13 మందికి ఉరిశిక్ష
రెండు వేర్వేరు కేసుల్లో న్యాయస్థానాల తీర్పు
క్రిష్‌నగర్/నాగ్‌పూర్: దేశవ్యాప్తంగా రెండు వేర్వేరు కేసుల్లో మొత్తం 13 మందికి మరణశిక్ష పడింది. బెంగాల్‌లో భూమి కోసం ఓ మహిళను చంపిన కేసులో టీఎంసీ నేత సహా 11 మందికి.. నాగ్‌పూర్‌లో ఓ బాలుడిని కిడ్నాప్ చేసి చంపినందుకు ఇద్దరు యువకులకు ఉరిశిక్ష పడింది. పశ్చిమబెంగాల్‌లోని కృష్ణగంజ్‌లో శరణార్థుల కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఇక్కడ ఉంటున్న వారిని పంపించేసి స్థలాన్ని కబ్జాచేయాలని భావించిన టీఎంసీ నేత, మరో 11 మంది నవంబర్ 23, 2014న ట్రాక్టర్‌తో ఇళ్లను కూల్చేసేందుకు ప్రయత్నించారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణలో కబ్జాకు యత్నించిన వారు కాల్పులు ప్రారంభించటంతో అపర్ణ బాగ్ అనే మహిళ ఘటనాస్థలంలోనే చనిపోయింది. ఈ కేసులో అపర్ణ ఇద్దరు కూతుళ్ల సాక్ష్యం ఆధారంగా 11 మందికి నదియా జిల్లా కోర్టు జడ్జి ఉరిశిక్ష విధించారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. మరోవైపు, ఓ ఎనిమిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా చంపిన కేసులో ఇద్దరు యువకులకు నాగ్‌పూర్ సెషన్స్ న్యాయమూర్తి మరణశిక్ష విధించారు. 2014 సెప్టెంబర్‌లో యుగ్ చందక్ (8) అనే బాలుడిని రాజేశ్ దవారే (21), అతని మిత్రుడు అభిలాష్ సింగ్ (25) డబ్బుల కోసం కిడ్నాప్ చేశారు.
ఆ తర్వాత బాలుడిని ముఖంపై రాయితో కొట్టి క్రూరంగా చంపేశారు. ఈ కేసును విచారించిన నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి.. నిందితులకు ఉరిశిక్ష విధించారు. దీంతోపాటు జీవితఖైదు, చెరో పదివేల రూపాయల జరిమానాతో పాటు ఆధారాలు ధ్వంసం చేసినందుకు ఏడేళ్ల జైలు విధించారు. వీరికి సహకరించిన రాజేశ్ సోదరుడిని జువెనైల్ హోమ్‌కు పంపించారు.