motor sports
-
మోటార్ స్పోర్ట్ టీమ్ యజమానిగా నాగ చైతన్య
సాక్షి, హైదరాబాద్: మోటార్ స్పోర్ట్ రేసింగ్‌లో తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య భాగమయ్యాడు. ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్)లో ఒక జట్టయిన ‘హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్’ను అతను కొనుగోలు చేశాడు. ఇండియన్ రేసింగ్ లీగ్ గత సీజన్లో నాలుగు రేస్‌లు గెలిచిన ఈ టీమ్ త్వరలో తొలిసారి నిర్వహించనున్న ‘ ఎఫ్ఐఏ ఫార్ములా–4 ఇండియన్ చాంపియన్‌షిప్’లో కూడా పాల్గొనబోతోంది. 2022 సీజన్లో బ్లాక్‌బర్డ్స్ జట్టుకే చెందిన అఖిల్ రవీంద్ర డ్రైవర్స్ టైటిల్ విజేతగా నిలిచాడు. టీమ్ చాంపియన్íÙప్లో బ్లాక్ బర్డ్స్‌కు రెండో స్థానం దక్కింది. అఖిల్‌తో పాటు స్విట్జర్లాండ్‌కు చెందిన నీల్ జానీ ఈ టీమ్‌లో మరో డ్రైవర్‌గా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మోటార్ రేసింగ్‌ను ఎంతో ఇష్టపడే తాను ఇప్పుడు టీమ్ యజమానిగా రేసింగ్ బృందంలో భాగం కావడం సంతోషంగా ఉందని నాగచైతన్య వ్యాఖ్యానించాడు. -
స్త్రీ శక్తి: బ్యాక్ ఆన్ ది బైక్ పడి లేచిన కెరటం
ఫిమేల్ మోటర్ స్పోర్ట్స్ అథ్లెట్‌గా ప్రయాణం సులువేమీ కాదు. మద్దతు ఇచ్చే వాళ్ల కంటే వద్దనే వాళ్లే ఎక్కువ... దీనికి ఐశ్వర్య మినహాయింపు కాదు. మొన్న...‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అని ఆశ్చర్యంగా అడిగారు. నిన్న... ‘స్లోయెస్ట్ బైకర్’ అని ముఖం మీదే అన్నారు. ఇప్పుడు మాత్రం... ఐశ్వర్య గురించి ‘ఆశాకిరణం లాంటి ప్రొఫెషనల్ బైకర్’ అంటున్నారు... బెంగళూరుకు చెందిన ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి బైక్‌లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో నాన్న బైక్ ఉండేది. ప్రతి ఆదివారం ఆ బైక్‌పై తనను ఏదో ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళుతుండేవాడు. ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన తరువాత ఐశ్వర్యకు బైకే లోకం అయింది. ఫ్రెండ్స్‌ను తీసుకొని రోజూ బైక్‌పై చక్కర్లు కొట్టేది. ఇలా తిరుగుతున్న రోజుల్లో ఒకసారి టీవిలో మోటోజీపి రేస్ చూసి ‘వావ్’ అనుకుంది. అలాంటి రేస్‌లో ఒకరోజు తాను భాగం అవుతానని అనుకోలేదు ఐశ్వర్య. ఇక అది మొదలు... మోటర్‌స్పోర్ట్స్, మోటర్‌స్పోర్ట్స్ అథ్లెట్ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. నిజంగా చెప్పాలంటే అదొక ప్రపంచం! నిన్నటివరకు బైకింగ్ అనేది తనకు సరదా మాత్రమే. క్రికెట్, ఫుట్‌బాల్‌లాగే అది కూడా ఒక ఆట అని, దానిలో నిరూపించుకుంటే అంతర్జాతీయస్థాయికి వెళ్లవచ్చు అని తెలిశాక ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రైనింగ్, రేసింగ్తోనే రోజులు గడిచేవి. అయితే ఐశ్వర్య అమ్మానాన్నలకు, వారి అమ్మా, నాన్నలకు ఆమెను పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్‌గా చూడాలనేది కల. అయితే వారొకటి తలిస్తే ఐశ్వర్య కల ఒకటి తలిచింది. తండ్రి ససేమిరా అన్నాడు. తల్లి మాత్రం పట్టువిడుపు ధోరణి ప్రదర్శిస్తూ మద్దతు ఇచ్చేది. 2018లో కొద్దిమందితో కలిసి జోర్డీ అనే కోచ్ దగ్గర శిక్షణ తీసుకుంది. జోర్డీ సలహా మేరకు బజా అరగాన్, స్పెయిన్‌లో పాల్గొని ఫస్ట్ ఫిమేల్ ఇండియన్‌గా చరిత్ర సృష్టించింది ఐశ్వర్య. (స్పానిష్ బజా...స్పెయిన్‌లోని అరగన్ ప్రాంతంలో జరిగే ర్యాలీ రైడ్ లేదా క్రాస్–కంట్రీ ర్యాలీ. ఆఫ్రికన్ ఎడ్వెంచరస్ ర్యాలీలను స్ఫూర్తిగా తీసుకొని 1983లో దీనిని దేశంలో మొదలుపెట్టారు) ఆరుసార్లు నేషనల్ రోడ్రేసింగ్ ర్యాలీ ఛాంపియన్‌గా నిలిచింది. 2019లో మోటర్ స్పోర్ట్స్‌లో వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. తన సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మోటర్‌స్పోర్ట్స్ లో మన దేశానికి సంబంధించి గట్టిగా వినిపిస్తున్న పేర్లలో ఐశ్వర్య పేరు ఒకటి. ‘నిజానికి మా కుటుంబంలో మోటర్‌స్పోర్ట్స్ గురించి తెలిసిన వారు లేరు. వరల్డ్ ఛాంపియన్షిప్ గురించి గైడ్ చేసేవారు కూడా లేరు. నాకు నేనే తెలుసుకుంటూ వెళ్లాను. రేస్‌లలో పాల్గొనడం ద్వారా ఎంతోమందితో మాట్లాడి, వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది’ అంటుంది ఐశ్వర్య. ‘ప్లాన్ బీ’ లేదా సెకండ్ కెరీర్ అనేవి ఉండాలి అంటారు. అయితే ఒక రంగంలోకి, ఒక లక్ష్యం కోసం దిగిన వారు ‘ప్లాన్ బీ’ గురించి ఆలోచించవద్దు అంటుంది ఐశ్వర్య. ‘ఈ రంగంలో రాణించకపోతే నెక్స్›్టఏమిటి? అని ఎప్పుడూ ఆనుకోలేదు. కచ్చితంగా సాధించాల్సిందే అనుకున్నాను’ అంటుంది ఐశ్వర్య. స్పెయిన్‌లో మహిళలు మోటర్‌స్పోర్ట్స్‌లో రాణించడానికి అనువైన వాతావరణం, మౌలిక వసతులు ఉన్నాయి. కుటుంబ మద్దతు కూడా బలంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మన దేశంలో కూడా రావాలని కోరుకుంటుంది ఐశ్వర్య. మోటర్ స్పోర్ట్స్ అంటే పరాజయాలు, విజయాలు మాత్రమే కాదు... గట్టి గాయాలు కూడా. ఒక ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది ఐశ్వర్య. ఇక ఆమె నడవడం కూడా కష్టమే అనుకున్నారంతా. అయితే ‘బ్యాక్ ఆన్ ది బైక్’ అంటూ మళ్లీ విజయపథంలో దూసుకుపోవడానికి ఎంతోకాలం పట్టలేదు! -
ఐదోస్థానంలో చల్లా చైతన్య
సాక్షి, హైదరాబాద్: ఇసుజు ఆర్ఎఫ్సీ ఇండియా ఆఫ్‌రోడ్ మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్లో హైదరాబాద్ రేసర్ చల్లా చైతన్య మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గోవాలో జరుగుతోన్న ఈ రేసులో మూడోరోజు పోటీలు ముగిసేసరికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. అత్యంత కఠినమైన, ప్రత్యేకమైన 6–9 స్టేజ్‌లు పూర్తయ్యేసరికి చైతన్య (కో డ్రైవర్ శబరీశ్ జాగారపు) నిర్ణీత 900 పాయింట్లకు గానూ 526 పాయింట్లు సాధించి ఐదోస్థానంలో ఉన్నాడు. చండీగఢ్‌కు చెందిన సన్బీర్ సింగ్ ధలివాల్ 687 పాయింట్లతో అగ్రస్థానంలో, కూర్గ్‌కు చెందిన వెటరన్ డ్రైవర్ జగత్ నంజప్ప 669 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. మలేసియా డ్రైవర్ మెర్విన్ లిమ్ 567 పాయింట్లతో మూడోస్థానాన్ని దక్కించుకోగా, నాలుగో స్థానంలో డిఫెండింగ్ చాంపియన్ గుర్మీత్ విర్దీ (చండీగఢ్, 565) ఉన్నాడు. -
రయ్ రయ్
గాలిని గేలి చేసే వేగం.. ట్రాక్‌పై దుమ్మురేపే సాహసం.. విజయం కోసం దూసుకెళ్లే నైజం.. మోటార్ స్పోర్ట్స్‌లో కనిపిస్తుంటాయి. విదేశీ ట్రాక్స్‌పై హల్చల్ చేస్తున్న రేసింగ్.. ఇప్పుడిప్పుడే సిటీలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక రేసర్లను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి.. రేసింగ్ మెళకువలు నేర్పిస్తోంది హైదరాబాద్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్. బైక్ రేసింగ్‌పై ఆసక్తి ఉన్న వారందరినీ ఈ క్లబ్లో చేర్చుకొని.. అనుభవజ్ఞులతో ‘స్పీడ్ ఆన్ ట్రాక్’ రేసింగ్ పాఠాలు నేర్పి బెస్ట్ రేసర్లుగా తీర్చిదిద్దుతోంది. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో జరిగే మోటార్ స్పోర్ట్స్ బైక్ ఈవెంట్లలో పాల్గొనేలా రేసర్లను ప్రోత్సహిస్తోంది. బంజారాహిల్స్‌లోని ముఫకంజా కాలేజీలో శనివారం హెచ్ఎంసీ సభ్యులు స్టంట్లతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఇటీవల గోవాలో జరిగిన ఇండియా బైక్ వీక్-2015లో కొల్లగొట్టిన అవార్డులను ప్రదర్శించారు. ..:: వాంకె శ్రీనివాస్ లియాఖత్ అలీ జునైద్‌కు బైక్ రేసింగ్ అంటే మహా సరదా. పదో తరగతిలోనే వాళ్ల నాన్న బైక్ తీసుకుని రోడ్లపై చక్కర్లు కొట్టేవాడు. వాయువేగంతో దూసుకెళ్తూ అదిరిపోయే స్టంట్లు చేసేవాడు. కట్ చేస్తే.. చదువు పూర్తయింది. జూట్ 24 ఫుట్‌వేర్ బిజినెస్ ప్రారంభించాడు. కెరీర్ జర్నీ హ్యాపీగా ఉన్నా.. మనోడి మనసు మాత్రం బైక్ చుట్టూనే షికార్లు కొట్టేది. ఆ ఇష్టమే అతగాడిని మళ్లీ బైక్ రేసింగ్ వైపు మళ్లించింది. అదే ఊపులో పలు నగరాల్లో జరిగే రేస్ ఈవెంట్లలో రయ్‌మని దూసుకెళ్లాడు. మోటార్ స్పోర్ట్స్‌కు విదేశాల్లో ఉన్నంత ఆదరణ ఇక్కడ ఎందుకు లేదో ఆలోచించాడు. రేసింగ్‌పై ఇక్కడి యువతకు క్రేజ్ ఉన్నా.. సరైన వేదిక లేదని గ్రహించాడు. రేసింగ్‌లో ఆసక్తి ఉన్నవారందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తే బాగుంటుందని అనుకున్నాడు. 2014 నవంబర్‌లో హైదరాబాద్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్‌కు నాంది పలికాడు. మెగాస్పీడ్.. స్పోర్ట్స్ క్లబ్ విస్తరణలో భాగంగా యమహా ఆర్డీ 350 బైక్ రేసింగ్‌తో జావేద్ 350గా పేరు తెచ్చుకున్న జావేద్ఖాన్ను కలిశాడు అలీ. ఆయనతో పాటు హైదరాబాద్ షూమేకర్‌గా పేరున్న జహంగీర్‌ను కూడా తన టీమ్‌లో చేరమని కోరాడు. ఇలా ఒక్క అలీతో మొదలైన హెచ్ఎంసీ క్లబ్లో నేడు 25 మంది రేసర్లు ఉన్నారు. లోనవాలలోని అంబీవల్లి దగ్గర జనవరిలో జరిగిన ‘ద వల్లీ రన్-2015’లో హెచ్ఎంసీ టీమ్ సభ్యులు ఎనిమిది మంది పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఐదు ట్రోఫీలు గెలుచుకున్నారు. ఇదే స్ఫూర్తితో ఫిబ్రవరిలో గోవాలో జరిగిన ‘ఇండియా బైక్ ఈవెంట్’లో 15 కేటగిరిల్లో తొమ్మిదింట్లో విజయం సాధించి హైదరాబాద్ సత్తా చాటారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ ఈవెంట్లలో ఇండియా తరఫున దూసుకెళ్తామని చెబుతున్నారు హెచ్ఎంసీ సభ్యులు. మోటార్ స్పోర్ట్స్‌పై ఆసక్తి ఉన్నవారికి మా క్లబ్ ఎప్పుడూ స్వాగతం పలుకుతుందంటున్నారు. ‘మన సిటీలో బైక్ రేసింగ్ ప్రాక్టీస్ చేసేందుకు మౌలిక వసతులు లేవు. ప్రభుత్వం చొరవ తీసుకుని కావాల్సిన సౌకర్యాలు కల్పించాల’ని కోరుతున్నాడు మరో బైకర్ జావేద్ ఖాన్. ఆ నలుగురు.. యువతలో ఉన్న ప్రతిభకి సానబెట్టి బెస్ట్ రైడర్లుగా మారుస్తున్న హెచ్ఎంసీ జట్టు.. మోటార్ స్పోర్ట్స్‌లో కప్పు కొట్టడమే లక్ష్యం అని చెబుతోంది. ఈ క్రమంలో రేసర్‌గా తానేంటో నిరూపించుకున్న జునైద్ అలీ.. యువ రైడర్లకు గురువుగా కూడా పాఠాలు చెబుతున్నాడు. నేషనల్ లెవల్ స్పోర్ట్స్ ఈవెంట్లలో రైడర్లకు జావేద్ ఖాన్ మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ రేంజ్ ఈవెంట్లలో పాల్గొనదలచిన వారికి మీర్జా జహంగీర్, ఇండియన్ క్రూజర్ ప్లస్ రైడర్లకు మరో రేసర్ హసన్ రైడింగ్ టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. సామాజిక బాధ్యత... ట్రాక్ ఎక్కితే వాయువేగంతో దూసుకెళ్లే ఈ క్లబ్ మెంబర్స్.. సిటీ రోడ్లపై మాత్రం కామన్ స్పీడ్‌లోనే వెళ్తామని చెబుతున్నారు. రోడ్లపై మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల మనతో పాటు ఇతరుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. రేసింగ్‌పై ఆసక్తి ఉన్నవారు అనుభవజ్ఞులైన రైడర్ల దగ్గర మెళకువలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. రేసింగ్ పోటీలను కాలక్షేపానికే కాకుండా.. సామాజిక బాధ్యతలు పంచుకునే వేదికగా మలుచుకుంది హెచ్ఎంసీ. మెన్ అగెనైస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ (మర్డ్)పై రేసింగ్ ఈవెంట్లలో అవగాహన కల్పిస్తోంది. మగవాళ్లతో ఆడవాళ్లను సమానంగా గౌరవించాలన్న థీమ్‌ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.