న్యూఢిల్లీ: మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో ఉపయోగించే కృత్రిమ మోకాలి చిప్పల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ప్రైవేటు వైద్యశాలలు వాస్తవ వెల కన్నా లక్ష రూపాయకుల పైగా అధిక ధరలు వసూలు చేస్తుండటంతో వీటి ధరలపై ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించింది. కేంద్రం తాజా ఉత్తర్వులతో కృత్రిమ మోకాలి చిప్పలు 70% తగ్గి... రకాన్ని బట్టి రూ.54 వేల నుంచి గరిష్టంగా రూ.1.14 లక్షల వరకు ఉండనున్నాయి.
అక్రమంగా, అన్యాయంగా ప్రైవేటు వైద్యశాలలు రోగులను దోచుకుంటూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మోకాలి మార్పిడి చికిత్సలు అవసరమైనవారు దాదాపు 2 కోట్ల మంది ఉండగా, వారిలో ఏడాదికి దాదాపు ఒకటిన్నర లక్షల మంది శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. కొత్త ధరల ప్రకారం ప్రస్తుతం విస్తృతంగా వాడే కోబాల్ట్–క్రోమియం కృత్రిమ మెకాలి చిప్ప ధర రూ.54,720. ఇప్పటి వరకు ఆసుపత్రులు దీనికి రూ. 1.6 లక్షల వరకు వసూలు చేస్తుండేవి. 80% శస్త్రచికిత్సల్లో ఈ రకం మోకాలి చిప్పలనే వాడుతున్నారు.
క్యాన్సర్, కణతిలతో బాధపడుతున్న రోగులకు వాడే ప్రత్యేక మోకాలి చిప్పల ధరను ప్రభుత్వం రూ.1,13,950గా నిర్ణయించింది. ఇంతకుముందు దీనికి ఆసుపత్రులు గరిష్టంగా దాదాపు 9 లక్షల వరకు వసూలు చేసేవి. కొత్త ధరల కన్నా అధికంగా డబ్బులు వసూలు చేస్తే ఆసుపత్రులు, దిగుమతిదారులు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంత్ కుమార్ హెచ్చరించారు.
కృత్రిమ మోకాలి చిప్పల ధర తగ్గింపు
Published Thu, Aug 17 2017 1:01 AM | Last Updated on Tue, Sep 12 2017 12:14 AM
Advertisement