సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జూలై 18 నుంచి ఆగస్టు 10 వరకూ నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. సోమవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం అనంత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో దాదాపు 18 పనిదినాలు ఉండనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు, ఓబీసీ జాతీయ కమిషన్‌కు రాజ్యంగబద్ధత బిల్లు, జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటు బిల్లు, ట్రాన్స్‌జెండర్స్ బిల్లుతో పాటు 6 ఆర్డినెన్సుల్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదవీకాలం జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో కొత్త డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు ఈ సమావేశాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు వర్షకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు అనంత్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment