చంద్రబాబు మోసగాడని తెలుసు, కానీ..: కేశినేని నాని | Kesineni Nani Comments On Chandrababu Naidu TDP After Meeting With CM YS Jagan - Sakshi
Sakshi News home page

Kesineni Nani: చంద్రబాబు పచ్చి మోసగాడని తెలుసు, కానీ..

Published Wed, Jan 10 2024 4:58 PM | Last Updated on Sun, Feb 4 2024 9:17 AM

Kesineni nani Comments Chandrababu TDP After Meeting With CM Jagan - Sakshi

సాక్షి, గుంటూరు: విజయవాడ అంటే తనకు ఎంతో ప్రేమ అని.. చంద్రబాబు మోసగాడు అని తెలిసి కూడా నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నానని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎన్నో అవమానాల్ని ఓర్చుకున్న తర్వాత ఇప్పుడు బయటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన. ఇప్పుడు పేద ప్రజలకు అండగా ఉన్న సీఎం  జగన్‌ వెంట ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన. 

ఈ మేరకు విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడితో ప్రెస్‌మీట్‌ పెట్టించి తనను తిట్టించారని కేశినేని నాని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చెప్పుతీసుకొని కొడతానని ఓ క్యారెక్టర్‌లెస్‌ వ్యక్తి తిట్టినా పార్టీ స్పందిచలేదని వాపోయారు. తనను గొట్టంగాడు అన్న భరించానని పేర్కొన్నారు.

టీడీపీ గెలిచేది లేదని గతంలో చాలామంది నాకు చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీని నా భుజస్కందాలపై నడిపించా. పార్టీ కోసం నా సొంత వ్యాపారాలను పక్కనపెట్టా. సొంత వ్యాపారాల కంటే పార్టీయే ముఖ్యమని పని చేశా. టీడీపీ కోసం ఆస్తులు అమ్ముకున్నానని, వ్యాపారాలు వదులుకున్నా. బాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజంపై మోశానని, పార్టీ కోసం, ప్రజల కోసం నిజాయితీగా కష్టపడ్డా అని నాని తెలిపారు. 

విజయవాడ మేయర్‌గా అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబాబే నిర్ణయించారని.. ఆయన మూడు రోజులు అడిగితేనే శ్వేత ముందుకొచ్చిందని తెలిపారు. ఆ తర్వాతే ప్రెస్‌మీట్‌  పెట్టించి తనను బాబు తిట్టించారని గుర్తు చేశారు. సొంత పార్టీ నేతలే తనను అవమానించినా పార్టీ చర్యలు తీసుకోలేదు. నన్ను ఎవరు ఎన్ని మాటలన్నా పార్టీ నుంచి కనీస మద్దతురాలేదు. నన్ను చాలా రకాలుగా అవమానించారు. టీడీపీలో ఉంటూ ఇంకా ఎన్ని భరించాలి. ఇష్టం లేకపోతే వెళ్లిపోతానని అప్పుడే చంద్రబాబుతో చెప్పాను. వద్దు నువ్వు ఉండాల్సిందే అని  బాబు నాతో చెప్పారు.  

టీడీపీ కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని చాలామందే చెప్పారు. చాలా మంది చెప్పినా కూడా నేను టీడీపీలోనే కొనసాగాను. నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు. నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. నా కుటుంబ సభ్యులతో కొట్టించాలని లోకేష్‌ ఎందుకు చూశాడు. చంద్రబాబు మోసగాడు అని ప్రపంచానికి తెలుసు. మరీ ఇంత పచ్చిమోసగాడు, దగా చేస్తాడని తెలీదు. ఎంపీగా సీఎం కార్యక్రమాలకు నేను అటెండ్‌ కావాలి అది ప్రోటోకాల్‌. నా విషయంలో టీడీపీ ప్రొటోకాల్‌ మరిచిపోయింది. సీఎం కార్యక్రమాలకు బాబు నన్ను హాజరు కానివ్వలేదు. చంద్రబాబు ఏపీకి పనికీ రాని వ్యక్తి. 

టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించా.  నా రాజీనామా అమోదం పొందగానే వైఎస్సార్‌సీపీలో చేరుతా. విజయవాడ అంటే ప్రాణం ఏమైనా చేస్తా. 2014 నుచి 2019 వరకు విజయవాడ కోసం చంద్రబాబు రూ. 100 కోట్లైనా ఇచ్చాడా. విజయవాడ కోసం నేను చేశా. షాజహాన్‌ తాజ్‌మహాల్‌ కట్టాడు, నేను అమరావతి కడతానని బాబు గొప్పలు చేశారు. విజయవాడ ఒక రియాలిటీ, అమరావతి ఒక కల. నేను బాబును ఎప్పుడూ టికెట్‌ అడగలేదు.. ఇప్పుడు సీఎం జగన్‌ను కూడా అడగను. ఇప్పుడు జగన్‌తో ప్రయాణం చేయాలనుకుంటున్నా. ఎన్టీఆర్‌ జిల్లాలో టీడీపీ 60 శాతం ఖాళీ అవబోతుంది.’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement