New Regulations for Private Hospitals by National Medical Commission - Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆసుపత్రులకు జాతీయ వైద్య కమిషన్‌ కొత్త నిబంధనలు..!

Published Wed, May 25 2022 1:30 AM | Last Updated on Wed, May 25 2022 10:00 AM

New Regulations for Private Hospitals by National Medical Commission - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఫీజులు రోగులకు అందుబాటులో ఉండా లని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పేర్కొంది. డాక్టర్‌ ఫీజు, కన్సల్టేషన్, రిఫండ్‌ వంటి వివిధ అంశాల ఆధారంగా ఫీజులు వసూలు చేయకూడదని, అలాంటి వాటితో రోగికి సంబంధం లేదని స్పష్టం చేసింది. వైద్య నియమావళిలో పలు కీలక మార్పులు చేస్తూ, వైద్య సేవలకు సంబంధించి కొత్త నిబంధనలు విధిస్తూ, వైద్యులకు పలు సూచనలు చేస్తూ.. ఎన్‌ఎంసీ ముసాయిదాను రూపొందించింది. ముఖ్యాంశాలివీ.. 

కంపెనీ పేరుతో మందులు రాయొద్దు 

  • కార్పొరేట్‌ ఆసుపత్రులు తాము అందించే వైద్య సేవలను మాత్రమే తెలియజేయాలి. దాని ఫీజును చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ల పేరుతో ప్రచారం చేయకూడదు. 
  • జనరిక్‌ పేరుతోనే మందులు రాయాలి కానీ కంపెనీ పేరుతో రాయకూడదు. మందులు రాసేటప్పుడు పెద్ద అక్షరాల్లో (క్యాపిటల్‌ లెటర్స్‌) అర్ధమయ్యేట్లు రాయాలి.  
  • ఫార్మాస్యూటికల్‌ కంపెనీల నుంచి డాక్టర్లు ఎలాంటి బహుమతులు పొం దకూడదు. ఐదేళ్లకోసారి ఆ మేరకు అఫిడవిట్‌ సమర్పించాలి. ఒకవేళ పొం దితే దాన్ని వెల్లడించాలి. కంపెనీల ప్రభావానికి లోనుకాకూడదు. కాన్ఫరెన్స్‌లు, సెమినార్లకు కూడా కంపెనీల స్పాన్సర్‌షిప్‌ తీసుకోకూడదు. 

ప్రాక్టీస్‌పై జీవితకాల నిషేధం!  
రోగులు తమకు ఏదైనా అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు, అది నిజమని తేలితే నిపుణుల కమిటీ తగిన చర్యలు చేపడుతుంది. సాధారణ తప్పు అయితే డాక్టర్‌ను మందలిస్తుంది. కొన్నిసార్లు కౌన్సెలింగ్‌ ఇస్తుంది. ఒకవేళ లైసెన్స్‌ లేకుండా డాక్టర్‌ ప్రాక్టీస్‌ చేస్తే, లైసెన్స్‌ ఫీజుకు పది రెట్లు జరిమానాగా విధిస్తుంది.  
– వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా రోగి చనిపోయినా, భారీ తప్పులు జరిగినా.. తీవ్రత ఆధారంగా అవసరమైతే ప్రాక్టీస్‌ చేయకుండా జీవితకాలం నిషేధం విధించే అవకాశం కూడా ఉంది.  
– రోగుల విషయంలో నైతిక నియమాలను సరిగా పాటించకపోతే లైసెన్సును నెల రోజుల వరకు సస్పెండ్‌ చేయవచ్చు. రోగికి ప్రత్యక్షంగా హాని జరిగితే మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు సస్పెండ్‌ చేయొచ్చు.  

రోగికి వాస్తవ సమాచారం ఇవ్వాలి 
– రోగి పరిస్థితిని ఉన్నదున్నట్టు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు చెప్పాలి. దాచిపెట్టడం కానీ, ఎక్కువ చేసిగానీ చెప్పకూడదు. యథార్థ సమాచారం ఇవ్వాలి. ఆపరేషన్‌ అవసరమైతే కుటుంబ సభ్యుల అనుమతితోనే చేయాలి. సర్జన్‌ పేరు కూడా రికార్డులో ఉండాలి.  
– మైనర్లకు, మానసికంగా సరిగా లేని వ్యక్తులకు ఆపరేషన్‌ చేయాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ల కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. 8 ఏళ్లకు పైబడిన చిన్నారులైతే ఆ పిల్లలకు సంబంధిత చికిత్స వివరాలను తెలియజేయాలి. 
 – రోగికి వైద్యం చేసిన తర్వాత వారి రికార్డులను మూడేళ్లు భద్రపరచాలి. వాటిని సంబంధిత వ్యవస్థలు ఏవైనా అడిగితే ఐదు రోజుల్లోగా ఇవ్వాలి.  
– నూతన నియమావళి రూపొందిన మూడేళ్ల లోపు రోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ప్రతి రికార్డును డిజిటలైజ్‌ చేయాలి. అలాగే రోగి వివరాలను గోప్యంగా ఉంచాలి. 

కొన్నిటికి మాత్రమే టెలిమెడిసిన్‌ 
– ఎలాంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండా టెలీ మెడిసిన్‌ ద్వారా మందులు ఇవ్వకూడదు. కనీసం గత ప్రిస్కిప్షన్‌ల వంటి ఆధారమైనా లేకుండా మందులు ఇవ్వకూడదు.  
– టెలీ మెడిసిన్‌.. వీడియో, ఆడియో, మెస్సేజ్, ఈ మెయిల్‌ రూపంలో జరుగుతుంది. కాబట్టి కొందరిని భౌతికంగా పరీక్షించాల్సి ఉంటే అలా చేయాల్సిందే.  
– ఆన్‌లైన్‌లో ఆరోగ్యంపై అవగాహన కల్పించవచ్చు. కౌన్సిలింగ్‌ ఇవ్వడానికి, కొన్ని రకాల మందులు సూచించడానికి ఇది పనికి వస్తుంది. దగ్గు మందులు, నొప్పి మందులు, యాంటీ ఫంగల్, యాంటీబయోటిక్స్‌ వంటి మందులను ఆన్‌లైన్‌లో సూచించవచ్చు. వాట్సాప్‌లోనూ ఇవ్వొచ్చు.  
– వీడియో కన్సల్టేషన్‌లో చర్మ, ఆస్తమా, మధుమేహం, రక్తపోటు, క్షయ వంటి వాటికి మందులను ఇవ్వొచ్చు. ఫాలోఅప్‌లో మందులు కూడా ఇవ్వొచ్చు.  
– క్యాన్సర్, మెదడును ఉత్తేజపరిచే, సైకియాట్రిక్‌ మందులు వాట్సాప్‌ ద్వారా కానీ టెలీమెడిసిన్‌లో కానీ ఇవ్వొద్దు. ఆ రోగులను భౌతికంగా చూడాల్సిందే. 

రోగి అనుమతితోనే మీడియాలో ప్రచురించాలి  
– రోగికి ఏవైనా ప్రత్యేక చికిత్సలు చేసినప్పుడు వారి అనుమతి మేరకే మీడియాలో ప్రచురించాలి. 
– గుర్తింపులేని వైద్యులతో కలసి పని చేయకూడదు. వైద్యంతో సంబంధం లేనివారు కూడా ప్రాక్టీస్‌ పెడుతున్నందున వారితో కలిసి పనిచేయవద్దు.  
 – డాక్టర్లు సెమినార్లు, సదస్సులకు హాజరవుతూ వైద్యంలో అవుతున్న అప్‌డేట్‌ ఆధారంగా ప్రతి ఐదేళ్లకోసారి 30 మార్కులు పొందాల్సి ఉంటుంది. అలా సాధిస్తేనే ఐదేళ్లకోసారి రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ చేస్తారు.  
– ఎలాంటి గుర్తింపు లేనివారికి వారి అనుభవం ఆధారంగా (ఆర్‌ఎంపీల వంటి వారికి) వైద్యులు సర్టిఫికెట్లు ఇవ్వకూడదు.  
– వైద్యులు ఇతర రాష్ట్రాల్లో పనిచేసేందుకు ప్రస్తుతం ఎన్‌వోసీ త్వరగా ఇవ్వడంలేదు. దాన్ని ఇప్పుడు సరళతరం చేసి వారంలో ఇచ్చేలా మార్పు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement