిషన్ రద్దయ్యే నాటికి రూ. 45 లక్షలు చెల్లించాను. ఇప్పుడు మా అబ్బాయిని కరీంనగర్‌లోకి ఒక కాలేజీలో సర్దుబాటు చేశారు. టీఆర్‌ఆర్ కాలేజీ చెక్‌లను కరీంనగర్ కాలేజీ అనుమతించడంలేదు. టీఆర్‌ఆర్ కాలేజీ యాజమాన్యం ఇప్పటివరకు మేం చెల్లించిన సొమ్మును ఇవ్వలేదు. పరీక్ష ఫీజు దగ్గర పడుతోంది. ఫీజు చెల్లించకుంటే పరీక్ష రాసే పరిస్థితి లేదంటున్నారు.
– శ్రీనివాసరెడ్డి, ఎంబీబీఎస్ విద్యార్థి తండ్రి
చెక్‌లు బౌన్స్ అవుతున్నాయి
టీఆర్‌ఆర్ కాలేజీలో బీ కేటగిరీలో మా అబ్బాయిని చేర్పించాను. మొదటి ఏడాది కింద రూ. 11.25 లక్షల ఫీజు చెల్లించాను. తర్వాత ఆర్వీఎం కాలేజీలో సర్దుబాటు చేశారు. కానీ టీఆర్‌ఆర్ కాలేజీ యాజమాన్యం మాత్రం ఫీజు ఆర్వీఎం కాలేజీకి బదిలీ చేయలేదు. దీంతో మళ్లీ ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లేకుంటే పరీక్ష రాయడానికి వీలుండదని చెబుతున్నారు.
– రుక్మిణి, (ఎంబీబీఎస్ విద్యార్థి తల్లి)
Comments
Please login to add a commentAdd a comment