మెడి‘కిల్స్‌’పై ఎన్‌ఎంసీ నజర్‌ | NMC Takes Measures To Prevent Suicides In Medical Colleges | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీల్లో ఆత్మహత్యల నివారణకు చర్యలు

Published Mon, Oct 3 2022 3:05 AM | Last Updated on Mon, Oct 3 2022 3:05 AM

NMC Takes Measures To Prevent Suicides In Medical Colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్‌ కాలేజీల్లో జరుగుతున్న ఆత్మహత్యలు, ఆత్మహత్యా ధోరణుల నివారణపై జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) దృష్టి సారించింది. గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న పీజీ మెడికల్‌ విద్యార్థుల సంఖ్య, అదేకాలంలో కాలేజీలను మధ్యలోనే వదిలేసిన విద్యార్థుల వివరాలను తమకు అందజేయాలని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీన్లకు తాజాగా లేఖ రాసింది.

ఆత్మహత్యలు, కోర్సు వదిలిపెట్టి వెళ్లడం, వైద్య విద్యార్థుల పనివేళలకు సంబంధించిన ఒత్తిడి వివరాలను ఈ నెల ఏడో తేదీ నాటికి పంపాలని కోరింది. ఇటీవల ఎన్‌ఎంసీ ఆధ్వర్యంలోని అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు(యూజీఎంఈబీ) అధ్యక్షులు డాక్టర్‌ అరుణ వి.వాణికర్‌ నేతృత్వంలో యాంటీ ర్యాగింగ్‌ కమిటీ ఏర్పాటైంది. దాని మొదటి సమావేశంలో వైద్యవిద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అందిన ర్యాగింగ్‌ ఫిర్యాదులను సమీక్షించింది.

వైద్యవిద్యార్థుల ఆత్మహత్యలు, ఆత్మహత్యా ధోరణిపై చర్చించింది. వైద్యవిద్యార్థులు సంబంధిత మెడికల్‌ కాలేజీలతోపాటు ఎన్‌ఎంసీకి కూడా ఫిర్యాదులు చేయడానికి ప్రత్యేక ఈ–మెయిల్‌ ఐడీని సృష్టించింది. ఈ సమాచారాన్ని అన్ని కాలేజీల వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని, హాస్టల్, మెస్, క్లాస్‌రూమ్, లైబ్రరీ, లెక్చర్‌ హాల్, కామన్‌ రూమ్‌ మొదలైన ప్రముఖ ప్రదేశాలలో ప్రదర్శించడం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఎన్‌ఎంసీ సూచించింది.   

18–30 ఏళ్ల మధ్యలో ఆగమాగం 
వైద్యవృత్తిలో తలెత్తే ఒడిదొడుకులను తట్టుకోలేక కొందరు యువవైద్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే. 2016 నుంచి 2020 మధ్యకాలంలో 18 నుంచి 30 ఏళ్ల వయసుకు చెందిన వివిధ రకాల వృత్తుల్లో ఉన్నవారు పలు సమస్యలతో 3,100 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో అనేకమంది వైద్యులు ఉన్నారని పేర్కొంది. అదేకాలంలో వివిధ వయస్సులవారు 12,397 మంది పరీక్షల్లో ఫెయిల్‌ కావడంవల్ల ఆత్మహత్య చేసుకున్నారు. వారిలోనూ వైద్య విద్యార్థులున్నారు.

ఈ నేపథ్యంలో వైద్యవిద్యార్థుల్లో ఒత్తిడి, నిరాశలను తగ్గించడానికి మెడికల్‌ కాలేజీల్లో యోగాను ఎన్‌ఎంసీ ప్రవేశపెట్టింది. మరోవైపు విదేశాల్లో చదివిన వేలాదిమంది భారత వైద్య విద్యార్థుల్లో ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌(ఎఫ్‌ఎంజీఈ) పాసయ్యేవారు 20 శాతం వరకే ఉంటున్నారు. ఎఫ్‌ఎంజీఈ పాసైతేనే మనదేశంలో మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అర్హత ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఆత్మహత్యల్లో మూడింట ఒక వంతు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ విద్యార్థులు, మిగిలినవారు ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యులు ఉంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. పీజీలో ఆర్థికభారం, వృత్తిపరమైన బాధ్యత, వివాహం కాకపోవడం వంటివి ఆత్మహత్యలకు కారణాలుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆత్మహత్యల్లో 60 శాతం ఒత్తిడికి సంబంధించినవే ఉంటున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీ స్థాయిలో జరిగే ఆత్మహత్యల నివారణకు ఎన్‌ఎంసీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement