సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కళాశాలల ప్రారంభానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కి ఆ కళాశాలల ప్రిన్సిపల్స్ దరఖాస్తు చేశారు. పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెలో ఈ కళాశాలలు నిర్మిస్తున్నారు. ఒక్కో కాలేజిలో 150 సీట్లతో 2024–25 విద్యా సంవత్సరం నుంచి అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించడానికి దరఖాస్తు చేశారు.
అంటే మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయి. ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వీటిలో ఒక్కో కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున మొత్తం 3,530 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టులను భర్తీ చేసి, కళాశాలలకు అనుమతి కోసం దరఖాస్తు చేశారు. ఈ ఐదు చోట్ల ఉన్న ఏపీవీవీపీ ఆస్పత్రులను ప్రభుత్వం 330 పడకల బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేస్తోంది.
వీటిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభానికి వీలుగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ వంటి వివిధ విభాగాలను ఏర్పాటు చేసింది.
రూ.8,480 కోట్లతో 17 కళాశాలలు
ప్రజలకు ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య వసతులు సమకూర్చడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రూ.16వేల కోట్లకు పైగా ఖర్చుతో నాడు–నేడు కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాలేజీల ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి తెస్తున్నారు.
ఇటీవలే సీఎం వైఎస్ జగన్ నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలను ప్రారంభించారు. వీటి ద్వారా 750 సీట్లు అదనంగా వచ్చాయి. ఈ కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ఐదు కొత్త కాలేజీల ద్వారా మరో 750 సీట్లు సమకూరనున్నాయి. ఇక మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్నారు.
అన్ని వనరులతో వైద్య కళాశాలలు
కొత్తగా ప్రారంభించే వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోంది. సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలు ప్రారంభించడానికి ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేశాం. అదే విధంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించిన ఐదు కళాశాలలకు ఫస్ట్ రెన్యువల్‌కు దరఖాస్తు చేశాం. – డాక్టర్ నరసింహం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
Comments
Please login to add a commentAdd a comment