సాక్షి, హైదరాబాద్: చిన్న పిల్లలకు పీడియాట్రిక్స్ స్పెషలైజేషన్‌లాగే... వృద్ధులకు ప్రత్యేకంగా వైద్యం అందించేలా పీజీ మెడికల్‌లో జీరియాట్రిక్స్ స్పెషలైజేషన్ కోర్సును కేంద్ర ప్రభుత్వం పరిచయం చేయనుంది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తాజాగా ప్రకటించింది. దేశంలో వృద్ధుల జనాభా పెరుగుతుండటం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వృద్ధులు జీవితాంతం నాణ్యమైన జీవితాన్ని గడిపేలా ఈ కోర్సును తీర్చిదిద్దుతారు. ప్రస్తుతం పీజీ ఎండీ, ఎంఎస్‌లలో 32 కోర్సు లున్నాయి. వీటిల్లో కొత్తగా 4 కోర్సులను ప్రారంభిస్తారు. సూపర్ స్పెషాలిటీలో ప్రస్తుతం 38 కోర్సు లున్నాయి. ఈ కేటగిరీలో కొత్తగా 8 కోర్సులను ప్రారంభించాలని ఎన్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది.
వైద్య రంగంలో నైతిక విలువలు...
వైద్యరంగంలో నైతిక విలువలపై ప్రత్యేకంగా ఎటువంటి కోర్సు లేదు. కానీ రాబోయే రోజుల్లో పీజీ మెడికల్‌లో ఐసీఎంఆర్ నిర్వహించే మెడికల్ ఎథిక్స్ అనే సర్టిఫికెట్ కోర్సును తప్పనిసరిగా చదవాలి. మొదటి ఏడాదిలోనే ఈ కోర్సును పూర్తి చేయాలి. దాన్ని రాయకుంటే ఫైనలియర్ పరీక్ష రాయడానికి వీలుండదు. ఒక డాక్టర్ వేరే డాక్టర్ గురించి చెడుగా చెప్పకూడదు.. కమీషన్ల కోసం ఇతర ఆసుపత్రులకు రోగులను రిఫర్ చేయకూడదు.. డాక్టర్, రోగుల మధ్య సంబంధాలపై మానవీయ కోణాన్ని పెంపొందించడానికి ఈ కోర్సును ఉద్దేశించారు.
మరికొన్ని అంశాలు...
►పీజీ మెడికల్‌లో మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే బేసిక్ బయో మెడికల్ రీసెర్చి కోర్సును ఆన్‌లైన్‌లో చదివి రాయాల్సి ఉంటుంది. వైద్య విద్యార్థుల్లో పరిశోధనను పెంపొందించాల్సి ఉంది. ఎలాంటి అంశాలపై చేయవచ్చు అన్న దానిపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు.
►బేసిక్ లైఫ్ సపోర్టుపై అన్ని స్పెషలైజేషన్ కోర్సు ల వైద్య విద్యార్థులకు తప్పనిసరి చేశారు. అత్యవసర వైద్యాన్ని అందరూ నేర్చుకోవాలి. ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు.
►గతంలో పీజీ మెడికల్‌లో మొదటి ఏడాది, చివరి ఏడాది మాత్రమే పరీక్ష ఉండేది. ఇప్పుడు కోర్సును 50 మాడ్యూల్స్‌గా విభజిస్తారు. దాని ప్రకారం వాళ్లకి శిక్షణ ఇచ్చి, అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. మాడ్యూల్స్ పూర్తి కాగానే పరీక్ష నిర్వహిస్తారు. ఇవన్నీ ప్రాక్టికల్ పరీక్షలే.
►పీజీ మెడికల్ విద్యార్థులు జిల్లా ఆసుపత్రిలో కోర్సు పీరియడ్‌లో తప్పనిసరిగా 3 నెలలు పనిచేయాలి. దీనివల్ల జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్య సేవలు మెరుగుపడతాయి. జాతీయ ఆరోగ్య పథకాలు, స్థానిక జబ్బులపై అవగాహన కల్పించడానికి దీన్ని ఉద్దేశించారు.
►అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల అనుభవం, పరిశోధనల ఆధారంగా పీజీ సీట్లను ఆయా కాలేజీలకు అనుమతిస్తారు. ప్రస్తుతం ఒక అసోసియేట్ ప్రొఫెసర్‌కు 2, ప్రొఫెసర్‌కు 3 సీట్లను ఎన్‌ఎంసీ మంజూరు చేస్తోంది. ప్రొఫెసర్ల సామర్థ్యం సరిగా లేకుంటే అటువంటి కాలేజీలకు ప్రొఫెసర్‌కు ఒక సీటునే మంజూరు చేస్తారు.
►ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సులను ప్రారంభించాలంటే తప్పనిసరిగా ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్లు ఉండాలన్నది నిబంధన. ఎంవోయూ లేదా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో బయ ట సమకూర్చుకోవడాన్ని అనుమతించరు.
కొత్త కోర్సులు...
మెడికల్ పీజీలో (ఎండీ, ఎంఎస్)
►ఏరోస్పేస్ మెడిసిన్
►మెరైన్ మెడిసిన్
►ట్రమటాలజీ అండ్ సర్జరీ...
►జీరియాట్రిక్
సూపర్ స్పెషాలిటీలు...
►మెడికల్ జెనెటిక్స్
►వైరాలజీ మెడిసిన్
►చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ
►జీరియాట్రిక్ మెంటల్ హెల్త్
►హెపటాలజీ (లివర్)
►ఎంసీహెచ్ ఎండోక్రైన్ సర్జరీ
►హెపటో పాంకీయాట్రో బిలియరీ సర్జరీ
►రీప్రొడెక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ
20 ఏళ్ల తర్వాత మార్పులు
20 ఏళ్ల తర్వాత పీజీ మెడికల్‌లో పలు కీలకమైన మార్పులు చేశారు. ప్రస్తుతం తీసుకొచ్చిన కోర్సులు శాస్త్రీయంగా, సామాజిక అవసరాలకు తగినట్లుగా ఉన్నాయి. మెడికల్ కాలేజీల్లో వైద్య పరిశోధనకు ఊపు తీసుకురావాలని ఎన్‌ఎంసీ నిర్ణయించడం ముదావహం. నియమాలు ఒకవైపు సరళతరం చేస్తూనే మరోవైపు కొన్ని కొత్త మార్పులు సూచించారు.
– డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment