ప్రధానితో సమావేశానికి నేతృత్వం వహించేందుకు సిద్ధం
కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్
బెంగళూరు : రాష్ట్రంలో కన్నడ భాషను పాలనా వ్యవహారాల భాషగా మార్చడంతో పాటు కన్నడ మాధ్యమంలో శిక్షణను తప్పనిసరి చేసే విధంగా విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర మంత్రులు, ఎంపీలు చర్చించేందుకు ముందుకు వస్తే ఈ సమావేశానికి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
బెంగళూరు మహానగర రవాణా సంస్థ, కన్నడ సాహిత్య పరిషత్‌తో కలిసి శనివారమిక్కడి శిక్షకర సదనలో నిర్వహించిన ‘నృపతుంగ సాహిత్య అవార్డు’ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాతృభాషను నిర్లక్ష్యం చేయడం ఎంత మాత్రం సరికాదని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కన్నడ భాషను నేర్చుకోవడం ద్వారా కన్నడ భాష, సంస్కృతిల రక్షణలో తమ వంతు భాగస్వామ్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాను ఎక్కడికి వెళ్లినా, ఏ ఒప్పంద పత్రాలపై సంతకం చేసినా అది తప్పక కన్నడ భాషలోనే ఉంటుందని, ఇందుకు తానెంతగానో గర్వపడుతున్నానని తెలిపారు. ఇంగ్లీష్ వ్యామోహంలో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. కాగా ప్రస్తుతం కొంతమంది అఖండ కర్ణాటకను విభజించాలని చూస్తున్నారని, అయితే ఇది ఎవరి వల్ల సాధ్యం కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి, కన్నడ అభివృద్ధి మండలి అధ్యక్షుడు డాక్టర్ ఎల్.హనుమంతయ్య, బీఎంటీసీ మేనేజింగ్ డెరైక్టర్ ఏక్‌రూప్ కౌర్ తదితరులు పాల్గొన్నారు.
కన్నడపై నిర్లక్ష్యం సరికాదు
Published Sun, Dec 14 2014 1:31 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement