సాక్షి, హైదరాబాద్: దేశంలో విపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలన సాగుతోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ‘అయితే జుమ్లా... లేదంటే హమ్లా’అనే రీతిలో మోదీ ప్రభుత్వం ఉందని, అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. అవి ‘ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు’అని పేర్కొన్నారు.
మోదీ సర్కార్ చేతిలో ‘ఈడీ కీలుబొమ్మ, సీబీఐ తోలు»ొమ్మ’గా మారాయని విమర్శించారు. రాజకీయ వేధింపులను రాజకీయంగానే ఎదుర్కొంటామని, కవిత ఈడీ ముందు హాజరై పూర్తిస్థాయిలో సహకరిస్తారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే....
ఒక్క బీజేపీ నేతపై అయినా దాడులు జరిగాయా?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పార్టీలపైకి ఉసిగొల్పుతోంది. కవితే మొదటి వ్యక్తి కాదు. చివరి వ్యక్తీ కాదు. ఇంకా చాలామంది ఉంటారు. మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పీఏ, జగదీశ్‌రెడ్డి పీఏల మీద ఐటీ, ఈడీ అధికారులతో దాడులు చేయించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మీద ఐటీ దాడులు జరిగాయి.
పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర,, పార్థసారథి రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి మొదలైన 12 మంది మీద ఈడీ, సీబీఐ, ఐటీలతో కేంద్ర ప్రభుత్వం దాడులు చేయించింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు పంపింది. మోదీ పాలనలో ఈడీ దాడులు 95 శాతం విపక్షాల మీదనే జరుగుతున్నాయి. ఒక్క బీజేపీ నేత మీద అయినా ఈ తరహా దర్యాప్తు సంస్థల దాడులు జరిగిన చరిత్ర లేదు. ఈ తొమ్మిదేళ్లలో ప్రతిపక్షాల మీద ఈడీ నమోదు చేసిన కేసుల సంఖ్య 5,422. అందులో కేవలం 23 కేసుల్లో మాత్రమే తీర్పు వచ్చింది.
అదానీ కంపెనీ మోదీ సొంత కంపెనీ...
ప్రతిపక్షాలపై కేసుల దాడి.. ప్రజలపై ధరల దాడి.. ఇవి తప్ప ఈ తొమ్మిదేళ్లలో మోదీ సర్కార్ సాధించిందేమీ లేదు. గౌతమ్ అదానీ అనే వ్యక్తి మోదీ బినామీ అని చిన్న పిల్లగాడిని అడిగినా చెబుతాడు. ఒక సంస్థకు రెండు ఎయిర్‌పోర్టులకంటే ఎక్కువ కాంట్రాక్టులు కట్టబెట్టొద్దని ఇప్పటిదాకా ఉన్న నిబంధనలను తుంగలో తొక్కి.. గౌతమ్ అదానికి ఆరు ఎయిర్‌పోర్టులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం? సాక్షాత్తూ నీతి ఆయోగ్ దీన్ని తప్పుబట్టింది.
దేశాన్ని కుదుపు కుదిపేసిన హిండెన్‌బర్గ్ నివేదిక మీద మోదీకి మాట రాదు. రూ.13 లక్షల కోట్ల ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి ప్రజా సంస్థల డబ్బులు ఆవిరైనా.. ఈ దేశ ప్రధానమంత్రి ఉలకడు పలకడు. గౌతం అదానీకి చెందిన ముంద్రా పోర్టులో దాదాపు రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల హెరాయిన్ పట్టుబడితే ఒక్క కేసు నమోదు కాదు.
ఇటీవల జరిగిన జీ20 సదస్సులో పాల్గొనడానికి వచ్చి న శ్రీలంక ఆర్థిక మంత్రి.. అదానీకి, శ్రీలంకకు మధ్య జరిగిన ఆరువేల కోట్ల ఒప్పందాన్ని జీ టు జీ ఒప్పందంగా పేర్కొన్నాడు. జీ టూ జీ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాదు గౌతమ్ అదాని టు గొటబయ అని అర్థం. అదాని కంపెనీ మోదీ సొంత కంపెనీ కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా అదానీ కోసం ప్రధాని హోదాలో మార్కెటింగ్ చేస్తున్నారు.
బీజేపీ వ్యవహారం ‘వాషింగ్ పౌడర్ నిర్మాయే..’
సీఎం కేసీఆర్ చెప్పినట్లు వాషింగ్ పౌడర్ నిర్మా.. అన్నట్లుగా ఉంది బీజేపీ వ్యవహారం. అంటే బీజేపీలో చేరగానే వారి పాపాలు, వారి మీద ఉన్న కేసులు వెంటనే పోతాయి. సుజనాచౌదరికి చెందిన షెల్ కంపెనీల ద్వారా లగ్జరీ కార్లు కొనుగోలు చేశారని, వేల కోట్ల బ్యాంకు ఫ్రాడ్ జరిగిందని ఈడీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. కానీ సుజనాచౌదరి బీజేపీలో చేరడంతో ఆ కేసులు నీరుగారాయి.
ఏపీలో బ్యాంకులకు వందల కోట్లు కుచ్చుటోపీ పెట్టిన సుజనాచౌదరి, సీఎం రమేష్‌లు మీ పార్టీలో చేరగానే పునీతులు అయ్యారా ? ఇటీవల కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్ష కొడుకు రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయినా ఎలాంటి దాడులు ఉండవు. మహారాష్ట్రకు చెందిన ఎంపీ పాటిల్ అనే వ్యక్తి.. ‘బీజేపీలో చేరినందున నా మీదకు ఈడీ రాదు’అని చెప్పారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఈడీ నుంచి ఉపశమనం పొందానని హర్షవర్ధన్ అనే ఎంపీ చెప్పాడు.
పశ్చిమబెంగాల్‌లో వేల కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న తృణమూల్ నేత సువేందు అధికారిని విచారణల పేరుతో భయపెట్టి బీజేపీలో చేర్చుకున్న తర్వాత ఆ కేసు ముందుకు సాగకపోవడం నిజం కాదా? శారదా కుంభకోణం ప్రధాన నిందితుడు హిమంత బిస్వాశర్మ బీజేపీలో చేరిన తరువాత ఈడీ, సీబీఐ అతనిపై దర్యాప్తును ఎందుకు నిలిపివేశాయి? బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల మీద దాడులు చేయడం ద్వారా తమకు అనుకూలంగా లేకపోతే మీడియా సంస్థలపై సైతం ఎలాంటి చర్యలకైనా సిద్ధం అని ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు.
డబుల్ ఇంజిన్ అంటే..ఒకటి మోదీ, మరొకటి అదాని
డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అంటున్న బీజేపీ ప్రభుత్వం అసలు రూపం దేశ ప్రజలకు ఇప్పుడు అర్థం అయింది. ఒక ఇంజిన్ మోదీ అయితే మరో ఇంజిన్ అదానీ. ఆ డబుల్ ఇంజన్ పేరు ‘మాదాని.. అంటే మోదీ, అదానీ అన్నమాట. మోదీ– అదానీ చీకటి స్నేహం వెనుక దాగి ఉన్న ఆంతర్యం ప్రజలందరికీ తెలుసు.
తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చింది నిజం కాదా?
మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో దొడ్డిదారిన తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చింది నిజం కాదా? ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కాంట్రాక్టులు, పదవుల పేరుతో లొంగదీసుకున్నది అబద్ధమని చెప్పగలరా? మన తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టి కాంగ్రెస్ అభ్యర్థిని బీజేపీలోకి లాక్కున్నది వాస్తవం కాదా? మద్యమే లేని గుజరాత్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 42 మంది చనిపోతే ఏ విచారణ చేశారు? అది స్కాం కాదా? ఢిల్లీ లిక్కర్ పాలసీని తప్పుబడుతున్న వారు.. గుజరాత్‌లో జరిగిన ఘటనపై ఏ చర్యలు తీసుకున్నారు?
ఈడీ, బోడీలకు భయపడేదే లేదు..
టార్గెట్ కేసీఆర్‌లో భాగంగానే.. ఉద్యమనేత బిడ్డగా పుట్టుకనుండే చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్న ఉద్యమకారిణి ఎమ్మెల్సీ కవితను ఈడీ పేరుతో వేధిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీకి కంట్లో నలుసులా తయారైన ఆప్ సర్కార్ మీద కుట్రలో భాగంగానే మనీశ్ సిసోడియాను కూడా అరెస్టు చేశారన్నది దేశ ప్రజలకు తెలుసు. బ్యాంకుల్ని ముంచినవారిని, కమీషన్లు దండుకుంటున్న వారిని పట్టించుకోకుండా కవిత మీద , ఇతర నేతల మీద ఈడీలను, బోడీలను ప్రయోగిస్తే భయపడే ప్రసక్తే లేదు.
Comments
Please login to add a commentAdd a comment