విజయవాడలో అగ్రి ప్లాస్టిక్ పార్క్
♦ కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ వెల్లడి
♦ దానికోసం 250 ఎకరాలు కావాలన్న మంత్రి
♦ సిద్ధమన్న సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం 200 నుంచి 250 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే ఏపీలో రూ. 1,000 కోట్ల వ్యయం తో అగ్రి ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేస్తామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ హామీ ఇచ్చారు. దీన్ని విజయవాడ రీజియన్‌లోనే నెలకొల్పాలని నిర్ణయించామన్నారు. దీని ఏర్పాటు వల్ల లక్ష మందికి ఉపాధి లభిస్తుందన్నారు. దీనికి స్పందించిన సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం మల్లవల్లిలో 250 ఎకరాలు కేటాయిస్తున్నామని ప్రకటించారు. ఇందుకోసం కేంద్రం వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని అనంతకుమార్‌ను కోరారు.
గన్నవరం మండలం సూరంపల్లి వద్ద కేంద్రం నిర్మించే సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) భవన నిర్మాణ పనులకు శుక్రవారం సాయంత్రం కేంద్రమంత్రులు అనంతకుమార్, హన్స్‌రాజ్ గంగారాం, వెంకయ్యనాయుడులతో కలసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. కేంద్రం కొత్తగా విశాఖలో ఏర్పాటు చేయబోయే బల్క్‌డ్రగ్, మెడికల్ ఎక్విప్‌మెంట్ పార్కు కోసం 500 ఎకరాలు కేటాయిస్తున్నామన్నారు. అనంతపురంలో మరో సిపెట్‌ను, ఏపీలో బల్క్‌డ్రగ్, మెడికల్ ఎక్విప్‌మెంట్ పార్కును ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి అనంతకుమార్ చెప్పారు. ప్రధాని మోదీతో సంప్రదించి నైపర్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, మున్సిపాలిటీల్లో చెత్త నుంచి ఎరువుల తయారీ యూనిట్లకు మెట్రిక్ టన్నుకు రూ. 1,500 సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు.