రయ్ రయ్ | racing of bikes | Sakshi
Sakshi News home page

రయ్ రయ్

Published Sat, Feb 28 2015 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

రయ్ రయ్

రయ్ రయ్

గాలిని గేలి చేసే వేగం.. ట్రాక్‌పై దుమ్మురేపే సాహసం.. విజయం కోసం దూసుకెళ్లే నైజం.. మోటార్ స్పోర్ట్స్‌లో కనిపిస్తుంటాయి. విదేశీ ట్రాక్స్‌పై హల్‌చల్ చేస్తున్న రేసింగ్.. ఇప్పుడిప్పుడే సిటీలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక రేసర్లను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి.. రేసింగ్ మెళకువలు నేర్పిస్తోంది హైదరాబాద్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్.

బైక్ రేసింగ్‌పై ఆసక్తి ఉన్న వారందరినీ ఈ క్లబ్‌లో చేర్చుకొని.. అనుభవజ్ఞులతో ‘స్పీడ్ ఆన్ ట్రాక్’ రేసింగ్ పాఠాలు నేర్పి బెస్ట్ రేసర్లుగా తీర్చిదిద్దుతోంది. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో జరిగే మోటార్ స్పోర్ట్స్ బైక్ ఈవెంట్‌లలో పాల్గొనేలా రేసర్లను ప్రోత్సహిస్తోంది. బంజారాహిల్స్‌లోని ముఫకంజా కాలేజీలో శనివారం హెచ్‌ఎంసీ సభ్యులు స్టంట్‌లతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఇటీవల గోవాలో జరిగిన ఇండియా బైక్ వీక్-2015లో కొల్లగొట్టిన అవార్డులను ప్రదర్శించారు.
 ..:: వాంకె శ్రీనివాస్
 
లియాఖత్ అలీ జునైద్‌కు బైక్ రేసింగ్ అంటే మహా సరదా. పదో తరగతిలోనే వాళ్ల నాన్న బైక్ తీసుకుని రోడ్లపై చక్కర్లు కొట్టేవాడు. వాయువేగంతో దూసుకెళ్తూ అదిరిపోయే స్టంట్‌లు చేసేవాడు. కట్ చేస్తే.. చదువు పూర్తయింది. జూట్ 24 ఫుట్‌వేర్ బిజినెస్ ప్రారంభించాడు. కెరీర్ జర్నీ హ్యాపీగా ఉన్నా.. మనోడి మనసు మాత్రం బైక్ చుట్టూనే షికార్లు కొట్టేది. ఆ ఇష్టమే అతగాడిని మళ్లీ బైక్ రేసింగ్ వైపు మళ్లించింది.

అదే ఊపులో పలు నగరాల్లో జరిగే రేస్ ఈవెంట్లలో రయ్‌మని దూసుకెళ్లాడు. మోటార్ స్పోర్ట్స్‌కు విదేశాల్లో ఉన్నంత ఆదరణ ఇక్కడ ఎందుకు లేదో ఆలోచించాడు. రేసింగ్‌పై ఇక్కడి యువతకు క్రేజ్ ఉన్నా.. సరైన వేదిక లేదని గ్రహించాడు. రేసింగ్‌లో ఆసక్తి ఉన్నవారందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తే బాగుంటుందని అనుకున్నాడు. 2014 నవంబర్‌లో హైదరాబాద్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్‌కు నాంది పలికాడు.
 
మెగాస్పీడ్..
స్పోర్ట్స్ క్లబ్ విస్తరణలో భాగంగా యమహా ఆర్డీ 350 బైక్ రేసింగ్‌తో జావేద్ 350గా పేరు తెచ్చుకున్న జావేద్‌ఖాన్‌ను కలిశాడు అలీ. ఆయనతో పాటు హైదరాబాద్ షూమేకర్‌గా పేరున్న జహంగీర్‌ను కూడా తన టీమ్‌లో చేరమని కోరాడు. ఇలా ఒక్క అలీతో మొదలైన హెచ్‌ఎంసీ క్లబ్‌లో నేడు 25 మంది రేసర్లు ఉన్నారు. లోనవాలలోని అంబీవల్లి దగ్గర జనవరిలో జరిగిన ‘ద వల్లీ రన్-2015’లో హెచ్‌ఎంసీ టీమ్ సభ్యులు ఎనిమిది మంది పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఐదు ట్రోఫీలు గెలుచుకున్నారు.
 
ఇదే స్ఫూర్తితో ఫిబ్రవరిలో గోవాలో జరిగిన ‘ఇండియా బైక్ ఈవెంట్’లో 15 కేటగిరిల్లో తొమ్మిదింట్లో విజయం సాధించి హైదరాబాద్ సత్తా చాటారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ ఈవెంట్లలో ఇండియా తరఫున దూసుకెళ్తామని చెబుతున్నారు హెచ్‌ఎంసీ సభ్యులు. మోటార్ స్పోర్ట్స్‌పై ఆసక్తి ఉన్నవారికి మా క్లబ్ ఎప్పుడూ స్వాగతం పలుకుతుందంటున్నారు. ‘మన సిటీలో బైక్ రేసింగ్ ప్రాక్టీస్ చేసేందుకు మౌలిక వసతులు లేవు. ప్రభుత్వం చొరవ తీసుకుని కావాల్సిన సౌకర్యాలు కల్పించాల’ని కోరుతున్నాడు మరో బైకర్ జావేద్ ఖాన్.
 
ఆ నలుగురు..
యువతలో ఉన్న ప్రతిభకి సానబెట్టి బెస్ట్ రైడర్లుగా మారుస్తున్న హెచ్‌ఎంసీ జట్టు.. మోటార్ స్పోర్ట్స్‌లో కప్పు కొట్టడమే లక్ష్యం అని చెబుతోంది. ఈ క్రమంలో రేసర్‌గా తానేంటో నిరూపించుకున్న జునైద్ అలీ.. యువ రైడర్లకు గురువుగా కూడా పాఠాలు చెబుతున్నాడు. నేషనల్ లెవల్ స్పోర్ట్స్ ఈవెంట్లలో రైడర్లకు జావేద్ ఖాన్ మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ రేంజ్ ఈవెంట్లలో పాల్గొనదలచిన వారికి మీర్జా జహంగీర్, ఇండియన్ క్రూజర్ ప్లస్ రైడర్లకు మరో రేసర్ హసన్ రైడింగ్ టెక్నిక్స్ నేర్పిస్తున్నారు.
 
సామాజిక బాధ్యత...
ట్రాక్ ఎక్కితే వాయువేగంతో దూసుకెళ్లే ఈ క్లబ్ మెంబర్స్.. సిటీ రోడ్లపై మాత్రం కామన్ స్పీడ్‌లోనే వెళ్తామని చెబుతున్నారు.  రోడ్లపై మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల మనతో పాటు ఇతరుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. రేసింగ్‌పై ఆసక్తి ఉన్నవారు అనుభవజ్ఞులైన రైడర్ల దగ్గర మెళకువలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. రేసింగ్ పోటీలను కాలక్షేపానికే కాకుండా.. సామాజిక బాధ్యతలు పంచుకునే వేదికగా మలుచుకుంది హెచ్‌ఎంసీ. మెన్ అగెనైస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ (మర్డ్)పై రేసింగ్ ఈవెంట్లలో అవగాహన కల్పిస్తోంది. మగవాళ్లతో ఆడవాళ్లను సమానంగా గౌరవించాలన్న థీమ్‌ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement