Minister Ananth Kumar
-
కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ కన్నుమూత
సాక్షి, బెంగళూరు/శివాజీనగర: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పెట్రోలియం, రసాయనాల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మం త్రి అనంత్ కుమార్(59) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం అర్ధరాత్రి దాటా క 2 గంటలకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దక్షిణ భారతంలోని కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావటానికి కృషి చేసిన ముఖ్య నేతల్లో అనంత్ కుమార్ ఒకరు. దక్షిణ బెంగళూరు నుంచి ఆయన వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అనంత్ కుమార్‌కు భార్య డాక్టర్ తేజస్వి, కుమార్తెలు ఐశ్వర్య, విజేత ఉన్నారు. సాయంత్రం ప్రధాని మోదీ బెంగళూరుకు వచ్చి అనంత్ కుమార్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంత్ కుమార్ కుటుంబసభ్యులను ఓదార్చారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు.. బెంగళూరుకు చెందిన హెచ్.ఎన్.నారాయణ్ శాస్త్రి, గిరిజ దంపతులకు అనంత్ కుమార్ 1959లో జన్మించారు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ సభ్యుడయ్యారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతగా అరెస్టై జైలుకు వెళ్లారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 1987లో బీజేపీలో చేరారు. 1996లో మొదటిసారిగా దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యారు. 1998లో వాజపేయి కేబినెట్లో 38 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ సారథులు వాజ్‌పేయి, అడ్వాణీతోపాటు ప్రధాని మోదీకి సన్నిహితుడిగా అనంత్ కుమార్‌కు పేరుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కన్నడలో ప్రసంగించిన మొదటి నేత అనంత్‌కుమారే. నేడు అంత్యక్రియలు బ్రిటన్, అమెరికాల్లో కేన్సర్ వ్యాధికి చికిత్స పొందిన అనంత్‌కుమార్ అక్టోబర్‌లో స్వదేశానికి తిరిగి వచ్చారు. బెంగళూరులోని శ్రీశంకర కేన్సర్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం చామరాజపేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. ప్రముఖుల సంతాపం.. అనంత్‌కుమార్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎల్కే అడ్వాణీ సంతాపం తెలిపారు. ‘అనంతకుమార్ మంచి పరిపాలనాదక్షుడు. యువకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి అంకితభావంతో పనిచేశారు. కర్ణాటక, ముఖ్యంగా బెంగళూరులో పార్టీ బలోపేతం అయ్యేందుకు కృషి చేశారు. ఆయన భార్య తేజస్వినితో మాట్లాడాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. గవర్నర్, తెలంగాణ సీఎం సంతాపం సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి అనంత కుమార్ మృతికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంత కుమార్ మృతి దేశానికి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. అనంత్ కుమార్ దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అలాగే, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అనంత్‌కుమార్ మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతకుమార్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కుటుం బ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. -
జూలై 18 నుంచి పార్లమెంటు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జూలై 18 నుంచి ఆగస్టు 10 వరకూ నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. సోమవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం అనంత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో దాదాపు 18 పనిదినాలు ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు, ఓబీసీ జాతీయ కమిషన్‌కు రాజ్యంగబద్ధత బిల్లు, జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటు బిల్లు, ట్రాన్స్‌జెండర్స్ బిల్లుతో పాటు 6 ఆర్డినెన్సుల్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదవీకాలం జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో కొత్త డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు ఈ సమావేశాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు వర్షకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు అనంత్ విజ్ఞప్తి చేశారు. -
చౌకైన శానిటరీ న్యాప్కిన్ల ఆవిష్కరణ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అత్యంత చౌకైన, మట్టిలో కలసిపోయే శానిటరీ న్యాప్కిన్లను కేంద్రం గురువారం ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమంత్రి భారతీయ జనఔషధి పరియోజన(పీఎంబీజేపీ) కేంద్రాల్లో నాలుగు న్యాప్కిన్లు ఉండే ఒక్కో ప్యాక్‌ను ‘సువిధా’ పేరుతో కేవలం రూ.10కే అందించనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. ఈ ఏడాది మే 28 నాటికల్లా దేశంలోని 3,200 పీఎంబీజేపీ కేంద్రాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. -
కృత్రిమ మోకాలి చిప్పల ధర తగ్గింపు
న్యూఢిల్లీ: మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో ఉపయోగించే కృత్రిమ మోకాలి చిప్పల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ప్రైవేటు వైద్యశాలలు వాస్తవ వెల కన్నా లక్ష రూపాయకుల పైగా అధిక ధరలు వసూలు చేస్తుండటంతో వీటి ధరలపై ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించింది. కేంద్రం తాజా ఉత్తర్వులతో కృత్రిమ మోకాలి చిప్పలు 70% తగ్గి... రకాన్ని బట్టి రూ.54 వేల నుంచి గరిష్టంగా రూ.1.14 లక్షల వరకు ఉండనున్నాయి. అక్రమంగా, అన్యాయంగా ప్రైవేటు వైద్యశాలలు రోగులను దోచుకుంటూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మోకాలి మార్పిడి చికిత్సలు అవసరమైనవారు దాదాపు 2 కోట్ల మంది ఉండగా, వారిలో ఏడాదికి దాదాపు ఒకటిన్నర లక్షల మంది శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. కొత్త ధరల ప్రకారం ప్రస్తుతం విస్తృతంగా వాడే కోబాల్ట్–క్రోమియం కృత్రిమ మెకాలి చిప్ప ధర రూ.54,720. ఇప్పటి వరకు ఆసుపత్రులు దీనికి రూ. 1.6 లక్షల వరకు వసూలు చేస్తుండేవి. 80% శస్త్రచికిత్సల్లో ఈ రకం మోకాలి చిప్పలనే వాడుతున్నారు. క్యాన్సర్, కణతిలతో బాధపడుతున్న రోగులకు వాడే ప్రత్యేక మోకాలి చిప్పల ధరను ప్రభుత్వం రూ.1,13,950గా నిర్ణయించింది. ఇంతకుముందు దీనికి ఆసుపత్రులు గరిష్టంగా దాదాపు 9 లక్షల వరకు వసూలు చేసేవి. కొత్త ధరల కన్నా అధికంగా డబ్బులు వసూలు చేస్తే ఆసుపత్రులు, దిగుమతిదారులు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంత్ కుమార్ హెచ్చరించారు. -
ప్రధాని జోక్యం చేసుకోవాలి
► భారతీయులపై దాడులను అరికట్టాలి ► లోక్‌సభలో విపక్షాల డిమాండ్ న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న జాతివివక్ష దాడులపై విపక్షాలు సోమవారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశాయి. భారత సంతతి ప్రజల భద్రత కోసం ప్రధానిజోక్యం చేసుకోవాలని, దాడులను అరికట్టేలా చూడాలన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ స్పందిస్తూ.. ఇది తీవ్రమైన విషయమని, ప్రవాస భారతీయుల భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల జీవితాల్లోకి చొరబాటు.. ప్రభుత్వం పన్ను అధికారులకు అపరిమిత అధికారాలు కట్టబెడుతోందని కాంగ్రెస్, ఎస్పీ తదితర విపక్షాలు సోమవారం రాజ్యసభలో మండిపడ్డాయి. ఆధార్ నంబర్ వాడకాన్ని పెంచుతూ ప్రజల జీవితాల్లోకి చొరబడుతోందని విమర్శించాయి. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ 2017 ఫైనాన్స్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ.. ఆదాయ పన్ను రిటర్న్‌లకు ఆధార్‌ను అనుసంధానించాలన్న ప్రతిపాదన ప్రజల జీవితాల్లోకి చొరబడ్డమేనని పేర్కొన్నారు. బీజేపీ విపక్షంలో ఉన్నప్పుడు ఆధార్ వాడకంపై ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ‘పన్నుచెల్లింపుదారుకు సరైన వివరణ ఇవ్వకుండా సోదాలు, ఆస్తులు జప్తు చేసే అధికారాలను బిల్లులో చేర్చారు. దీని ద్వారా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యం చేసుకునే అవకాశముంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 20వేల కోట్ల ‘ఎల్ఈడీ’ స్కాం.. కేంద్రం జరిపిన ఎల్ఈడీ బల్బుల కొనుగోళ్లలో రూ.20 వేల కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రభుత్వ రంగ విద్యుత్ కంపెనీల ఉమ్మడి సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సుప్రీం కోర్టు, కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా బల్బులను కొనుగోలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. -
ఇలాగేనా సభ నడిపేది!
పార్లమెంటు స్తంభనపై అడ్వాణీ మండిపాటు స్పీకర్, మంత్రి సభను నడపలేకపోతున్నారన్న అడ్వాణీ అధికార, విపక్షాలు రెండూ దొందూ దొందే న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వరుసగా మూడోవారం కూడా స్తంభించటంపై బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ పార్లమెంటేరియన్ ఎల్కే అడ్వాణీ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సభలో కొందరు విపక్ష సభ్యులు.. అధికార ఎంపీల సీట్లవైపు వచ్చి వెల్‌లో నినాదాలు చేస్తుండటంతో ఆగ్రహంగా.. మంత్రి అనంత్ కుమార్‌పై రుసరుసలాడారు. ‘స్పీకర్ కానీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గానీ సభను నడపలేకపోతున్నార’ని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘లోక్‌సభ కార్యకలాపాలను స్పీకర్ నడపటం లేదు. ఈ విషయాన్ని ఆమెకే చెబుతాను. ఇదే విషయాన్ని బహిరంగంగా వెల్లడిస్తాను. ప్రస్తుత పరిస్థితికి అధికార, ప్రతిపక్షాలదే బాధ్యత’ అని నిప్పులు చెరిగారు. విపక్షాల ఆందోళన మధ్య సభ వాయిదా పడగానే.. ‘ఎంతసేపు వాయిదా’ అని లోక్‌సభ అధికారిని అడిగారు. ఆయన పదిహేను నిమిషాలని చెప్పగానే.. సభను ‘నిరవధిక వాయిదా వేయలేకపోయారా?’ అంటూ మౌనంగా వెళ్లిపోయారు. అడ్వాణీకి నచ్చజెప్పేందుకు అనంతకుమార్ యత్నించినా.. పెద్దాయన శాంతించలేదు. అనంతరం మీడియా గ్యాలరీ వైపు చూస్తూ.. ఈ వార్తను కవర్ చేయండనే సంకేతాలిచ్చారు. అడ్వాణీ సూచనను పాటించండి: కాంగ్రెస్ పార్లమెంటు వ్యవహారాలను నిర్వహించటంలో అడ్వాణీ ఇచ్చిన సూచనను కేంద్రం పాటించాలని కాంగ్రెస్ సూచించింది. అడ్వాణీ సరైన కోణంలోనే అర్థం చేసుకున్నారని కాంగ్రెస్ నేత సుస్మిత దేవ్ అన్నారు. విపక్షాల మాటల్ని వినని బీజేపీ.. కనీసం తమ ‘మార్గదర్శకుడు’అడ్వాణీ సూచనలనైనా వినాలన్నారు. మరోరోజూ చర్చలేకుండానే..: నోట్లరద్దుపై ప్రతిష్టంభన కారణంగా పార్లమెంటు సమావేశాలు 14వ రోజూ చర్చ జరగకుండానే ముగిశాయి. ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించినా.. విపక్షాలు సభాకార్యక్రమాలను జరగనీయలేదు. ఉభయసభల్లోనూ ఇదే పరిస్థితి వాయిదాకు దారితీసింది. నోట్లరద్దుపై ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం కారణంగా 84 మంది మృతిచెందారని, దీనికి బాధ్యత ఎవరిదని రాజ్యసభలో విపక్షనేత ఆజాద్ ప్రశ్నించారు. దీనిపై అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధమని చెప్పినా.. విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయన్నారు. దీంతో సభ వాయిదా పడింది. కాగా, శనివారం నుంచి లోక్‌సభకు 4రోజులు సెలవులొచ్చాయి. శని, ఆదివారాలకు తోడు సోమవారం సెలవు ఇవ్వాలని పార్లమెంటు వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. మంగళవారం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సెలవు ఉంది. -
ఉడీ కన్నా నోట్ల మృతులే ఎక్కువ!
రాజ్యసభలో గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండోరోజు నోట్ల రద్దుపై ఉభయసభలు అట్టుడికారుు. విపక్షాల వాయిదా తీర్మానాలను స్వీకరించకుండా, రూల్ 193 కింద స్వల్పకాలిక చర్చగా చేపడతామన్న ప్రభుత్వ నిర్ణయంపై లోక్‌సభలో విపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యసభలో ఉడీ మృతులకన్నా నోట్ల రద్దు మృతులే ఎక్కువన్న ఆజాద్ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. రెండోరోజు సమావేశాల్లో ప్రభుత్వంపై దాడిని విపక్షాలు ముమ్మరం చేశాయి. దీంతో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత లోక్‌సభ తీవ్ర గందరగోళం మధ్య వాయిదా పడింది. రాజ్యసభ ఆరుగంటలపా టు జరిగినా.. నోట్ల రద్దు అంశంపై అధికార ప్రతిపక్షాల ఆందోళనలతోనే సమయం గడిచిపోరుుంది. గందరగోళంతో డిప్యూటీ చైర్మన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ప్రధాని ఎక్కడ..?: తృణమూల్ గురువారం సభ ప్రారంభం కాగానే.. స్వామి నారాయణ్ ఆధ్యాత్మిక సంస్థ అధినేత స్వామి శాస్త్రి నారాయణ్ స్వరూప్ దాస్ మృతికి రాజ్యసభ నివాళులర్పించింది. నోట్ల రద్దుపై టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ చర్చ ప్రారంభిస్తూ.. ప్రజలు పడుతున్న కష్టాలపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాని సభలో ఎందుకు లేరని ప్రశ్నించారు. ‘రాత్రి 8 గంటలకు అకస్మాత్తుగా నోట్ల రద్దు నిర్ణయాన్ని వెలువరించిన వ్యక్తి ఎక్కడ?’ అని అన్నారు. దీనికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా, ఎన్డీఏ మంత్రులు, బీజేపీ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి చొచ్చుకొచ్చి ‘ప్రధాన మంత్రి సమాధానం ఇవ్వాల’ని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుపై చర్చలో ఆర్థికమంత్రి ఉంటే సరిపోతుందంటూ కురియన్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే తమిళనాడుకు కావేరీ జలాల విడుదలపై అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళం నెలకొనటంతో సభ 11.30కి వారుుదాపడింది. ఆజాద్ ఉడీ వ్యాఖ్యలతో కలకలం ఈ గందరగోళం మధ్యే సభ రెండుసార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కాగానే.. కాంగ్రెస్ పక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రభుత్వంపై విమర్శల దాడి ప్రారంభించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూనే.. ఉడీ ఘటనలో అమరులైన జవాన్లకన్నా.. నోట్ల రద్దు ద్వారానే ఎక్కువ మంది చనిపోయారని విమర్శించారు. దీనిపై చర్చకు ప్రధాని హాజరుకావాలని డిమాండ్ చేశారు. ‘ఉడీ ఘటనలో 18 మంచి చనిపోతే.. మోదీ నవంబర్ 8న తన నిర్ణయం ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా 40 మంది ఆందోళనతో మృతిచెందారు. నోట్ల రద్దు వంటి తప్పుడు విధానాల వల్ల చనిపోరుున వారి మృతికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీలదే బాధ్యత’ అని విమర్శించారు. మోదీ నియంతృత్వ ధోరణి వల్ల లక్షల మందికి సరిగా తిండి దొరకటం లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆజాద్ వ్యాఖ్యలు ‘దేశ వ్యతిరేకం’అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి వెంకయ్యనాయుడు ఆగ్రహించారు. ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకుంటుందన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని పీజే కురియన్ను కోరారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొనటంతో సభను కురియన్ శుక్రవారానికి వారుుదా వేశారు. ఆజాద్ వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇవి ఘోరమైన, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు. అమరవీరులను అవమాన పరిచేవిగా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. నల్లధనానికి వ్యతిరేకమని చెప్పిన పార్టీలన్నీ.. నోట్ల రద్దుపై చర్చను ముందుకు సాగనివ్వటం లేదన్నారు. లోక్‌సభలో గందరగోళం.. గురువారం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్షాల వారుుదా తీర్మానాన్ని స్వీకరించాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పీకర్‌ను కోరారు. వాయిదా తీర్మానం ప్రకారం, అన్ని సభా కార్యక్రమాలను పక్కనపెట్టి చర్చించి ఓటింగ్ నిర్వహించాలి. అరుుతే రూల్ 193 ప్రకారం స్వల్పకాలిక చర్చకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. దీంతో విపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. అనంతరం విపక్షాల వారుుదా తీర్మానాలను తిరస్కరించారు. విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభను మధ్యాహ్నం 12.30కు వారుుదా వేశారు. సభ ప్రారంభమైనా విపక్షాల ఆందోళన కొనసాగింది. ‘నల్లధనం, అవినీతి, దొంగనోట్లపై పార్లమెంటు ఒకే సందేశాన్ని పంపాలి. మోదీ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మద్దతుగా ఉన్నారు’ అని అనంత్ కుమార్ తెలిపారు. అరుునా అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదరకపోవటంతో స్పీకర్ సభను శుక్రవారానికి వారుుదా వేశారు. కాగా, ఆజాద్ ‘ఉడీ’ వ్యాఖ్యలపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో గురువారం పొద్దుపోరుున తర్వా త వీటిని రికార్డులనుంచి తొలగించారు. -
అవసరమైతే సవరణలు తీసుకొస్తారు..
టీడీపీ ఎంపీ తోట వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ : ఫిరాయింపుల నిరోధక చట్టానికి అవసరమైతే సవరణలు తీసుకొస్తారని లోక్‌సభలో టీడీపీ పక్షనేత తోట నరసింహం వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్ అధ్యక్షతన ఢిల్లీలో ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు తేవాలని కోరుతూ ప్రవేశపెట్టనున్న ప్రైవేటు మెంబర్ బిల్లుకు మద్దతిస్తారా? అన్న మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా బదులిచ్చారు. విపక్ష ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల అభివృద్ధికోసం అధికారపార్టీలో చేరుతున్నారన్నారు. విభజన హామీల అమలుకు అఖిలపక్షంలో విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం హాస్యాస్పదమన్నారు. -
విజయవాడలో అగ్రి ప్లాస్టిక్ పార్క్
♦ కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ వెల్లడి ♦ దానికోసం 250 ఎకరాలు కావాలన్న మంత్రి ♦ సిద్ధమన్న సీఎం చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం 200 నుంచి 250 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే ఏపీలో రూ. 1,000 కోట్ల వ్యయం తో అగ్రి ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేస్తామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ హామీ ఇచ్చారు. దీన్ని విజయవాడ రీజియన్‌లోనే నెలకొల్పాలని నిర్ణయించామన్నారు. దీని ఏర్పాటు వల్ల లక్ష మందికి ఉపాధి లభిస్తుందన్నారు. దీనికి స్పందించిన సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం మల్లవల్లిలో 250 ఎకరాలు కేటాయిస్తున్నామని ప్రకటించారు. ఇందుకోసం కేంద్రం వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని అనంతకుమార్‌ను కోరారు. గన్నవరం మండలం సూరంపల్లి వద్ద కేంద్రం నిర్మించే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) భవన నిర్మాణ పనులకు శుక్రవారం సాయంత్రం కేంద్రమంత్రులు అనంతకుమార్, హన్స్‌రాజ్ గంగారాం, వెంకయ్యనాయుడులతో కలసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. కేంద్రం కొత్తగా విశాఖలో ఏర్పాటు చేయబోయే బల్క్‌డ్రగ్, మెడికల్ ఎక్విప్మెంట్ పార్కు కోసం 500 ఎకరాలు కేటాయిస్తున్నామన్నారు. అనంతపురంలో మరో సిపెట్‌ను, ఏపీలో బల్క్‌డ్రగ్, మెడికల్ ఎక్విప్మెంట్ పార్కును ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి అనంతకుమార్ చెప్పారు. ప్రధాని మోదీతో సంప్రదించి నైపర్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, మున్సిపాలిటీల్లో చెత్త నుంచి ఎరువుల తయారీ యూనిట్లకు మెట్రిక్ టన్నుకు రూ. 1,500 సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. -
ఫార్మా పరిశ్రమకు 500 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్!
న్యూఢిల్లీ : దేశీ ఫార్మా పరిశ్రమను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ఫండ్ ద్వారా కేంద్రం మౌలిక వసతుల ఏర్పాటు కోసం కంపెనీలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందించనుంది. ఔషధాల ఆమోదానికి సింగిల్ విండో పద్ధతి, ప్రజలకు ఎక్కువ ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడం తదితర ప్రతిపాదనలపై కేంద్రం కసరత్తు చేస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ (డీఓపీ) ఆధ్వర్యంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ గతవారం ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ఒక నివేదికను రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్‌కు అందించింది. ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి చిన్న, మధ్యతరహా ఫార్మా కంపెనీల వృద్ధికి డీఓపీ నిధులను అందించాలని టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో సూచించింది. -
పార్లమెంటు సమాచారం
ఎరువులకూ ప్రత్యక్ష నగదు బదిలీ!: రైతులకు ఎరువుల సబ్సిడీని ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రసాయనాలు, ఎరువుల మంత్రి అనంత్ కుమార్ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. ఆత్మహత్యాయత్నం నేరం కాదు: ఆత్మహత్యా యత్నాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 309 సెక్షన్‌ను తొగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి లోక్‌సభకు చెప్పారు. దీంతో ప్రస్తుతం ఏడాది జైలు శిక్ష పడుతున్న ఈ యత్నం ఇక నేరం కాబోదన్నారు. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు 685: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో గత 8 నెలల్లో పాకిస్తాన్ 685 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాజ్యసభకు తెలిపారు. ఈ కాల్పుల్లో 8 మంది భద్రతా సిబ్బంది 16 మంది పౌరులు చనిపోయారని వెల్లడించారు. స్వైన్‌ఫ్లూ మరణాలు 841: స్వైన్‌ఫ్లూతో ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 22 మధ్య దేశంలో 841 మంది చనిపోయారని, 14,673 మందికి ఆ వ్యాధి సోకిందని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటించారు. నల్లధన ం నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం: నల్లధన నియంత్రణకు ప్రభుత్వం సాధ్యమైన చర్యలన్నింటినీ తీసుకుంటోందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభకు తెలిపారు. సుప్రీంకోర్టు నియమిత ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), ఆస్తుల వె ల్లడి తదితరాలకు సంబంధించి ఐటీ చట్టంలోని 139 సెక్షన్లో సవరణ వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు. -
చీపురు పట్టిన కేంద్ర మంత్రులు
బెంగళూరు: ఎప్పుడూ ఫైళ్లు, అధికారిక కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపే కేంద్ర మంత్రులు చీపురుపట్టారు. నగరంలోని రోడ్డును స్వయంగా శుభ్రం చేసి ‘స్వచ్ఛభారత్’ పిలుపునిచ్చారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని గురువారమిక్కడ నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ పాల్గొన్నారు. ‘స్వచ్ఛతా’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని అవెన్యూ రోడ్‌ను కేంద్ర మంత్రులు శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ...స్వచ్ఛభారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. చాలా మంది ప్రముఖులు, స్వామీజీలు, క్రీడాకారులు, యువత ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏదో ఫొటోలకు ఫోజులిచ్చేందుకు జరుగుతున్నదని కాదని, ప్రజలే ఓ మార్పు కోసం స్వచ్ఛందంగా ముందుకొస్తున్న కార్యక్రమమని అన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు పీసీ మోహన్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నడపై నిర్లక్ష్యం సరికాదు
ప్రధానితో సమావేశానికి నేతృత్వం వహించేందుకు సిద్ధం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ బెంగళూరు : రాష్ట్రంలో కన్నడ భాషను పాలనా వ్యవహారాల భాషగా మార్చడంతో పాటు కన్నడ మాధ్యమంలో శిక్షణను తప్పనిసరి చేసే విధంగా విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర మంత్రులు, ఎంపీలు చర్చించేందుకు ముందుకు వస్తే ఈ సమావేశానికి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బెంగళూరు మహానగర రవాణా సంస్థ, కన్నడ సాహిత్య పరిషత్‌తో కలిసి శనివారమిక్కడి శిక్షకర సదనలో నిర్వహించిన ‘నృపతుంగ సాహిత్య అవార్డు’ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాతృభాషను నిర్లక్ష్యం చేయడం ఎంత మాత్రం సరికాదని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కన్నడ భాషను నేర్చుకోవడం ద్వారా కన్నడ భాష, సంస్కృతిల రక్షణలో తమ వంతు భాగస్వామ్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాను ఎక్కడికి వెళ్లినా, ఏ ఒప్పంద పత్రాలపై సంతకం చేసినా అది తప్పక కన్నడ భాషలోనే ఉంటుందని, ఇందుకు తానెంతగానో గర్వపడుతున్నానని తెలిపారు. ఇంగ్లీష్ వ్యామోహంలో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. కాగా ప్రస్తుతం కొంతమంది అఖండ కర్ణాటకను విభజించాలని చూస్తున్నారని, అయితే ఇది ఎవరి వల్ల సాధ్యం కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి, కన్నడ అభివృద్ధి మండలి అధ్యక్షుడు డాక్టర్ ఎల్.హనుమంతయ్య, బీఎంటీసీ మేనేజింగ్ డెరైక్టర్ ఏక్రూప్ కౌర్ తదితరులు పాల్గొన్నారు.