సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యవిద్య ఆలస్యం కావడంతో 2021–22లో కొత్తగా చేరే ఎంబీబీఎస్ విద్యార్థులకు విద్యాసంవత్సర కాలపరిమితిని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) కుదించింది. మొదటి ఏడాది సహా అన్ని సంవత్సరాల వైద్యవిద్యను 11 నెలలపాటు నిర్వహించేలా ఆదేశాలిచ్చింది. తాజాగా సవరించిన నిబంధనలు కేవలం 2021–22 బ్యాచ్ వైద్య విద్యార్థులకే వర్తిస్తాయని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. సాధారణంగా ఫస్టియర్ కోర్సు కాలవ్యవధి 13 నెలలు, ఇతర సంవత్సరాల్లో 12 నెలలు ఉంటుంది. ఇందులో మొదటి ఏడాది ఒక నెల ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. తాజా మార్పుల నేపథ్యంలో ఈ కాల వ్యవధిని రెండు నెలలు తగ్గించారు.
ఈ కోర్సును రోజువారీ తరగతుల్లో భాగంగా కొంత సమయాన్ని అదనంగా కేటాయించి బోధించాలని ఎన్‌ఎంసీ ఆదేశించింది. తొలి సంవత్సరం సహా మిగిలిన సంవత్సరాల్లోనూ పండుగలు, వేసవి సెలవులు కలుపుకొని సుమారు 2 నెలలు సెలవు దినాలుంటాయి. అయితే ఈ సెలవు రోజులను ఒక నెలకు కుదిస్తూ ఎన్‌ఎంసీ ఆదేశాలిచ్చింది. ఈ బ్యాచ్ విద్యార్థులకు అన్ని సంవత్సరాల్లోనూ ఆ ఏడాది మొత్తమ్మీద గరిష్టంగా నెల రోజుల సెలవులే ఉంటాయి. దీంతో 11 నెలలపాటు విద్యాబోధన వారికి కొనసాగుతుంది. 2021–22 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులకు ఈ నెలలో తరగతులు ప్రారంభమై ఇదే ఏడాది డిసెంబర్‌లో ముగుస్తాయి.
2023 జనవరిలో ఈ బ్యాచ్ తొలి సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. మళ్లీ అదే సంవత్సరం ఫిబ్రవరి నుంచి 11 నెలలపాటు రెండో ఏడాది తరగతులుంటాయి. ఇలా కొనసాగే వారి వైద్యవిద్య 2026 జూన్‌లో తుది సంవత్సరం పరీక్షలతో ముగుస్తుంది. ఈ బ్యాచ్ విద్యార్థులకు సెలవులను కుదించి, బోధన కాలపరిమితిని పెంచారే తప్ప, పాఠ్యాంశాల్లో లేదా బోధనా విధానం, ప్రాక్టికల్స్‌లో ఎటువంటి మార్పులు చేయలేదని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. 2021–22 బ్యాచ్‌కు చెందిన విద్యార్థుల హౌస్ సర్జన్ కూడా ఏడాది పాటే ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని జాతీయ వైద్య కమిషన్ తాజాగా ఆదేశాలిచ్చింది.
14 నుంచి తరగతులు...
ఈ నెల 14 నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ వైద్య తరగతులు ప్రారంభించాల్సిందేనని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ఆ మేరకు రాష్ట్రాల్లో తొలి ఏడాది ప్రవేశాల ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment