కాన్వాయ్‌ అడ్డగింత.. కంగుతిన్న చంద్రబాబు | Jaleel Khan Followers Blocked Chandrababu's Convoy In Vijayawada | Sakshi
Sakshi News home page

కాన్వాయ్‌ అడ్డగింత.. కంగుతిన్న చంద్రబాబు

Published Sat, Mar 23 2024 3:15 PM | Last Updated on Sat, Mar 23 2024 3:40 PM

Jaleel Khan Followers Blocked Chandrababu Convoy In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. వెస్ట్‌ టికెట్‌ జలీల్‌ఖాన్‌కు కేటాయించాలని మైనార్టీలు నిరసనకు దిగారు. ఏ కన్వెన్షన్ హాలులో టీడీపీ వర్క్ షాపుకు చంద్రబాబు హాజరవ్వగా, ఆయన కాన్వాయ్‌ను జలీల్‌ఖాన్‌ వర్గం అడ్డుకుంది. పొత్తులో వెస్ట్‌ సీటు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. జలీల్‌ఖాన్‌ మద్దతుదారుల నిరసనతో చంద్రబాబు కంగుతిన్నారు. కాగా, తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ జలీల్ ఖాన్ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.

కాగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ టికెట్ల చిచ్చు రగులుతూనే ఉంది. టీడీపీ శుక్రవారం.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించింది. టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమాకు షాక్‌ తగిలింది. విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థిగా కేశినేని శివనాథ్‌(చిన్ని)ని ప్రకటించడంతో పార్టీలో సీనియర్లు రగిలిపోతున్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా డబ్బు సంచులతో వచ్చిన వారికే టికెట్లు ఖరారు చేశారని అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. 

దేవినేని ఉమాకు షాక్‌.. 
టీడీపీ మూడో జాబితా అభ్యర్థుల ప్రకటనతో ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని మైలవరం, పెనమలూరు టికెట్లపై సందిగ్ధత తొలగింది. మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంతకృష్ణ ప్రసాద్, పెనమలూరు అభ్యర్థిగా బోడె ప్రసాద్‌ను ఖరారు చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 12 నియోజక వర్గాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో దేవినేని ఉమా ఆశలు ఆవిరయ్యాయి. మైలవరం నియోజక టీడీపీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న ఆయన్ను కాదని, ఇటీవల పార్టీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌కు టికెట్‌ కేటాయించడంతో దేవినేని ఉమా వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది.

కృష్ణప్రసాద్, దేవినేని ఉమా మధ్య దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ వైరం ఉంది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమాకు చంద్రబాబు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ కలిసి పని చేసే అవకాశం లేదని టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. మైలవరంలో టికెట్‌ ఇవ్వలేక పోతున్నాం.. పెనమలూరు టికెట్‌ ఇస్తామని దేవినేని ఉమాను మభ్యపెట్టారు.

సర్వేల సాకు చూపి చివరకు అక్కడ మొండి చేయి చూపారు. దీంతో ఆయన రగిలిపోతున్నారు. తనకు జరిగిన అవమానం బయటికి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. పార్టీలో సీనియర్ల అడ్డు తొలగించుకోవటం, లోకేష్‌ నాయకత్వానికి ఇబ్బంది లేకుండా చేయడంలో భాగంగానే ఉమాకు చెక్‌ పెట్టినట్లు చర్చ సాగుతోంది. ఆయనకు కనీసం ఎమ్మెల్సీ హామీ కూడా ఇవ్వకపోడంతో, ఆయన రాజకీయ శకం ముగిసిందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వసంతకు గట్టి బుద్ధి చెబుతామని దేవినేని వర్గీయులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఉమా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  

పెనమలూరులో అసంతృప్తి.. 
పెనమలూరు టికెట్‌పై చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. సర్వేల పేరుతో పలుపేర్లు తెరపైకి వచ్చాయి. పెనమలూరు టికెట్‌ లేదని బోడె ప్రసాద్‌కు తొలుత చంద్రబాబు చెప్పారు. అయితే తాను  ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని బాబును బోడె బ్లాక్‌ మెయిల్‌ చేశారని తెలుస్తోంది. బోడె కొంతమంది ఎన్‌ఆర్‌ఐల ద్వారా కథ నడిపారు. చినబాబుకు ముడుపులు ముట్టడంతోపాటు, నియోజకవర్గంలో అయ్యే ఖర్చును తామే భరిస్తామని చెప్పడంతో చివరకు ఆయనకే టికెట్‌ కేటాయించారనే చర్చ సాగుతోంది. చలసాని        పండు కుమార్తె దేవినేని స్మిత గ్రామాల్లో బోడెకు పోటాపోటీగా ఇప్పటి వరకు ప్రచారం చేశారు.

ఆ వర్గం బోడెకు సహకరించే అవకాశం లేదు. ఉయ్యూరులో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ వర్గం కలిసి పని చేసే పరిస్థితి లేదు. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి  వర్గం నుంచి బోడె ప్రసాద్‌ ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ గ్రూపుల గోల బోడెను పుట్టి ముంచుతుందని పార్టీ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇండిపెండెంట్‌గా  మహేష్‌!
పొత్తుల్లో భాగంగా విజయవాడ వెస్ట్‌ సీట్‌ జనసేన నియోజక వర్గ ఇన్‌చార్జి టికెట్‌ తనకే ఖరారైందని పోతిన మహేష్‌ ఇంటింటికీ ప్రచారం చేశారు. అయితే పొత్తులో భాగంగా వెస్ట్‌ సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్లు  పవన్‌ తేల్చి చెప్పారు. పవన్‌ తీరుపై పోతిన మహేష్‌, జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని హెచ్చరికలు పంపారు. విజయవాడ పశి్చమంలో బీజేపీకి సంబంధించి రోజుకొక పేరు తెరపైకి వస్తోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించినా.. అక్కడ పార్టీ కోసం కష్ట పడిన నేతలను కాదని ఎన్‌ఆర్‌ఐల వైపు చూడటాన్ని జనసేన కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement