మాట్లాడుతున్న మల్లికాబేగం
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ రాజకీయాల నుంచి విరమించుకోవాలని మాజీ మేయర్ మల్లికాబేగం డిమాండ్ చేశారు. పంజా సెంటర్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2009లో ముస్లిం మహిళలు రాజకీయాలలోకి రాకూడదని జలీల్‌ఖాన్ కొంతమంది మతపెద్దలను ప్రోత్సహించి తనపై ఫత్వా జారీ చేయించారన్నారు. దాని వల్ల తాను ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని పేర్కొన్నారు. జలీల్‌ఖాన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ 2009లో మల్లికాబేగం ఆ ఫత్వాను గౌరవించలేదని వ్యాఖ్యానించారని, అందువలన తన కుమార్తె కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారని గుర్తు చేశారు.
2009లో తాను నామినేషన్ వేసిన తరువాత ఫత్వా జారీ చేశారన్నారు. అందువలన తాను ఎన్నికల్లో అనివార్యంగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. కనుక ఇప్పటివరకూ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు కనుక జలీల్‌ఖాన్ మత పెద్దల ఫత్వాను గౌరవించి తన కుమార్తెను రాజకీయాల నుంచి పశ్చిమ నియోజకవర్గం పోటీ నుంచి తప్పించాలని కోరారు. ఆనాడు ఫత్వా జారీ చేసిన మత పెద్దలు మహిళలందరికీ ఒకే విధమైన న్యాయాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2009లో ఒక విధంగా 2019లో మరో విధంగా జలీల్‌ఖాన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దీనిపై అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులను కలిస్తానని, ముస్లిం పర్సనల్ లా బోర్డును, ఇతర సంఘాలను కలిస ఫత్వా గురించి వివరించి అమలు చేయాలని కోరుతానని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment