మోదీ జోక్యం చేసుకోవాలి
మహదాయి జలవివాదంపై సీఎం సిద్ధరామయ్య
డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించేది లేదని స్పష్టీకరణ
మైసూరు: కర్ణాటక, గోవా రాష్ట్రాల మధ్య నెలకొన్న మహదాయి జలవివాదాన్ని పరిష్కరించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. మైసూరు పాలికె సంస్థ ఆధ్వర్యంలో మైసూరులో రూ.5కోట్ల వ్యయంతో నిర్మించిన జయచామరాజ ఒడయార్ విగ్రహాన్ని, కొత్తగా అభివృద్ధి చేసిన హార్డింజ్ సర్కిల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఇదే సందర్భంలో జయచామరాజ ఒడయార్ మైసూరు నగరాభివృద్ధికి చేసిన కృషి గురంచి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. తర్వాత బెంగళూరుకు వెళ్తూ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. మహదాయి నీటి విషయంలో కర్ణాటక రాష్ట్రం నిబంధనలను అతిక్రమిస్తుందని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. జూలై 30వరకు విధానసభ సెషన్స్‌ను జరపడానికి ప్రభుత్వం తీర్మానించిందని, కానీ ప్రతిపక్షాలు డీవైఎస్పీ ఎం.కే.గణపతి ఆత్మహత్య కేసు విషయంలో రాజకీయం చేస్తూ సభను సజావుగా జరుగనివ్వడం లేదన్నారు. డీవైఎస్పీ ఎం.కే.గణపతి ఆత్మహత్య కేసు విచారణను సీఐడీకి అప్పగించామని, అయితే విపక్షాలు, డీవైఎస్పీ కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ చేయిస్తున్నట్లు చెప్పారు. న్యాయమూర్తుల కమిటీ విచారణ చేసి నివేదికలందించడానికి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపారు.
విపక్షాలు డీవైఎస్పీ ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పట్టుబడుతండడంలో అర్థం లేదన్నారు. ఎనిమిది కేసుల విచారణను సీబీఐకి అప్పగించగా ఇప్పటివరకు నివేదికలందించలేదన్నారు. అందువల్లే డీవైఎస్పీ గణపతి ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించేది లేదని స్పష్టం చేసారు. మంత్రి జార్జ్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ హైకమాండ్‌కు నగదు సరఫరా చేసే సూట్‌కేస్ అని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవన్నారు. హెచ్.డీ.కుమారస్వామి గతంలో ఇలాంటి ఆరోపణలు చేసి రుజువు చేయలేకపోయారని గుర్తు చేశారు. ప్రభుత్వం విపక్షాలను చులకనగా చూస్తుందనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. విపక్షాలు చేస్తున్న పోరాటాలు, కార్యక్రమాలు చులకనగా ఉన్నాయని విమర్శించారు. విధానపరిషత్ విపక్షనాయకుడు కే.ఎస్.ఈశ్వరప్పను సభ నుంచి బయటకు పంపాలని చెప్పే హక్కు తనకు లేదని, కానీ తమది ఖూనీకోరు ప్రభుత్వమని పదేపదే ఆరోపిస్తుండంతో ఆయన్ను సభ నుండి బయటకు పంపించమని కోరారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివరించారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో ప్రజాపనుల శాఖమంత్రి హెచ్.సీ.మహదేవప్ప, సహకారశాఖ మంత్రి హెచ్.ఎస్.మహదేవప్రసాద్, విధానపరిషత్ సభ్యుడు ఆర్.ధర్మసేన, మైసూరు పాలికె కమిషనర్ బీ.ఎల్.భైరప్ప,యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ దంపతులు, రాజమాత ప్రమోదాదేవి ఒడయార్,ఎంఎల్‌ఏ సోమశేఖర్,వాసు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా పారంపర్య కట్టడాలు,సర్కిల్‌లను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నిధుల నుంచి విడుదలైన రూ.100కోట్ల నిధుల నుంచి రూ.5కోట్లను వెచ్చించి చామరాజ ఒడయార్, హార్డింజ్ సర్కిల్‌ను అభివృద్ధి చేసామని పాలికె అధికారులు తెలిపారు.