సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 2023–24 వైద్య విద్య సంవత్సరానికి కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, ప్రస్తుత కాలేజీల్లో యూజీ, పీజీ సీట్లను పెంచుకునేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు పత్రాలను దాఖలు చేయడానికి గడువు తేదీని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) పొడిగించింది. ఎంబీబీఎస్ సీట్లకు ఆగస్టు 31తో, పీజీ సీట్లకు జూలై 20తో గడువు ముగియగా... కాలేజీల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకొని గురువారం నుంచి ఈ నెల 23 వరకు దరఖాస్తులను స్వీకరించడానికి గడువు పొడిగించినట్లు పేర్కొంది.
దేశంలో డీమ్డ్ వైద్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనుకునే సందర్భంలో ప్రస్తుత నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. విశ్వవిద్యాలయానికి సమీపంలోనే రెండేళ్ల కాలం నాటి వెయ్యి పడకల ఆసుపత్రి తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను సడలించింది. సమీపంలో లేకపోయినా దేశంలో ఎక్కడైనా సరే వెయ్యి పడకల ఆసుపత్రి రెండేళ్లుగా ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. అయితే వైద్య సంస్థ, ఆసుపత్రి భవనాలు సొంతంగా ఉండాలని చెప్పింది. డీమ్డ్ విశ్వవిద్యాలయం కోసం దరఖాస్తు చేసే సమయానికే వెయ్యి పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పి ఉండాలని తేల్చిచెప్పింది. మరోవైపు, మెడికల్ కాలేజీల్లో తనిఖీలు, పర్యవేక్షణకు నిపుణుల కమిటీలో సభ్యులుగా అర్హులైన అధ్యాపకుల పేర్లను పంపించాలని తెలిపింది.
ఆధార్ లింక్‌తో బయోమెట్రిక్
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కచ్చితంగా ఆధార్ నంబర్‌తో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అనుసరించాల్సిందేనని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. అధ్యాపకులు, ట్యూటర్లు, డిమానిస్ట్రేటర్లు, సీనియర్ రెసిడెంట్లు సహా ప్రతి ఒక్కరు కూడా ఈ విధానాన్ని పాటించాలని, లేకపోతే తదుపరి సంవత్సరాలకు మెడికల్ సీట్లను పొడిగించడం, కొత్త సీట్లకు అనుమతించడం, కొత్త కళాశాలను స్థాపించడం వంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. ఆధార్ బయోమెట్రిక్ హాజరును ఎన్‌ఎంసీకి అనుసంధానం చేయాలని తెలిపింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలను నెల రోజుల్లోగా director.nmc@nmc.org. inకు పంపాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment