సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య హోరా హోరీగా సాగిన ప్రచారం చరమాంకానికి చేరుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రతిష్టను పణంగా పెట్టి ఎన్నికల్లో విస్తతంగా ప్రచారం చేయగా, భవిష్యత్ ప్రధానిగా చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాదాపు అదే స్థాయిలో ప్రచారం చేశారు. మోదీ తన హోదాకు తగ్గట్టుగా స్టేడియంలు, విశాలమైన మైదానాల్లో కిక్కిర్సిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎల్‌సీడీ స్క్రీన్లు, రకరకాల కెమేరాలు అదనపు హంగును చేకూర్చాయి. అంత జనం, అంతటి తరలింపు లేకపోయిన వేలాది మంది ప్రజలనుద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు.
నరేంద్ర మోదీ తన సహజ భావజాలంతో, తనదైనా హావభావాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించగా, రాహుల్ గాంధీ కాస్త కొత్తగా అలవర్చుకున్న హావభావాలతో అలరించేందుకు ప్రయత్నించారు. 2013లో, నవంబర్‌లో బెంగళూరులో జరిగిన ఓ ర్యాలీలో కన్నడలో మాట్లాడడం ప్రారంభించిన నరేంద్ర మోదీ, 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విరివిగా కన్నడలో మాట్లాడారు ప్రతి సమావేశంలో కన్నడ భాషలో ప్రసంగాన్ని ప్రారంభించి ఆ తర్వాత హిందీలో అనర్గళంగా మాట్లాడుతూ వచ్చారు. గత ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ తొలుత ఎక్కువగా హిందీలోనే మాట్లాడేందుకు ప్రయత్నించారు.
ఫిబ్రవరిలో జరిగిన ఓ సమావేశంలోనే మోదీ ప్రసంగిస్తుండగా, ప్రజలతోపాటు బీజేపీ కార్యకర్తలు కూడా అర్ధంతరంగా లేచిపోవడం కనిపించింది. కన్నడ ప్రజలకు హిందీ ఎక్కువగా రాదు. అప్పటి నుంచి మోదీ కన్నడతో మొదలుపెట్టి హిందీలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే కన్నడలో మాట్లాడేందుకు ప్రయత్నించి అభాసుపాలైన రాహుల్ గాంధీ, అప్పటి నుంచి కన్నడలో వీలైనంత తక్కువ మాట్లాడుతున్నారు. ఇంగ్లీషులోనే ఎక్కువ మాట్లాడుతూ వస్తున్నారు. తుముకూరులో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో ‘తుముకూరులోని నా సోదర సోదరీమణులారా, కర్ణాటకలోని నా సోదర సోదరీమణులారా, దేశంలోని సోదర సోదరీ మణులారా! మీకు ప్రణామంలు....’ అంటూ మోదీ ప్రసంగం కొనసాగుతుంది. సుదీర్ఘ పద బంధాలతో మాట్లాడే ఆయన మాటి మాటికి ఎడమ వైపు, కుడి వైపు తిరుగుతూ ప్రజలను సూటిగా ప్రశ్నిస్తూ ప్రసంగిస్తారు. అదే రాహుల్ గాంధీ ‘సోదర సోదరీమణులారా’ అంటూ మొదలు పెట్టి క్లుప్తమైన వ్యాక్యాలతో సూటిగా మాట్లాడుతారు.
‘ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ పేదలు...పేదలు....పేదలు అని మాట్లాడూ వచ్చింది. ఇప్పుడు ఓ పేద తల్లి కుమారుడు ప్రధాన మంత్రి అవడంతో నోరు మూసుకుంది. పేదలు, పేదలు అంటూ ప్రజల కల్లల్లో ఇక దుమ్ముకొట్టలేమని తెలుసుకుని మానుకుంది. ఆధార్ కార్డు ద్వారా ఏమీ సాధించారని అడుగుతారు కొందరు, 12 అంకెలు గల ఆధార్ కార్డు ద్వారా నేడు ప్రభుత్వ ఖజానాకు 80 వేల కోట్ల రూపాయలను మిగిలించాం’ లాంటి వ్యాక్యలు మోదీ మాట తీరుకు ఉదాహరణ. ‘అమిత్ షా మొదటి సారి నిజం మాట్లాడారు, అత్యంత అవినీతి పరుడైన సిఎం యెడ్యూరప్పని. మరి అంతటి అవినీతిపరుడిని మళ్లీ సీఎం అభ్యర్థిగా ఎలా నిలబెట్టారు?’ అన్న వ్యాఖ్య రాహుల్ స్టైల్‌ను సూచిస్తోంది. ‘మోదీ గారు! ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు యువతకిస్తున్నారు, ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేశారు. వేశారా, లేదా?’ అంటూ రాహుల్ ఈ మధ్య కొత్త వ్యంగ్యాన్ని అందుకున్నారు. కాబోయే ప్రధాన మంత్రిని తానని రాహుల్ చెప్పుకోవడం ప్రారంభించినప్పటి నుంచి కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.
కర్ణాటకలో 12 వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక గురువు బసవేశ్వరుడిని ఉద్దేశించి రాహుల్ గాంధీ తొలత ‘బసవ్‌జీ’ అంటూ సంబోధించి అభాసు పాలయ్యారు. ఆ తర్వాత ‘బసవన్న’ అంటూ సరిదిద్దుకొని ఆయన్ని మాత్రమే ఎక్కువగా ప్రస్థావిస్తూ వచ్చారు. మోదీ తరచు కన్నడలో మాట్లాడుతూ ‘కర్ణాటక కల్పతరువు. మహా పురుషులు పుట్టిన గడ్డ. బసవన్న, సిద్ధగంగా మఠం ఆచార్యులు, అణు భౌతిక శాస్త్రవేత్త రాజా రామన్న, మహా శిల్పి జక్కనాచార్య అంతా ఇక్కడి వారే’ అంటూ మోదీ స్థానికుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆయన కూడా కన్నడ పదాలను తప్పుగా పలకడాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధ రామయ్య పట్టుకొని ఎప్పటికప్పుడు దుమ్ము దులుపుతూ వచ్చారు. జాతీయ నాయకులు ఎవరు, ఎన్ని విధాలుగా ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించినా పెద్దగా లాభమేమీ ఉండదు. కర్ణాటకలో ఓ నియోజకవర్గంలోని స్థానిక అంశాలే విజేతను నిర్ణయిస్తాయి. ఆ విషయంలో సిద్ధ రామయ్యవైపే ఇప్పటికీ ప్రజల మొగ్గు కనిపిస్తోంది. ‘నరేంద్ర మోదీకి అసలైన ప్రత్యర్థి రాహుల్ గాంధీ కాదు. సిద్ధ రామయ్యనే’ అని తటస్థులు కూడా వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే 1980 దశకం నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీయే మళ్లీ విజయం సాధించిన దాఖలాలు లేవు. ఏదేమైనా ఈ నెల 15వరకు నిరీక్షించాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment