భారత నౌకా దళానికి చెందిన సాహిల్ వర్మ ఈ ఫిబ్రవరి 27 నుంచి ఆదృశ్యం అయ్యారు. ఆయన ఆచూకీ కోసం భారత నేవీ ఎయిర్ క్రాఫ్ట్, నౌకలతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తమ కొడుకు ఆచూకీ ఇంకా తెలియకపోవటంపై సాహిల్ వర్మ తల్లిదండ్రులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో ప్రధానమంత్రి, సీబీఐ, రక్షణ శాఖమంత్రి, హోం శాఖ మంత్రి, జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్‌గవర్నర్ మనోజ్ సన్హా జోక్యం చేసుకొని తన కుమారుడిని క్షేమంగా వెతికి తీసుకురావాలని కోరుతున్నారు. సాహిల్ తల్లిదండ్రులు జమ్ములోని గౌ మన్హాసన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ‘మా కుమారుడు ఎక్కడ ఉన్నాడు’ అంటూ సాహిల్ వర్మ తల్లిదండ్రులు సుభాష్ చందర్, రామా కుమారి కన్నీరుమున్నీరవుతున్నారు.
‘మేము ఫిబ్రవరి 29న మా కుమారుడు రెండు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడనే సమాచారాన్ని ఫోన్ కాల్ ద్వారా తెలుకున్నాం. మేము సాహిల్ వర్మతో ఫిబ్రవరి 25న చివరిసారి మాట్లాడాము’ అని సాహిల్ తండ్రి సుభాష్ చందర్ తెలిపారు. తమ కుమారుడి ఆచూకీని తొందరగా తెలుసుకోని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉండగా అదృశ్యమైన తమ కుమారుడి కేసును సీబీఐకీ అప్పగించాలన్నారు. 400 మంది నౌకలో ఉండగా తమ కుమారుడు మాత్రమే అదృశ్యమయ్యాడని అనుమానం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 27 నుంచి సాహిల్ వర్మ (సీమ్యాన్-2) కనిపించకుండా పోవడం దురదృష్టకరమని భారత నేవీకి చెందిన వెస్ట్రన్ కమాండ్ వెల్లడించింది. సాహిల్ భారత నేవీ షిప్‌లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపింది. సాహిల్ వర్మ ఆచూకీ తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి బోర్డును ఏర్పాటు చేసినట్లు వెస్ట్రన్ కమాండ్ పేర్కొంది. ఈ ఘటనపై విచారణకు బోర్డును ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment