ప్రధాని జోక్యం చేసుకోవాలి
► భారతీయులపై దాడులను అరికట్టాలి
► లోక్‌సభలో విపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న జాతివివక్ష దాడులపై విపక్షాలు సోమవారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశాయి. భారత సంతతి ప్రజల భద్రత కోసం ప్రధానిజోక్యం చేసుకోవాలని, దాడులను అరికట్టేలా చూడాలన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ స్పందిస్తూ.. ఇది తీవ్రమైన విషయమని, ప్రవాస భారతీయుల భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజల జీవితాల్లోకి చొరబాటు..
ప్రభుత్వం పన్ను అధికారులకు అపరిమిత అధికారాలు కట్టబెడుతోందని కాంగ్రెస్, ఎస్పీ తదితర విపక్షాలు సోమవారం రాజ్యసభలో మండిపడ్డాయి. ఆధార్ నంబర్ వాడకాన్ని పెంచుతూ ప్రజల జీవితాల్లోకి చొరబడుతోందని విమర్శించాయి. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ 2017 ఫైనాన్స్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ.. ఆదాయ పన్ను రిటర్న్‌లకు ఆధార్‌ను అనుసంధానించాలన్న ప్రతిపాదన ప్రజల జీవితాల్లోకి చొరబడ్డమేనని పేర్కొన్నారు. బీజేపీ విపక్షంలో ఉన్నప్పుడు ఆధార్ వాడకంపై ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ‘పన్నుచెల్లింపుదారుకు సరైన వివరణ ఇవ్వకుండా సోదాలు, ఆస్తులు జప్తు చేసే అధికారాలను బిల్లులో చేర్చారు. దీని ద్వారా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యం చేసుకునే అవకాశముంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
రూ. 20వేల కోట్ల ‘ఎల్‌ఈడీ’ స్కాం..
కేంద్రం జరిపిన ఎల్‌ఈడీ బల్బుల కొనుగోళ్లలో రూ.20 వేల కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రభుత్వ రంగ విద్యుత్ కంపెనీల ఉమ్మడి సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) సుప్రీం కోర్టు, కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా బల్బులను కొనుగోలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.